Tirumala Tirupathi | తిరుమలవాసా.. చూడు తెలంగాణ గోస!
శ్రీవేంకటేశ్వరుడి కరుణా కటాక్ష వీక్షణాల కోసం భక్తులు తిరుమలకు వెళ్తుంటారు. కానీ.. తెలంగాణ భక్తులకు మాత్రం ఆ అవకాశం దక్కకుండా పోతున్నది. సిఫారసు లేఖల ద్వారా దర్శనం చేసుకోవాలంటే మూడు నెలలు వేచి చూడక తప్పని పరిస్థితులు ఉన్నాయని భక్తులు వాపోతున్నారు.

Tirumala Tirupathi | కలియుగ దైవం తిరుమల కొండ మీద రద్ధీని తగ్గించడానికి అనేక దర్శన మార్గాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అందుబాటులోకి తెచ్చినప్పటికీ భక్తుల రద్ధీ మాత్రం తగ్గడం లేదు. సర్వదర్శనం చేసుకోవాలంటే అలిపిరి మెట్ల మార్గం మీదుగా నడిచివెళ్లాల్సి ఉంటుంది. స్లాటెడ్ దర్శనం కావాలంటే తిరుపతిలో నిర్ధేశించిన కేంద్రాల వద్ద వేకువ జామున నిల్చుంటే తప్ప లభ్యం కావు. సరే పరపతిని ఉపయోగించి తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి సిఫారసు లేఖలు తీసుకుందామంటే అక్కడ వెయిటింగ్ పిరియడ్ మూడు నెలలు తక్కువ లేదు. దేవుడి దర్శనం కోసం సిఫారసు ఉన్నా మూడు నెలల వరకు దర్శనం లభించడం లేదంటే ఎంత దుర్లభమో ఊహించుకోవచ్చు. ఇవన్నీ ఒక ఎత్తైతే రవాణ సౌకర్యం కూడా మరో సమస్య. దర్శనం టికెట్ లభించినా, ప్రయాణించడానికి రైలు రిజర్వేషన్ దొరకదు, బస్సులో వెళ్దామంటే ప్రయాణానికి అనువుగా ఉండటం లేదని భక్తులు వాపోతున్నారు.
మూడు నెలలు వెయిటింగ్ లిస్టు
తెలంగాణలో ఎవరైనా సిఫారసు లేఖ తీసుకుని తిరుమలలో సర్వ దర్శనం, బ్రేక్ దర్శనం కోసం వెళ్లాలంటే కనీసం మూడు నెలలు వెయిట్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని తెలుస్తున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల వద్దకు వెళ్లినా ఇదే సమాధానం విన్పిస్తున్నదని భక్తులు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసులను టీటీడీ స్వీకరిస్తున్నది. వారంలో రెండు రోజులు (సోమ, మంగళవారం) సర్వదర్శనం, మరో రెండు రోజులు (బుధ, గురువారం) బ్రేక్ దర్శనం అవకాశం ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఒక మెలిక ఉంది. ప్రతి రోజూ ఒక ప్రజా ప్రతినిధి ఒక సిఫారసు లేఖ మాత్రమే ఇవ్వాలి. రెండో లేఖ ఇచ్చినా అక్కడ చెల్లుబాటు కాదు. ఒక లేఖపై ఆరుగురికి దర్శనం లభిస్తుంది.
తెలంగాణలో దేవాలయాల అభివృద్ధి లేకపోవడమే కారణమా?
ఒకప్పుడు తెలంగాణ భక్తులకు ఇంతగా వెయిటింగ్ లిస్టు ఉండేది కాదని భక్తులు చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లేఖలు ఇచ్చేవారు కాదని, ఒక వేళ ఇచ్చినా అక్కడ చెల్లుబాటు అయ్యేది కాదని చెబుతున్నారు. ఇంతగా డిమాండ్ పెరగడానికి కారణం తెలంగాణలో దేవాలయాలను అభివృద్ధి చేయకపోవడం, యాదగిరి గుట్ట ఒక్కటే పెద్ద దేవాలయం ఉండటం కూడా మైనస్ అయ్యిందని చెబుతున్నారు. దీంతో ప్రతి ఒక్కరు మంచి జరిగినా, చెడు జరిగినా కలియుగ దైవం దర్శనం కోసం తిరుమలకు బయల్దేరడం కూడా కారణమని చెబుతున్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, హిమాయత్ నగర్ లిబర్టీ శ్రీ వేంకటేశ్వర ఆలయాల్లో పండుగలు, పర్వదినాలు, సెలవు రోజుల్లో రద్ధీగా ఉంటున్నాయి. కొందరు మంత్రులు సచివాలయం నుంచి కాకుండా నియోజకవర్గంలోని క్యాంప్ కార్యాలయం నుంచి సిఫారసు లేఖలు ఇస్తున్నారని సమాచారం. ఎక్కువగా తమ నియోజకవర్గం ప్రజలు లేదంటే జిల్లా ఓటర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారని చెబుతున్నారు. ఇక ఎవరికీ కూడా అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని తెలుస్తున్నది.
తిరుమలలో ఏపీ ఎమ్మెల్యేల పీఆర్వోలు
తెలంగాణ ప్రజా ప్రతినిధుల పరిస్థితి ఇలా ఉంటే ఏపీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు తిరుమలలో ప్రత్యేకంగా పీఆర్వోలను నియమించుకున్నారు. దీంతో నియోజకవర్గం సామాన్య ప్రజలకు సిఫారసు లేఖలు లభ్యం కావడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రతి రోజూ సిఫారసు లేఖలు ఇచ్చే అధికారం ఉండటంతో పీఆర్వోల ద్వారా బయటి వారికి విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తిరుమల కొండపై తాము సిఫారసు లేఖతో వచ్చామని ఏపీకి చెందిన సామాన్య భక్తులు ఎవ్వరూ చెప్పడం లేదంటే వ్యాపారం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని భక్తులు చెబుతున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇవ్వకుండా తిరుమలలో పీఆర్వోల ద్వారా ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సుపధం అయితే ఒక్క టికెట్ కు రూ.3వేలు, బ్రేక్ కు అయితే రూ.7వేల చొప్పున వసూళ్లు చేస్తున్నారని ప్రజలే ఆరోపిస్తున్నారు. ఏపీలో తెలుగుదేశ ప్రభుత్వంపై సామాన్య భక్తుల్లో వ్యతిరేకత పెరగడానికి ఇదో కారణంగా చెబుతున్నారు.
సర్వ దర్శనం
ఎలాంటి టిక్కెట్లు లేకుండానే శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. వీరిని క్యూలైన్ల నుంచి కాంపార్ట్‌మెంట్ల ద్వారా పంపిస్తారు. ఈ కంపార్ట్‌మెంట్లు నిండితే నారాయణగిరి గార్డెన్స్ వద్ద ఉన్న తొమ్మిది కంపార్ట్‌మెంట్లలోకి పంపిస్తుంటారు. ఇవి కూడా నిండితే క్యూలైన్లో నిల్చోక తప్పదు. దర్శనానికి కంపార్ట్‌మెంట్లలో ఉన్న భక్తులకు భోజనం, టీ, పాలు అందచేస్తారు. ఎవరైనా అనారోగ్యం పాలయితే వైద్య సౌకర్యాలు లభిస్తాయి.
స్లాటెడ్ సర్వ దర్శనం
- సర్వ దర్శనం భక్తులకు నిర్ధేశించిన సమయం తెలియపరుస్తూ దర్శనం టోకెన్ ఇస్తారు.
- టోకెన్‌లో పేర్కొన్న ప్రకారం తమకు కేటాయించిన సమయంలో వైకుంఠం–1 నుంచి కంపార్ట్‌మెంట్లలోకి పంపిస్తారు.
- ఈ దర్శనం సాధారణ రోజుల్లో నాలుగైదు గంటలు తీసుకుంటే, రద్ధీ రోజుల్లో ఏడెనిమిది గంటలు క్యూలో ఉండాల్సి ఉంటుంది.
- ఈ టిక్కెట్లు తిరుపతిలోని శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, శ్రీవారి మెట్టు దగ్గర లభ్యమవుతాయి.
- తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి టోకెన్లు ఇవ్వడం ప్రారంభిస్తారు.
- ప్రతి రోజు 14వేల వరకు టోకెన్లు పంపిణీ చేస్తారు.
- ఈ టోకెన్ల కోసం ఒక రోజు ముందుగానే చేరుకుని క్యూ లైన్లో నిలబడాల్సి ఉంటుంది.
- సిఫారసు లేఖలు లేనివారు, అకస్మాత్తుగా వెళ్లేవారికి ఇక్కడ దర్శనం టోకెన్లు ఇస్తారు.
ప్రత్యేక ప్రవేశ దర్శనం
- ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం తిరుమల దేవస్థానం పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్లు తీసుకోవాల్సి ఉంటుంది.
- వీటి కోసం మూడు నెలల ముందుగానే బుక్ చేసుకోవాలి.
- ఆన్‌లైన్‌లో టికెట్ లభ్యమైతే ఒక్కో టికెట్‌కు రూ.300 చెల్లించి, అందులో పేర్కొన్న సమయానికి తిరుమల చేరుకుని వైకుంఠం–1కు చేరుకోవాలి.
- 12 సంవత్సరాల లోపు ఉన్న చిన్నారులకు టికెట్ అవసరం లేదు.
బ్రేక్ దర్శనం
ఏపీ, తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోకసభతో పాటు రాజ్యసభ సభ్యుల సిఫారసు లేఖలతో బ్రేక్ దర్శనం లభిస్తుంది. దీంతోపాటు ఒక గది కూడా కేటాయిస్తారు. ఏపీలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సిఫారసు లేఖలపై కూడా బ్రేక్ దర్శనం ఇస్తారు. ఏపీ ప్రజా ప్రతినిధులకు రోజుకు ఒక లేఖ, ఐఏఎస్, ఐపీఎస్ లకు అయితే వారానికి రెండు లేఖలను అనుమతిస్తారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఇచ్చే లేఖలను వారంలో బుధ, గురువారం మాత్రమే ఆమోదిస్తారు. ఒక లేఖ పై ఆరుగురికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. దర్శనానికి పట్టే సమయం గంట నుంచి రెండు గంటల వరకు.
శ్రీవాణి దర్శనం
ప్రతిరోజు 1500 మందికి శ్రీవాణి దర్శనం టిక్కెట్లను విక్రయిస్తారు. ఆలయ నిర్మాణానికి రూ.10వేలతో పాటు అదనంగా రూ.500 వసూలు చేసి ఒకరికి దర్శనం కల్పిస్తారు. ఈ టికెట్లు తిరుపతి విమానాశ్రయం, తిరుమలలో లభ్యమవుతాయి. మూడు నెలల ముందు ఆన్ లైన్ కూడా కొనుగోలు చేయవచ్చు.