TG Registrations | తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ మార్క్ మారింది. ఇప్పటి వరకు వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ ముందు మార్క్ టీఎస్‌గా ఉండగా.. టీజీగా మారింది. ఈ మేరకు కేంద్రం ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మోటర్ వెహికల్ యాక్ట్ 1988లోని సెక్షన్ 41(6) ప్రకారం కేంద్రం ఈ రిజిష్ట్రేషన్ మార్క్ మార్పునకు ఆమోదం తెలిపినట్లు తెలిపింది. 1988 జూన్ 12 నాటి గెజిట్ నోటిఫికేషన్ సీరియల్ నెంబర్ 29ఏ కింద టీఎస్‌గా ఉన్న తెలంగాణ వాహనాల రిజిష్ట్రేషన్ మార్క్‌ను టీజీగా మారుస్తూ గెజిట్ జారీ చేసింది.
ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీఎస్ స్థానంలో టీజీగా మార్చనున్నట్లు తెలిపింది. ఈ మేరకు మంత్రివర్గంలో తీర్మానం ప్రవేశపెట్టి.. ఆ తర్వాత కేంద్రానికి పంపారు. ఈ మేరకు కేంద్రం తాజాగా మార్పు చేసింది. వాస్తవానికి తెలంగాణ ప్రత్యేక ఉద్యమం సమయంలో చాలా మంది తమ వాహనాలకు ఏపీని టీజీగా మార్చుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం టీజీగా ఉంటుందని భావించినా.. అనూహ్యంగా అప్పటి టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రభుత్వం టీఎస్‌గా మార్చింది. కేసీఆర్ ఆదేశాల మేరకు వాహనాల రిజిస్ట్రేషన్ పేరును టీఎస్‌గా మారుస్తూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా.. కేంద్రం దాన్నే నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు, సీఎం రేవంత్‌రెడ్డి వాహనాల రిజిస్ట్రేషన్ మార్క్‌ను మార్చాలని నిర్ణయించారు. ఈ మేరకు మంత్రివర్గంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. తాజాగా కేంద్రం నోటిఫై చేస్తూ గెజిట్‌ను వెలువురించింది. ఇకపై టీఎస్ స్థానంలో టీజీగా వాహనాల రిజిస్ట్రేషన్ మార్క్ ఉండనున్నది. అయితే, టీఎస్ స్థానంలో కొత్త వాహనాలకు మాత్రమే టీజీ మార్క్ ఉండనున్నది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన వాహనాలకు మాత్రమే టీఎస్ మార్క్‌ను కేటాయించారు. ఇకపై కొత్త వాహనాలకు మాత్రమే టీజీ కోడ్‌తో రానున్నాయి. ప్రస్తుతం ఉన్న టీఎస్ నెంబర్ ప్లేట్లను మార్చుకోవాల్సిన అవసరం సైతం ఉండదని అధికారులు పేర్కొంటున్నారు.