Telangana Ministers Rift | మంత్రుల మధ్య సఖ్యత లేదా? తలోదారిగా తెలంగాణ అమాత్యులు!
తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) మంత్రులంతా (ministers) కలిసే ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ.. ఒకరితో ఒకరికి సఖ్యత (rift ) కొరవడిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వైపు ఒక శాఖ ఆధ్వర్యంలో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చలు జరుగుతుంటే.. మరో శాఖ నుంచి.. గతంలో ప్రైవేటు కాలేజీల అక్రమాలపై నిర్వహించిన విజిలెన్స్ విచారణ (Vigilance probe on colleges) విషయంలో చర్యలు తీసుకోనున్నారన్న లీకులు రావడం ఇందుకు తాజా నిదర్శనంగా నిలుస్తున్నదని పరిశీలకులు అంటున్నారు.

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విధాత):
Telangana Ministers Rift | రాష్ట్రంలో పదేళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కొందరు మంత్రుల మధ్య సఖ్యత అంతగా లేదనే వ్యాఖ్యలు సచివాలయంలో విన్పిస్తున్నాయి. ముఖ్యమైన అంశాల విషయంలో నిర్ణయాలు తీసుకోవడంతో కొంత అలక్ష్యం వహిస్తున్నారని, ఫలితంగా సంబంధిత వర్గాలు కొంత నష్టపోతున్నాయని అంటున్నారు. దీనికి సంబంధించి ఇంజినీరింగ్, వృత్తి విద్యా కాలేజీల ఫీజు రీయింబర్స్ మెంట్ వ్యవహారం తాజా ఉదాహరణగా నిలుస్తున్నదని చెబుతున్నారు. ఈ అంశమై సీనియర్ మంత్రులు సంబంధిత యాజమాన్యాలతో చర్చిస్తుండగానే, బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన విజిలెన్స్ విచారణపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతుందనే వార్తలు బయటకు పొక్కాయి. దీంతో కాలేజీల యాజమాన్యాలకు షాక్ తగిలినట్టయింది. తాము మంత్రుల బృందంతో చర్చిస్తుండగానే, ఈ వార్తలు మీడియాలో రావడంపై ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని తాము అర్థం చేసుకున్నామని, అయినా ఇంకా పరోక్షంగా ఒత్తిడి చేయడమేంటని కాలేజీ యాజమాన్యాల సంఘాలు చర్చించుకున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వ ఆదేశాలకు తలొగ్గిన కాలేజీ యాజమాన్యాలు.. మధ్యేమార్గంగా షరతులకు అంగీకరించి మూసివేత నిర్ణయాన్ని విరమించుకోవాల్సి వచ్చిందని అంటున్నారు.
క్యాబినెట్‌లో ఎక్కువ మంది సీనియర్లే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో నలుగురైదుగురు మినహా అందరూ సీనియర్లే ఉన్నారు. గత కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో పనిచేసి విశేషమైన అనుభవం వారి సొంతం. మొదటిసారి మంత్రివర్గంలోకి వచ్చిన వారు కూడా పద్ధతిగానే పనిచేస్తున్నారు. వీరు హైదరాబాద్‌లో ఉన్నట్లయితే తప్పనిసరిగా సచివాలయానికి వచ్చి వెళ్తున్నారు. జిల్లాల్లో ఉన్నట్లయితే ఎక్కువగా నియోజకవర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కొందరు మంత్రులు, తమ శాఖలతో పాటు నియోజవకవర్గంలోని పనులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ.. ఈ పనుల ఫైళ్లు సంబంధిత శాఖల మంత్రుల వద్దకు వెళ్లినప్పుడు వెంటనే ఆమోదానికి నోచుకోవడం లేదని తెలుస్తున్నది. మంత్రులతో పాటు వారి పేషీల్లో పనిచేసే వాళ్లు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నా వేగంగా కదలకపోవడంతో చేసేదేమీ లేక మంత్రులే స్వయంగా సంబంధిత మంత్రి వద్దకు వెళ్లి, కూర్చుని మాట్లాడి వస్తున్నారు. ఆయా పనులు తమ నియోజకవర్గానికి చెందినవని లేదా తన శాఖకు సంబంధించినదని వివరించి ఆమోదముద్ర వేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ ఫైలు ముందుకు కదలకపోవడంతో కొందరు మంత్రులు నొచ్చుకున్న సందర్భాలు ఉన్నాయని సచివాలయంలోని సీనియర్ అధికారులు చెబుతున్నారు. మంత్రివర్గంలోకి కొత్తగా వచ్చిన మంత్రులు పరిస్థితి కూడా ఏమీ తీసిపోలేదు. ఇటీవల మంత్రివర్గంలో చేరిన ముగ్గురు మంత్రులు చాలా జాగ్రత్తగా, ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తమ శాఖలు, తమ నియోజకవర్గానికి పరిమితం అవుతున్నారు తప్పితే మిగతా విషయాల జోలికి అంతగా వెళ్లడం లేదని అధికారులు చర్చించుకుంటున్నారు.
సమాచార కమిషనర్ల కార్యక్రమానికి ఇతర మంత్రులు డుమ్మా
ఈ ఏడాది మే నెలలో రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ల పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమం బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మినహా మంత్రులు హాజరు కాని విషయం తెలిసిందే. నల్లగొండ జిల్లాలో ఇద్దరు మంత్రుల మధ్య బేధాభిప్రాయాలు ఉన్నాయి. నాగార్జున సాగర్ గేట్లు తెరిచే కార్యక్రమానికి బయలుదేరేందుకు ఒక మంత్రి హైదరాబాద్‌లో సిద్ధంగా ఉండగా మరో మంత్రి ఒక గంట ఆలస్యంగా రావడంతో, ఇదేం పద్ధతంటూ ఆయన కినుక వహించి వెనక్కి వెళ్లిపోయిన ఘటన చూశాం. అయితే ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి బంజారాహిల్స్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వివిధ శాఖల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించడం ఎక్కువైంది. అంతకుముందు తన ఇంటి వద్ద నిర్వహించగా, కొందరు మంత్రులు నొచ్చుకుంటున్నట్లు తెలియడంతో ముఖ్యమంత్రే కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వెళుతున్నారని ఒక అధికారి పేర్కొన్నారు. ఇటీవల మంత్రుల పనితీరుపై ఏ, బీ, సీ, డీ గ్రేడ్లు ఇవ్వగా, ఇవి కూడా వారి మధ్య చిచ్చుపెట్టిందనే వ్యాఖ్యలు గాంధీ భవన్‌లో బలంగానే వినిపిస్తున్నాయి. రెండు నెలలుగా యూరియా సమస్య రాష్ట్రాన్ని కుదిపేస్తున్నా ముఖ్యమంత్రి ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ మంత్రితో సీఎం సమీక్ష నిర్వహించలేదనేది అందరికీ తెలిసిందే. క్రమం తప్పకుండా సమీక్షించడం మూలంగా లోపాలు తెలియడంతో పాటు సరిదిద్ధుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రజల్లో కూడా ముఖ్యమంత్రి యూరియా సమస్యపై శ్రద్ధ వహిస్తున్నారనే సందేశం వెళ్తుందని సంబంధిత శాఖ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్నప్పుడల్లా ముఖ్యమంత్రి సచివాలయానికి వస్తే మంత్రులతో పాటు ఉన్నతాధికారులు కూడా అందుబాటులో ఉంటారని, అందరూ అప్రమత్తమై ఎవరి శాఖల వారీగా వారు పనిచేసుకుంటూ వెళ్తారని అధికారవర్గాలు చెబుతున్నాయి. దీని వల్ల పెండింగ్ పనుల సమస్య తగ్గడంతో పాటు, ఉన్నతాధికారులు కూడా జాగ్రత్త పడతారని, పరిపాలన మరింత వేగంగా సాగుతుందని సచివాలయ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.