BRS meets the Speaker| స్పీకర్ కు ఫిరాయింపు ఆధారాలు అందించిన బీఆర్ఎస్

కాంగ్రెస్ పార్టీలో చేరిన 10మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించిన పార్టీ ఫిరాయింపు ఆధారాలను బీఆర్ఎస్ పార్టీ సోమవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు అందించింది. మాజీ మంత్రి జి.జగదీష్ రెడ్డి, కేవీపి.వివేకానంద, చింత ప్రభాకర్ లు అసెంబ్లీ సహాయ కార్యదర్శి ఉపేందర్ రెడ్డిని కలిసి ఆధారాలు సమర్పించారు.

BRS meets the Speaker| స్పీకర్ కు ఫిరాయింపు ఆధారాలు అందించిన బీఆర్ఎస్

విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ(Congress)లో చేరిన 10మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల(BRS MLAs Defection Case)కు సంబంధించిన పార్టీ ఫిరాయింపు ఆధారాలను బీఆర్ఎస్ పార్టీ సోమవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ (Speaker Gadam Prasad)కు అందించింది. ఎమ్మెల్యేలు ఏ సందర్భంలో పార్టీ మారారు..అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోల ఆధారాలను అసెంబ్లీకి సహాయ కార్యదర్శి ఉపేందర్ రెడ్డికి అందజేశారు. అసెంబ్లీ సహాయ కార్యదర్శిని కలిసిన వారిలో మాజీ మంత్రి జి.జగదీష్ రెడ్డి(Jagadish Reddy) కేవీపి.వివేకానంద, చింత ప్రభాకర్ లు ఉన్నారు. స్పీకర్ ను కలిసిన అనంతరం జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేల బుకాయింపు సిగ్గుచేటు: జగదీష్ రెడ్డి

పార్టీ ఫిరాయించిన పదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ ను కోరడం జరిగిందని..ఫిరాయింపులకు సంబంధించిన సాక్ష్యాలను స్పీకర్ కు అందించామని మాజీ మంత్రి జి.జగదీష్ రెడ్డి తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. స్పీకర్ కు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానం హాస్యాస్పదంగా ఉందని..వారు అమాయకులమని చెప్పారని వెల్లడించారు. ఆ ఎమ్మెల్యేల సమాధానాలను స్పీకర్ మాకు పంపించి రిప్లై ఇవ్వాలని కోరుతూ కేవలం మాకు మూడు రోజుల గడువు మాత్రమే ఇచ్చారన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల భాగోతం ఆయా నియోజకవర్గ ప్రజలకు కూడా తెలుసు అన్నారు. ప్రజలు నవ్వుకుంటారని ఆలోచన కూడా లేకుండా వారు ఫార్టీ ఫిరాయించలేదంటూ నోటీసులకు అబద్దాలతో కూడిన సమాధానాలిచ్చి బుకాయిస్తున్నారని జగదీష్ రెడ్డి విమర్శించారు. ఫిరాయించకపోతే ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఎందుకు కలిశారని ప్రశ్నించారు. వారు కాంగ్రెస్ కండువా కప్పుకొని ఊరుకోలేదని..స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపిద్దాం అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చారని…ఇవన్ని కూడా ఫిరాయింపుకు అద్దం పడుతున్నాయన్నారు.