Raitu Bharosa funds| రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు !

తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగియగానే అర్హులైన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయనున్నారు. ఇందుకోసం అవసరమైన నిధుల సమీకరణ ప్రక్రియ పూర్తి చేశారు.

Raitu Bharosa funds| రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు !

విధాత, హైదరాబాద్ : యాసంగి రైతు భరోసా పథకం నిధులు రైతుల ఖాతాల్లో వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లతో సిద్దమైంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగియగానే అర్హులైన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయనున్నారు. ఇందుకోసం అవసరమైన నిధుల సమీకరణ ప్రక్రియ పూర్తి చేశారు.  తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎకరాకు రూ. 6000చొప్పున పెట్టుబడి సహాయం అందిస్తుంది.

రైతు భరోసా నిధుల సమీకరణలో భాగంగా ఆర్బీఐ నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.9వేల కోట్ల రుణాన్ని తీసుకుంది. ఇందుకోసం ఆర్బీఐకి ఇండెంట్ సమర్పించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి ఇంత భారీ మొత్తం రుణం తీసుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. రూ.9000 కోట్ల రుణాన్ని 13 సంవత్సరాల కాలపరిమితితో రూ.2000 కోట్లు, 16 ఏళ్లకు మరో రూ.2000 కోట్లు, 21 ఏళ్ల కాలపరిమితితో రూ.2500 కోట్లు, 27 ఏళ్లకు రూ.2500 కోట్లు చొప్పున రుణం తీసుకోనుంది. ఫిబ్రవరి 10వ తేదీన ఆర్బీఐ ఈ- వేలం నిర్వహించనుంది. ఈ వేలం ద్వారా 9 వేలకోట్ల రుణం తెలంగాణ ప్రభుత్వ ఖజానాలో జమా కానున్నాయి.

యాసంగి రైతు భరోసా నిధులను మున్సిపల్ ఎన్నికలు ముగియగానే రైతుల ఖాతాల్లో వేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలింగ్ ముగిసిన మూడు నాలుగు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లుగా సమాచారం.

ఇదే నెలలో పీఎం కిసాన్ నిధులు

ఇదే నెలలో పీఎం కిసాన్ నిధులు రూ.2వేలు కూడా రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. కేంద్రం ఏటా మూడు విడతల్లో  కలిపి  రూ.6000చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. గతేడాది నవంబర్‌లో పీఎం కిసాన్ 21వ విడత డబ్బును ఇచ్చిన కేంద్రం.. ఫిబ్రవరిలోనే 22వ విడత నిధులు రైతులకు జమ చేయాల్సి ఉంది. ఆ ప్రకారమే ఈసారి కూడా ఫిబ్రవరి 20 తర్వాత పీఎం కిసాన్ నిధుల పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయి.