Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. చార్జ్ షీట్ కు సిట్ సిద్దం ?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ చార్జ్‌షీట్ దాఖలుకు సిద్ధమవుతోందన్న సమాచారం ఉత్కంఠ రేపుతోంది. కేసీఆర్, కవిత విచారణతో కేసు కీలక దశకు చేరింది.
విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు బృందం సిట్ త్వరలో చార్జ్ షీట్ దాఖలుకు సిద్దమవుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ను విచారించిన సిట్ అధికారులు.. తదుపరి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత దంపతులను సైతం విచారించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. కవిత సైతం సిట్ పిలిస్తే విచారణకు హాజరవుతానని, నా ఫోన్, నా భర్త ఫోన్ ట్యాపింగ్ చేశారని స్పష్టం చేసింది. కేసులో భాగంగా విచారణ చేసిన నిందితులు, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా చార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు సిట్ తుది కసరత్తు సాగిస్తుంది. అయితే చార్జ్‌షీట్‌లో ఎవరెవరి పేర్లు ఉంటాయన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మావోయిస్టుల ముసుగులో ప్రతిపక్ష నేతలు, వ్యాపారుల ఫోన్ల ట్యాపింగ్
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ లో భాగంగా ప్రతిపక్ష నాయకులు, వ్యాపారులు, జడ్జీలు, సినీ సెలబ్రెటీలు, జర్నలిస్టుల ఫోన్లను అక్రమ ట్యాపింగ్ చేసినట్లుగా తీవ్ర అభియోగాలు నమోదయ్యాయి. ఎన్నికల్లో గెలిచేందుకు, అలాగే ఆర్థిక ప్రయోజనాలు పొందేందుకు అప్పటి బీఆర్ఎస్ పాలకులు అనధికారికంగా అడ్డగోలుగా ఫోన్ ట్యాపింగ్ చేయించారని, ఇందుకు ఎస్ఐబీ విభాగాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. మావోయిస్టులపై నిఘా ముసుగులో కొన్ని ఫోన్ నెంబర్లకు అనుమతి తీసుకుని..వేలాది ఫోన్లను ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టానికి వ్యతిరేకంగా అక్రమంగా ట్యాపింగ్ చేశారన్న అభియోగాలు కలకలం రేపాయి. రిటరైన ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావులను ఎస్ఐబీలోకి తీసుకుని అప్పటి బీఆర్ఎస్ పాలకులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తీవ్ర ఆరోపణలు చేశాయి. 2023డిసెంబర్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోవడం ఖాయమని తేలిపోగానే ఎస్ఐబీ ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని అంతా మాజీ డీఎస్పీ ప్రణిత్ రావు బృందం ధ్వంసం చేయడంతో అక్రమ ట్యాపింగ్ వ్యవహారం వెలుగు చూసింది.
వేలాది ఫోన్ల ట్యాపింగ్..రెండేళ్లుగా విచారణ
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై 2024మార్చి 10న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేసు నమోదైంది. అప్పటి ఎస్ఐబీ చీఫ్ టి. ప్రభాకర్ రావును పాటు డీసీపీ రాధాకిషన్ రావు, ఏసీసీలు తిరుపతన్న, భుజంగరావు, మాజీ డీఎస్పీ ప్రణిత్ రావు లను, మీడియా ప్రతినిధి శ్రవణ్ రావులను నిందితులుగా పేర్కొన్నారు. అరెస్టు చేసిన నిందితులతో పాటు అమెరికా పారిపోయిన ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను రప్పించి విచారించారు. ప్రభుత్వం మారగానే ట్యాపింగ్ సమాచారాన్ని ఎందుకు ధ్వంసం చేశారు..ట్యాపింగ్ పరికరాలను ప్రైవేటుగా సమకూర్చుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ప్రతిపక్ష నేతల ఇళ్ల సమీపంలో ట్యాపింగ్ కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేశారు..ఎవరి ఆదేశాలతో.ఎవరు ఇచ్చిన ఫోన్లను ట్యాప్ చేశారు వంటి వాటిపై ప్రశ్నించారు. రెండేళ్ల కాలంలో నిందితులతో పాటు పలు పార్టీల ఫోన్ ట్యాపింగ్ బాధితులను విచారించారు
తుది దశకు చేరిన నిందితుల..సాక్షుల విచారణ
కేసు విచారణ ప్రక్రియలో భాగంగా సిట్ ప్రశ్నించిన జాబితాలో అధికార, ప్రతిపక్ష పార్టీల కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, ప్రతిపక్ష నాయకులు కూడా ఉన్నారు. వారి నుంచి సిట్ అధికారులు కీలక సమాచారం రాబట్టగలిగారు. ఫోన్ ట్యాపింగ్ తో ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుల ప్యూహాలను అధికార పార్టీకి అందించిన ప్రణీత్ రావు ట్యాపింగ్ బృందం… వారి డబ్బులను పట్టుకుని బ్లాక్ మెయిలింగ్ చేసినట్లుగా కూడా అభియోగాలు వెలుగు చూశాయి. అలాగే వ్యాపారులను సైతం బెదిరించి ఆర్థిక ప్రయోజనం పొందినట్లుగా సమాచారం రాబట్టగలిగారు.
కీలకంగా మారిన ఎలక్ట్రానిక్ డేటా రికవరీ
ప్రణిత్ రావు బృందం ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ ల నుంచి, ఫోన్లు, ల్యాప్ టాప్ ల నుంచి తొలగించబడిన ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని కొంతవరకు రికవరి చేయడం ద్వారా మరిన్ని ఆధారాలను సిట్ బృందం సాధించగలిగింది. రికవరీ కాబడిన ఆధారాలతో పాటు నిందితులు, బాధితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పెద్దలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను, సంతోష్ రావులను సాక్షులుగా పిలిచి ప్రశ్నించారు. వారి స్టేట్మెంట్ లను నమోదు చేశారు.
కీలక ప్రశ్నలతో దర్యాప్తులో పురోగతి
బీఆర్ఎస్ పెద్దల విచారణతో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు లో పురోగతి వచ్చింది. ముఖ్యంగా కేసీఆర్ విచారణ కీలకంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ అంతా అప్పటి సీఎం కేసీఆర్ అనుమతితోనే జరిగిందా?..ఇందులో కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ ల ప్రమేయం ఎంత ?.. ఎన్నికల్లో గెలువాలన్న ఆలోచనతో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయించారా, పార్టీకి వచ్చిన ఎలక్ట్రోరల్ బాండ్లు ట్యాపింగ్ లో భాగంగా వ్యాపారులపై తెచ్చిన ఒత్తిడితో వచ్చాయా అన్న ప్రశ్నలకు కేసీఆర్ నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కోసమే రిటైరైన ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావులను తిరిగి నియమించుకున్నారా.. ప్రణిత్ రావుకు అందుకే ప్రమోషన్ ఇచ్చారా వంటి వాటిపై ప్రశ్నించారు. ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ట్యాపింగ్ ఎవరు చేశారు..అప్పటి వీడియోలు ప్రభుత్వానికి ఎలా అందాయి వంటి కేసులోని అనేక అంశాలపై సిట్ అధికారులు ప్రశ్నించారు.
ఈ కేసులో ఇప్పటిదాక నిందితులను, సాక్షులను ప్రశ్నించిన సిట్ అధికారులు కేసు విచారణలో కీలక విచారణ పర్వం పూర్తి చేశారు. మరోసారి ఈ కేసులో అవసరమైతే నిందితులతో పాటు సాక్షులుగా విచారించబడిన కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావులను మళ్లీ ప్రశ్నించి దర్యాప్తును కొలిక్కి తెచ్చి చార్జిషీట్ దాఖలు చేయాలని సిట్ యోచిస్తున్నట్లుగా తెలుస్తుండటంతో ఇకముందు ఈ కేసు మరిన్ని ఆసక్తికర మలుపులు తిరగవచ్చని తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి :
Delivery Agent | డెలివరీ ఏజెంట్‌కు లిఫ్ట్ నిరాకరణ.. భారీ మూటతోనే ఆరు అంతస్తులు మెట్లెక్కి..
VIROSH | విజయ్ దేవరకొండ – రష్మిక పెళ్లి ఏర్పాట్లు .. ఎందుకిలా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు..!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram