అభ్యంతరాల్లేని భూములను రెగ్యులరైజ్ చేయండి : సీఎం చంద్రబాబు

జీఎస్టీ సంస్కరణల వల్ల రాష్ట్ర ప్రజలకు రూ.8 వేల కోట్ల మేర ప్రయోజనం ప్రతీ ఏటా కలుగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు

అభ్యంతరాల్లేని భూములను రెగ్యులరైజ్ చేయండి : సీఎం చంద్రబాబు

అమరావతి, సెప్టెంబర్ 16 : జీఎస్టీ సంస్కరణల వల్ల రాష్ట్ర ప్రజలకు రూ.8 వేల కోట్ల మేర ప్రయోజనం ప్రతీ ఏటా కలుగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. అభ్యంతరాల్లేని భూములను రెగ్యులరైజ్ చేయాలని ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం ఐదో బ్లాకులో రెవెన్యూ, భూములు, ఆదాయార్జన శాఖలపై కలెక్టర్ల సదస్సులో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ‘రెవెన్యూ విభాగానికి వచ్చే ఫిర్యాదుల్లో 70 శాతం మేర ఆర్ఓఆర్ కు సంబంధించిన ఫిర్యాదులే ఉన్నాయి. గత పాలకుల తప్పులతో ఈ స్థాయిలో రెవెన్యూ, భూ వివాదాల ఫిర్యాదులు వచ్చాయి. వివిధ ధృవీకరణ పత్రాలకు సంబంధించి ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి రాకూడదు. 2027 కంటే ముందే రీసర్వే ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రయత్నించండి. రికార్డులన్నీ ప్రక్షాళన చేయటమే లక్ష్యంగా పని చేయాలి. జియో ట్యాగింగ్, క్యూఆర్ కోడ్ కూడా పెట్టి రికార్డులు ఇస్తాం. గ్రామ కంఠంలోని ఆస్తులకు స్వామిత్వ పథకం కింద యాజమాన్య పత్రాలు ఇచ్చేందుకు ప్రణాళికలను సిద్దం చేయాలి. రెవెన్యూలో టెక్నాలజీ ఇంటిగ్రేషన్ త్వరితగతిన పూర్తి చేయాలి’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

ధరలు తగ్గిన విధానం ప్రజలకు తెలపండి
గ్రామస్థాయి వరకూ ఏ వస్తువుకు ఎంత పన్ను తగ్గిందన్న అంశాలను ప్రజలకు తెలిసేలా ప్రకటన జారీ చేయాలని చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. జీవిత బీమా, ఆరోగ్య బీమాపై ఇప్పుడు జీఎస్టీ లేదని, ఈ క్రమంలో యూనివర్సల్ హెల్త్ కార్డ్ పై ఏ మేరకు ప్రయోజనం కలుగుతుందో అంచనా వేయాలన్నారు. జీఎస్టీ పన్నుల తగ్గింపు ప్రయోజనాలపై నెల రోజుల పాటు అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. యోగాంధ్ర లాగా జీఎస్టీ సంస్కరణల విషయంలోనూ అదే స్థాయిలో ప్రచారం చేయాలని సూచించారు. సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 22 వరకూ ప్రజల్లో అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు పాల్గోనెలా కార్యాచరణ రూపొందించాలని చంద్రబాబు సూచించారు. ప్రభుత్వ ఆదాయం తగ్గకుండా జిల్లా కలెక్టర్లు ఫోకస్ పెట్టాలన్నారు. ఉచిత ఇసుక విధానంలో ప్రజల్లో సంతృప్తి స్థాయి రావాలన్నారు. ఉచిత ఇసుక విధానంపై ప్రజల సంతృప్త స్థాయి మరింతగా పెరగాల్సి ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. బీపీఎస్-ఎల్ఆర్ఎస్ స్కీమ్ పై ఫోకస్ పెట్టాలన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్సైజ్ శాఖను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.