మేడారం వివాదం పరిష్కారమా? నలుగురు మంత్రుల సంయుక్త పర్యటనతో సయోధ్య సంకేతాలు

మేడారం జాతర టెండర్ల వివాదం నేపథ్యంలో నెలకొన్న మంత్రుల మధ్య అసమ్మతి పరిష్కారమైందన్న సంకేతాలు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నేడు కలిసి మేడారం పర్యటనకు సిద్ధమయ్యారు. అభివృద్ధి పనుల పరిశీలనతో పాటు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

  • By: TAAZ |    telangana |    Published on : Nov 11, 2025 11:16 PM IST
మేడారం వివాదం పరిష్కారమా? నలుగురు మంత్రుల సంయుక్త పర్యటనతో సయోధ్య సంకేతాలు

ఆ….మంత్రుల మధ్య ‘సయోధ్య’ కుదిరినట్లేనా!
నేడు నలుగురు మంత్రుల మేడారం పర్యటన
హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో మేడారానికి
అభివృద్ధి పనుల పరిశీలన, అధికారిక సమీక్ష

విధాత, ప్రత్యేక ప్రతినిధి:
ఎట్టకేలకు ఆ నలుగురు రాష్ట్ర మంత్రులు ఒక్క తాటిపైకి చేరుకున్నారు. మేడారం జాతర టెండర్ల నేపథ్యంలో మంత్రుల మధ్య తలెత్తిన బహిరంగ వివాదానికి తెరవెనుక మంతనాలతో తిలోదకాలిచ్చారు. మంత్రుల మధ్య సయోధ్య కుదరడంతో కలిసికట్టుగా ముందుకు సాగేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ జోక్యంతో నెలకొన్న ‘రాజీ’ వల్ల ఆ మంత్రులు ఒక్కటైనట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి వరకు ఉప్పూనిప్పుగా ఉంటూ ఒకరిపై ఒకరు బహిరంగంగానే తీవ్రమైన విమర్శలు చేసుకున్న మంత్రులు అందరినీ ‘ఆశ్చర్యానికి’ లోను చేస్తూ కలిసిపోయారు. సమ్మక్క, సారలమ్మ జాతర అభివృద్ధి పనులతో ముడిపడిన ఆ నలుగురు ‘ముఖ్యమైన’ మంత్రులు ఒక్కటిగామేడారం జాతర పనులను సందర్శించేందుకు సంసిద్ధమయ్యారు. బుధవారం నలుగురు మంత్రులు మేడారం పర్యటించనున్నట్లు ప్రకటించారు. మేడారం జరుగుతున్న అభివృద్ధి పనులను నలుగురు మంత్రులు పరిశీలిస్తారు. అనంతరం అధికారిక సమీక్ష నిర్వహిస్తారు.

నేడు మేడారానికి నలుగురు మంత్రులు

బుధవారం మేడారం పర్యటనకు నలుగురు మంత్రులు రానున్నారు. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, ఎస్సీ,ఎస్టీ, గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రానున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ నలుగురు మంత్రులు ప్రస్తుతం హైదరాబాద్ లో నే ఉన్నారు. నలుగురు మంత్రులు కలిసి హెలికాప్టర్ లో రానున్నారు. బుధవారం ఉదయం 9–50 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి 10 గంటలకు మేడారానికి హెలికాప్టర్ లో బయలుదేరి 11 గంటల వరకు రానున్నారు. అనంతరం సమ్మక్క,సారలమ్మలకు మొక్కులు సమర్పించి, అభివృద్ధి పనులు పర్యవేక్షిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు స్థానిక హరిత హోటల్ లో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. తిరిగి 2–30 గంటలకు హెలికాప్టర్ లో మిగిలిన మంత్రులు హైదరాబాద్ కు తిరుగు పయనమవుతారు. సీతక్క స్థానికంగా తన నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంలో పాల్గొని ములుగులోని క్యాంప్ ఆఫీస్ కు చేరుకుంటారు. ఈ మేరకు మంత్రుల పర్యటన నేపథ్యంలో మేడారంలో అవసరమైన ఏర్పాట్లనుచేపట్టడంలో అధికారులు నిమగ్నమయ్యారు.

మంత్రులు విభేదాలు వీడినట్లేనా!?

మేడారం జాతర టెండర్ల అంశంలో మంత్రుల మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ విభేదాలను పక్కనపెట్టి నలుగురు మంత్రులు కలిసిపోయారు. మేడారం జాతర పనుల విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మరో మంత్రి కొండా సురేఖ విమర్శించారు. తన శాఖ పరిధిలోని టెండర్లను తనకు తెలియకుండా మంత్రి పొంగులేటి తన అనుచరులకు ఇప్పించుకున్నారని విమర్శిస్తూ ‘బాంబు’ పేల్చిన విషయం విధితమే. ఈ కారణంతో మేడారం పర్యటనకు మంత్రి పొంగులేటి, మంత్రి సీతక్క వెళ్ళగా మంత్రి సురేఖ గైర్హాజరయ్యారు. సురేఖ ఉద్ధేశ్యపూర్వకంగా ఈ పర్యటనకు దూరంగా ఉన్నారు. పొంగులేటితో నెలకొన్న విభేదాల కారణంగా సురేఖ మేడారం పర్యటనకు దూరంగా ఉన్నారనే వార్తలు కొద్ది రోజుల క్రితం సంచలనం సృష్టించాయి. ఈ మేరకు సురేఖ పొంగులేటి లక్ష్యంగా తన శాఖలో ఆయన పెత్తనమేమిటంటూ మండిపడ్డారు. ఈ వివాదానికి తెరదింపుతూ దేవాదాయ శాఖ పరిధిలోని టెండర్లను రోడ్డు,భవనాల శాఖకు అప్పగించారు. ఈ వివాదం చివరికి సీఎం రేవంత్కూ చుట్టుకున్నది. పదేళ్ళ తర్వాత ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగిస్తే మళ్ళీ, గ్రూపు విభేదాలు, ఆధిపత్య రాజకీయాలకు ఊతమిస్తూ అభివృద్ధిని విస్మరించి మంత్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. సమస్యలుంటే కలిసి పరిష్కరించుకోవాల్సిన మంత్రులు బజారుకెక్కడమేంటని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో సీఎం, పీసీసీ అధ్యక్షుడు, పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ జోక్యంతో మంత్రుల మధ్య రాజీ నెలకొంది. ఈ క్రమంలోనే నలుగురు మంత్రులు బుధవారం మేడారం పర్యటనకు సిద్ధమైనట్లు భావిస్తున్నారు. మేడారంలో పర్యటించి ఇప్పటికే ప్రారంభమైన పనులను పర్యవేక్షించి, అవసరమైన చర్యలు చేపట్టనున్నారు. అయితే మంత్రుల మధ్య ఈ సయోధ్య ఇలాగే సాగుతోందా? అనే అనుమానాలు లేకపోలేదు. కనీసం మేడారం జాతర ముగిసేవరకైనా మంత్రులు తమ తమ శాఖల పరిధిలో జరిగే అభివృద్ధి అంశాలపై కలిసికట్టుగా పనిచేయాలని కోరుతున్నారు.
!!!