Revanth Reddy : ఉద్యమకారులను అవమానించిందే కేసీఆర్

తెలంగాణ ఉద్యమకారులను అవమానించిందే కేసీఆర్ ప్రభుత్వం అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అక్రమాలపై విచారణకు నోటీసులు ఇస్తే జాతిపిత అవమానమంటారా అని ప్రశ్నించారు.

Revanth Reddy : ఉద్యమకారులను అవమానించిందే కేసీఆర్

విధాత, హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారులను అవమానించిందే కేసీఆర్ ప్రభుత్వం అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇటీవలి కాలంలో ఎవరికి వారే తెలంగా జాతిపితగా చెప్పుకుంటున్నారని, అధికారంలో ఉండి వేలాది ఎకరాలు, వేల కోట్లు అక్రమార్జనలు చేసి నేరాలు పాల్పడితే..పోలీసులు నోటీసులిచ్చి విచారణకు పిలిస్తే జాతిపితను విచారణకు పిలుస్తారా అని అంటున్నారని ఇదేక్కడి ప్రజాస్వామ్యం..ఇదెక్కడి జాతిపిత లక్షణం అని రేవంత్ రెడి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి “రావి నారాయణరెడ్డి జాతీయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం”లో రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడారు.

పద్మ విభూషణ్ దివంగత రావి నారాయణ రెడ్డి స్పూర్తితో తెలంగాణ ప్రగతి కోసం పనిచేస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆనాటి ప్రధాని నెహ్రు కంటే అత్యధిక మెజార్టీతో పార్లమెంటు ఎన్నికల్లో రావి నారాయణరెడ్డి విజయం సాధించి చరిత్ర సృష్టించారన్నారు. రావి నారాయణ రెడ్డికి లభించిన ప్రజాదరణను గౌరవించి పార్లమెంటు భవనాన్ని ఆయనతో ప్రధాని నెహ్రు ప్రారంభించి గౌరవించి ఆదర్శంగా నిలిచారన్నారు. భూమి కోసం, భుక్తి కోసం , విముక్తి కోసం, స్వేచ్చ, స్వాతంత్రాల కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాట నాయకుడిగా, కమ్యూనిష్టు ఉద్యమనేతగా ప్రజల్లో, చట్టసభల్లో ప్రజల కోసం నారాయణ రెడ్డి చేసిన పోరాటాలు చిరస్మరణీయమన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటం ప్రపంచ చరిత్రలో నిలిచిపోయిందన్నారు.

స్వేచ్చను, హక్కులను హరిస్తే అది తిరుగుబాటుకు దారితీస్తుందని, ప్రజల తిరుగుబాటు సాయుధ పోరాటంగా మారుతుందని రావి నారాయణరెడ్డి హెచ్చరించారని, ఆనాటి ప్రజల కష్టాలు, రాచరిక,అణిచివేతలకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. 60ఏళ్ల పైబడ్డాక ఎన్నికల ప్రక్రియ నుంచి తప్పుకుంటానని చెప్పి అన్ని పదవుల నుంచి తప్పుకుని రావి నారాయణ రెడ్డి యువతరానికి ఆదర్శంగా నిలిస్తే..ఈ రోజుల్లో ప్రజలు ఓడించిన పదవులు వదులుకోవడం లేదంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రావి నారాయణరెడ్డి బాటలో సూదిని జైపాల్ రెడ్డి, జస్టీస్ సుదర్శన్ రెడ్డి వంటి వారు నడిచారన్నారు. చరిత్ర పాఠాలు నేర్పుతుందని, తద్వారా వర్తమానంలో, భవిష్యత్తులో నడుచుకోవాల్సిన విధానాలపై అవగాహాన ఏర్పడుతుందన్నారు. చిరస్మరణీయుడన్నారు.

ఇటీవల కాలంలో ఎవరికి వారు తెలంగాణ జాతిపితగా , ఉద్యమ కారులుగా చెప్పుకుంటున్నారని, విచారణకు నోటీసులిస్తే ఉద్యమకారులను అవమానిస్తున్నారని, చేసిన తప్పులకు నోటీసులిస్తే తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇస్తారా అంటున్నారని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా కేసీఆర్ ను విమర్శించారు. అధికారంలో ఉండి చేసిన అక్రమాల కేసులో విచారణకు పిలిస్తే తెలంగాణ సమాజానికి నోటీసులిచ్చినట్లేనంటూ తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. తాము ఎక్కడ ఉంటే అక్కడికే వచ్చి విచారించాలనడం ఎక్కడి జాతిపిత లక్షణం అని ఎద్దేవా చేశారు. జాతిపిత మహాత్మగాంధీ నిస్వార్ధంగా దేశం కోసం కొట్లాడి ప్రాణాలర్పిస్తే..తెలంగాణ జాతిపితగా చెప్పుకుంటున్న వారు అధికారం అనుభవించి అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. నేరాలు చేస్తం అడుగొద్దంటే ఎలా..ఇదేక్కడి ప్రజాస్వామ్యం..జాతిపిత లక్షణం అని ప్రశ్నించారు.

తెలంగాణ ఉద్యమకారుడైన ప్రొఫెసర్ కోదండరామ్ వంటి వారు కూడా తెలంగాణ జేఏసీతో రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన సంగతి మరువరాదని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారుడైన కోదండరామ్ ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఈడ్చుకెళ్లి అవమానించారన్నారు. మీలాగా ఉద్యమకారులపై మేం దౌర్జన్యం చేయలేదని కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వయసును గౌరవించి ఇంటికి వెళ్లి మరి పోలీసులు విచారణ చేశారన్నారు. రావి నారాయణరెడ్డి 500ఎకరాలు భూములు పంచారని, ప్రజల కోసం ఆస్తులు పంచి ప్రాణాత్యాగాలతో కూడిన పోరాటాలు చేశారని..కాని వచ్చిన తెలంగాణలో వందల ఎకరాల ఫామ్ హౌస్ లు, వేల కోట్ల కాంట్రాక్టులు, ఉన్న పదవులు, టీవీలు, పేపర్లు అన్నీ మీరే దక్కించుకున్నారని, చేయాల్సిన తప్పులన్ని చేశారని కేసీఆర్ పై రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.

మీరు జాతిపిత అయితే రావి నారాయణరెడ్డి, కోదండరామ్ వంటివారిని ఏమనాలని కేసీఆర్ ను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజాదరణ ఉన్నప్పుడే పదవుల నుంచి తప్పుకున్న రావి నారాయణరెడ్డి ఎక్కడా అని.. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో ప్రజలు తిరస్కరిస్తే వారే తప్పు చేశారని చెప్పిన కేసీఆర్ ను ఏమనాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్చ, హక్కులు ఉంటాయని, నేరాలు చేస్తే విచారణ ఎదుర్కొనక తప్పదన్నారు. క్రిమినల్ ఫ్రీడమ్ ఉండదన్నారు. అధికారంలో ఉండి అన్ని రకాల అక్రమాలు, అక్రమార్జనకు పాల్పడినవారు, అధికారాన్ని పదిలం చేసుకునేందుకు వేల ఎకరాలు, వేల కోట్లు అక్రమార్జన చేసిన వారు విచారణ ఎదుర్కోవాల్సిన బాధ్యత ఉంటుందన్నారు, షిబు సోరేన్, యుడియరప్ప, లాలు ప్రసాద్ యాదవ్ , క్రేజీవాల్ వంటి వారు విచారణలకు హాజరయ్యారన్నారు.

మధ్యయుగ చక్రవర్తులుగా మాదిరిగా రాజు సంతోషమే ప్రజల సంతోషం అన్న విధానానికి ప్రజాస్వామ్యంలో కాలం చెల్లించిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఉద్యమకారుడైన కోదండరామ్ ను మేం గౌరవించి ఎమ్మెల్సీ పదవి ఇస్తే.. సుప్రీంకోర్టు వరకు వెళ్లి అడ్డుకున్న దుర్మార్గుడు కేసీఆర్ అని రేవంత్ రెడ్డి విమర్శించారు. అంత తప్పిదం కోదండరామ్ ఏం చేశారని ప్రశ్నించారు. కమ్యూనిస్టులు చేసిన పోరాటాలకు చట్టబద్దత కల్పించి భూ సంస్కరణలు, కనీస వేతన చట్టాలు వంటి చట్టాలు కాంగ్రెస్ పార్టీ తెచ్చిందన్నారు. ప్రజల కోసం నాణానికి బొమ్మ బొరుసు కాంగ్రెస్, కమ్యూనిస్టులు అన్నారు. వన్ నేషన్, వన్ మ్యాన్ కోసమే వన్ ఎలక్షన్ అని మోదీ అంటున్నారని ఆరోపించారు. రాజ్యాంగం రద్దు కోసమే మోదీ 400సీట్లు అడిగారన్నారు. ఎస్ఐఆర్ తో ఎన్నికల్లో అక్రమాలతో ఓటు హక్కు కాలరాసే కుట్ర చేస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ తాత ముత్తాతలు ఎక్కడ పుట్టారంటున్నారని, రాహుల్ అడిగిన మోదీ చదివిన సర్టిఫికెట్ అడిగితే మాత్రం చూపించడం లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. రాజ్యాంగ మార్పుకు ఎస్ఐఆర్ తో మోదీ దాడి చేస్తున్నారని ఆరోపించారు. రావి నారాయణ రెడ్డిని గౌరవించేందుకు మున్సిపల్ ఎన్నికల తర్వాత సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి, సీపీఐ నాయకులు నారాయణ, చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఇతర నేతలు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి :

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. చార్జ్ షీట్ కు సిట్ సిద్దం ?
Father Kills Daughter : పంచాయతీ ఎన్నికల్లో పోటీ కోసం కూతురిని హత్య చేసిన తండ్రి