Cement Steel GST | సిమెంట్, స్టీల్ కంపెనీల జీఎస్టీ మెలిక!..జీఎస్టీ స్లాబులు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం..ధరలు పెంచుతున్న సిమెంట్, స్టీల్ సంస్థలు
సిమెంట్, స్టీల్ కంపెనీల జీఎస్టీ మెలిక! జీఎస్టీ స్లాబులు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతున్న సిమెంట్, స్టీల్ సంస్థలు ప్రజల ప్రయోజనం కోసం జీఎస్టీ తగ్గింపు దానిని పక్కదారి పట్టించేందుకు యత్నాలు! 25వ తేదీనుంచి సిమెంట్‌పై 30 పెంపు? స్టీల్ పరిశ్రమ యజమానులది అదే దారి! డీలర్లకు సమాచారం ఇచ్చిన కంపెనీలు?

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విధాత):
Cement Steel GST | జీఎస్టీ తగ్గింపు ప్రయోజనం నేరుగా ప్రజలకే అందుతుందని ఒకవైపు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వం తేల్చి చెబుతున్నా.. సిమెంట్, స్టీల్ కంపెనీలు మాత్రం ఆ లాభాలను తమ జేబులో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయా? అంటే అవుననే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సిమెంట్ కంపెనీలు సిండికేట్‌గా ఏర్పడి, భారీ ఎత్తున ధరలు పెంచి ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతున్నాయన్నఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సిమెంట్ ఉత్పత్తిదారుల సంఘం (సీఎంఏ) ఏది అనుకుంటే అది చేస్తుందని, ధరలు పెంచాలనుకునే ముందు ఉత్పత్తిని తగ్గించి, కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతుందని ఒక కాంట్రాక్టర్ వాపోయాడు. ఈ ఏడాది జనవరిలోనే భారీ ఎత్తున సిమెంట్ ధరలు పెంచిన కంపెనీలు తిరిగి మరోమారు ధరలు పెంచడానికి సిద్దం అయ్యాయని తెలుస్తున్నది. దీంతో ప్రజలకు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనం అందే అవకాశం లేకుండా పోతుందని ఒక సిమెంట్ విక్రయదారు ఆవేదన వ్యక్తం చేశాడు. సిమెంట్ విక్రయం వల్ల తమకు కంపెనీ ఇచ్చే కమీషనే వస్తుంది కానీ లాభాలన్నీ కంపెనీలకే వెళతాయని ఆయన వివరించాడు.
అవసరమే అవకాశంగా…
తాజాగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపట్టింది. మొదటి దశలో నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున దాదాపు 4.50 లక్షల వరకు ఇండ్ల నిర్మాణం చేపట్టింది. ఫలితంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున స్టీల్, సిమెంట్ అవసరం ఏర్పడింది. ఏ పరిస్థితుల్లోనైనా ప్రభుత్వం స్టీల్, సిమెంట్ కొనుగోలు చేస్తుందన్న నిర్ణయానికి వచ్చిన కంపెనీలు ఒక్కసారిగా ధరలు అమాంతం పెంచాయని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఈ ఏడాది (2025) జనవరిలో 50 కిలోల సిమెంట్ బస్తా 270 రూపాయలు ఉండగా మే నెలలో ఏకంగా రూ.370కి పెంచినట్లు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడు వాపోయాడు. అలాగే స్టీల్ ధర కంపెనీ రకాన్ని బట్టి టన్నుకు రూ.52 వేల నుంచి రూ.55 వేల వరకు ఉండగా ఇది ఏకంగా రూ. 58 వేల నుంచి రూ. 60 వేలకు పెంచారని చెబుతున్నారు. దీంతో సిమెంట్, స్టీల్ కంపెనీలకు అయాచితంగా వేల కోట్ల లాభం వస్తున్నదని అంటున్నారు. ఒక బస్తా సిమెంట్‌కు ఏకంగా రూ.100 వరకు ధరను పెంచిన కంపెనీలు వేల కోట్ల లాభం ఆర్జించాయని అంచనా. టన్నుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ధరలు పెంచి స్టీల్ కంపెనీలు వేల కోట్లు దండుకున్నాయని విమర్శలు వస్తున్నాయి. పెరిగిన ధరల ప్రభావం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులపై తీవ్రంగా పడింది. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను లబ్దిదారులే నిర్మించుకునే విధంగా ఒక యూనిట్‌కు రూ.5 లక్షల వరకు నిర్ణయించారు. అయితే సిమెంట్ ధర ఎస్ఎస్ఆర్ ప్రకారం 50 కిలోల బస్తా రూ.255గా సరాసరి నిర్ణయించారు. కానీ అప్పటికే ఉన్న మార్కెట్ ధర రూ. 270 నుంచి రూ.370కి పెంచడంతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము ఏమాత్రం సరిపోయేటట్లు లేదని మహబూబాద్ జిల్లాకు చెంది ఒక లబ్ధిదారుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల కంటే అదనంగా మరో రూ.2 లక్షల వరకు అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని సదరు లబ్ధిదారుడు చెప్పాడు. ఇల్లు వచ్చిన తరువాత అప్పోసప్పో చేసి కట్టుకోవాలని లేకపోతే ఇల్లు లేకుండా పోతుందని మరో లబ్ధిదారుడన్నాడు.
20 శాతం ధరలు తగ్గించాలి కానీ…
వాస్తవంగా ప్రభుత్వాలు నిరుపేదలకు ఇండ్లు కట్టించే ఇచ్చే కార్యక్రమానికి సిమెంట్ కంపెనీలు మార్కెట్‌లో ఉన్న ధర కంటే 20 శాతం ధర తగ్గించి ఇవ్వాలి. కానీ దీనికి భిన్నంగా సిమెంట్ కంపెనీలు 30 శాతానికి పైగా ధరలు పెంచి విక్రయిస్తున్నాయని తెలుస్తున్నది. కానీ పాలకులు మాత్రం సిమెంట్ కంపెనీలను నియంత్రించలేక చేష్టలుడిగి చూస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్ట్‌లకు స్టీల్, సిమెంట్ పెద్ద ఎత్తున అవసరం అవుతుంది. ప్రభుత్వ కార్యక్రమాలకు అవసరమైనప్పుడల్లా ఈ కంపెనీలు అడ్డగోలుగా ధరలు పెంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలపై మోయలేని భారం మోపుతున్నాయని సామాజిక విశ్లేషకుడొకరు అన్నారు.
జీఎస్టీ తగ్గింపు ఫలాలు కూడా..
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ అమలులోకి వచ్చిన 8 ఏళ్ల తరువాత మొదటి సారిగా స్లాబ్‌లు తగ్గించింది. 28 శాతం జీఎస్టీని 18 శాతానికే పరిమితం చేయడంతో స్టీల్, సిమెంట్ ధరలు గణనీయంగా తగ్గాలి. ఇప్పటికే ఆటోమొబైల్ రంగం ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. సిమెంట్ కంపెనీలు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాన్నితమకుమాత్రం వచ్చే విధంగా రూ.50 కిలోల బస్తాకు మరో 30 రూపాయలు పెంచడానికి సిద్దమయ్యాయని అంటున్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి తగ్గించిన జీఎస్టీ స్లాబ్‌లు అమలులోకి వస్తున్న నేపథ్యంలో ఈ నెల 25వ తేదీ నుంచి బస్తాకు రూ.30 ధర పెంచి విక్రయించాలని ఇప్పటికే డీలర్లకు సిమెంట్ కంపెనీలు మెసేజ్‌లు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. భువనగిరి జిల్లాల్లో ఒక ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుడు సిమెంట్ కొనుగోలు చేయడానికి వెళితే.. ‘మీకు కావాల్సినంత సిమెంట్ ఇప్పుడే తీసుకువెళ్లండి.. ఈ నెల 25 తరువాత మరో రూ.30 అదనంగా పెరిగే అవకాశం ఉంది’ అని చెప్పినట్టు తెలుస్తున్నది. సిమెంట్ కంపెనీలు తీసుకున్న ఈ అనైతిక నిర్ణయంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆ కాస్త ప్రయోజనం కూడా దక్కకుండా పోయే ప్రమాదం ఉందన్న వాదన వినిపిస్తున్నది. సిమెంట్, స్టీల్ ధరలు ఈ విధంగా పెంచుకుంటూ వెళితే ఉచితంగా ఇసుక ఇచ్చినంత మాత్రన తమకు ఏం ప్రయోజనం చేకూరినట్లని లబ్ధిదారులు వాపోతున్నారు.
ధరలు తగ్గించేది డీలర్లా? కంపెనీలా?
సిమెంట్ ధరలు తగ్గించాలని అధికారులు డీలర్ల వద్దకు వెళ్లి అడుగుతున్నారు. తాము బస్తాపై కేవలం కమీషన్ తీసుకొని అమ్ముకునే వాళ్లమే కానీ, అపరిమితంగా లాభాలు తమకు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారని తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి స్థాయిలో కంపెనీలను, సిమెంట్ ఉత్పత్తి దారుల సంఘాన్ని పిలిపించి ధరలు తగ్గించి, ఇందిరమ్మ ఇళ్లకు నిర్ణీత రేటు నిర్ణయించి విక్రయించాలని ఆదేశిస్తే ధరలు తగ్గుతాయి కానీ కమీషన్ ఏజెంట్ల వద్దకు వస్తే లాభమేంటని అధికారులకు ఏజెంట్లు స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. స్టీల్, సిమెంట్ ధరల పెరుగుదలతో ఒక్క ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకే కాదు.. ఇతర మధ్య తరగతి ప్రజలపై కూడా పెనుభారం పడుతుంది. బిల్డర్లు ఏమాత్రం లాభాలు తగ్గించుకోకుండా ఇంటి ధరలు అమాంతం పెంచి విక్రయిస్తున్నారు. ఇలా స్టీల్, సిమెంట్ ధరలపై పాలకుల కంట్రోల్ లేని ఫలితంగా ఇండ్లు, అపార్ట్‌మెంట్ల ధరలు చదరపు అడుగుకు రూ. 8వేల నుంచి 12 వేలకు పెరిగాయి. దీంతో నెలకు లక్ష రూపాయల జీతం వచ్చే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కూడా ఒక డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొనాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది.