TTD Adulterated Ghee Case | గుర్తు లేదు.. తెలియదు.. సిట్ ప్రశ్నలకు ధర్మారెడ్డి సమాధానాలివే?
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్ వేగం పెంచింది. మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి నోటీసులు, ధర్మారెడ్డిని విచారించిన అధికారులు.
హైదరాబాద్, విధాత ప్రతినిధి:
TTD Adulterated Ghee Case | వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో కల్తీ నెయ్యి వినియోగించి లడ్డూలు తయారు చేశారనే ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశం మేరకు సీబీఐ పర్యవేక్షణలో ఈ విచారణ జరుగుతున్నది. ఈ నెల 11వ తేదీన మాజీ టీటీడీ ఈవో ధర్మారెడ్డి, 13వ తేదీన మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని విచారణకు హాజరు కావాల్సిందిగా సిట్ నోటీసులు ఇచ్చింది. నోటీసు ప్రకారం ఇవాళ ధర్మారెడ్డి తిరుపతి అలిపిరిలోని సిట్ కార్యాలయానికి వచ్చారు. సిట్ డీఐజీ మురళీ లంబా నేతృత్వంలోని అధికారుల బృందం ధర్మారెడ్డిని విచారించింది. టీటీడీ అదనపు ఈవో, ఈవోగా ఎప్పుడు బాధ్యతలు స్వీకరించారు? నెయ్యి కొనుగోలుకు అనుసరించిన విధానాలు? కల్తీ ఘటనపై ఏ చర్యలు తీసుకున్నారు? అనే అంశాలపై ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. అయితే ఆయన ఏ ఒక్క ప్రశ్నకు కూడా సూటిగా జవాబు ఇవ్వకుండా దాటవేశారంటున్నారు. తనకు గుర్తుకు రావడం లేదని, తెలియదని చెప్పారని, కొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉన్నారని సమాచారం. అసలు కల్తీ నెయ్యి వ్యవహారంతో తనకు సంబంధం లేదని ముక్తసరి సమాధానమిచ్చారని తెలుస్తున్నది. అదనపు ఈవోగా పనిచేసిన సమయంలో నెయ్యి సరఫరా చేసే కంపెనీలతో ఎవరు లావాదేవీలు జరిపారని కూడా ప్రశ్నించారు. మరింత సమాచారం కోసం మరోసారి ధర్మారెడ్డిని బుధవారం పిలిచే అవకాశాలున్నాయి. ఈయన హయాంలోనే పెద్ద ఎత్తున నెయ్యి కల్తీ జరిగినట్లు ఆరోపణలున్న విషయం తెలిసిందే. సుమారు నాలుగు గంటల పాటు విచారించారు. విచారణ తరువాత బయటకు వచ్చిన ధర్మారెడ్డికి జనసేన తిరుపతి ఇన్‌చార్జ్ కిరణ్ రాయల్ పవిత్రమైన తిరుమల లడ్డూలు రెండు ఇచ్చేందుకు ప్రయత్నించగా, ఆయన స్వీకరించలేదు. హిందువులు ఎంతో పవిత్రంగా స్వీకరించే లడ్డూను ధర్మారెడ్డి తీసుకోకుండా విసురుగా వెళ్లిపోయారని కిరణ్ విమర్శించారు. లడ్డూను అవమానించిన ధర్మారెడ్డిపై పోలీసు స్టేషన్ కేసు పెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే.. వ్యక్తిగత పనుల కారణంగా లక్నో వెళ్తున్నందున 13వ తేదీన హాజరు కాలేకపోతున్నానని, నవంబర్ 15వ తేదీ తరువాత హాజరవుతానని మాజీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి సిట్ అధికారులకు తెలిపారు. ఈ మేరకు సిట్ అధికారులు మరో తేదీని ఖారారు చేసి ఆయనకు నోటీసు పంపించనున్నారు.
మాజీ సీఎం వైఎస్. జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలోనే శ్రీవారి ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందనేది ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపడంతో, ప్రస్తుత ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేసింది. సుబ్బారెడ్డికి నోటీసుల జారీ వ్యవహారం వైసీపీ శ్రేణుల్లో కలవరం రేపింది. వైవీ సుబ్బారెడ్డి వాంగ్మూలం ఈ కేసులో కొనసాగింది. ఈకేసులో ముఖ్యంగా ఆనాటి దేవాదాయశాఖ మంత్రికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
కల్తీ నెయ్యి కేసును సీబీఐ డీఐజీ మురళి లాంబా ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. 2019-2024 మధ్య తిరుపతి ఆలయానికి రూ.250 కోట్ల విలువైన 68 లక్షల కిలోల నకిలీ నెయ్యి ఇచ్చినట్లు సీబీఐ ఇప్పటికే వెల్లడించింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram