Regional Ring Road | తెలంగాణ మణిహారం ట్రిపుల్ ఆర్‌పై నిర్లక్ష్యం!
ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టుపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా వ్యవహరిస్తున్నదా? హైదరాబాద్ మహా నగర ముఖచిత్రాన్ని మార్చివేసే కీలకమైన ప్రాజెక్టుపై శీఘ్ర చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతున్నదా? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇంకా పనులు పట్టాల పైకి ఎక్కలేదు? ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు గురించి చర్చ జరిగిన ప్రతి చోటా వినిపిస్తున్న ప్రశ్నలివి.
- మూడడుగులు ముందుకు.. ఆరు ఆడుగులు వెనక్కేనా?
- సర్కార్ వచ్చి రెండేళ్లవుతున్న అతీగతీ లేదు
- ఫ్యూచర్ సిటీ పై శ్రద్ధ, రీజినల్ పై అశ్రద్ధ!
- జనవరిలో పనులు ప్రారంభమయ్యేనా!
హైదరాబాద్, విధాత ప్రతినిధి:
Regional Ring Road | గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పనులు ఎంత వేగిరంగా సాగాయో అంతకు భిన్నంగా ట్రిపుల్ ఆర్ పనులు జరుగుతున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇలాగే సాగితే పదేళ్లు అయినా రోడ్డు పనులు పూర్తి కావని వ్యాఖ్యానిస్తున్నారు. ఫ్యూచర్ సిటీపై చూపిస్తున్న శ్రద్ధ ట్రిఫుల్ ఆర్ పై చూపించం లేదనే విమర్శలు బలంగా ఉన్నాయి. వచ్చే డిసెంబర్ లోపు టెండర్ పూర్తి చేసి జనవరిలో పనులు ప్రారంభిస్తామని గత నెల ఆర్అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. కానీ.. ఆచరణ మాత్రం ఆ దిశగా లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు ఆవల 340 కిలోమీటర్ల పొడవున నిర్మించే రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)కు 2010లో అంకురార్పణ చేశారు. అప్పట్లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ దీన్ని పెరిఫరల్ రింగ్ రోడ్డుగా ప్రతిపాదించింది. 2017లో కేంద్రం ‘భారత్ మాల పరియోజన’ ఫేజ్ 1లో దీన్ని చేర్చింది. సర్వేలు, అలైన్‌మెంట్ ఖరారు, అధ్యయనంపై 2020 నుంచి 2023 వరకు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కాలయాపన చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత 2024లో భూ సేకరణలో యాభై శాతం భరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఉత్తర భాగంలో పనులు చేపట్టేందుకు టెండర్లు, దక్షిణ భాగంలో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పనకు టెండర్లు ఆహ్వానించారు. 2028 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్న ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
ఈ రోడ్డుతో ఎన్నో ప్రయోజనాలు
ట్రిపుల్ ఆర్ నిర్మాణంతో ఔట్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ రద్దీ తగ్గడమే కాకుండా సరుకు రవాణా వాహనాలు, లాజిస్టిక్స్ హబ్‌లు, జాతీయ రహదారుల మధ్య కనెక్టివిటీ పెరిగి వేగంగా గమ్యస్థానాలు చేరుకుంటాయి. ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య రేడియల్ రోడ్ల నిర్మాణంతో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. వేర్‌హౌస్‌లు, లాజిస్టిక్, పరిశ్రమల ఏర్పాటుతో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి పెరుగుతుంది. నిర్మాణ రంగానికి ఎంతో మేలు జరుగుతుంది. సంగారెడ్డి, సిద్ధిపేట, నల్లగొండలో వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు అవుతాయి. నగరంలో ఒత్తిడి తగ్గేలా చేవెళ్ల, భువనగిరి, ఆమనగల్, చౌటుప్పల్, కందుకూరు, తూప్రాన్ ప్రాంతాలు పట్టణాలుగా అవతరిస్తాయి. మెరుగైన రవాణా కారణంగా పరిశ్రమల ఏర్పాటుకు పలువురు ముందుకు వస్తారు. రియల్ ఎస్టేట్ రంగం, రిటైల్ వ్యాపారం, సేవా రంగాల్లో ఊహించని ప్రగతి చోటుచేసుకుంటుంది.
ఆరు లేన్లకు విస్తరించేలా భూసేకరణ
ప్రస్తుతం నాలుగు లేన్లకే పరిమితం చేసినా ఆరు లేన్లకు విస్తరించేందుకు వీలుగా భూ సేకరణ చేస్తున్నారు. ఇంటెలెజెన్స్ ట్రాన్స్ పోర్టు సిస్టమ్ దీని ప్రత్యేకత. ప్రాంతీయ బస్ స్టేషన్లను కలుపుతూ కొత్తగా రానున్న సబ్ అర్బన్ జోన్లను అనుసంధానం చేస్తారు. ట్రిపుల్ ఆర్ వెంట పారిశ్రామిక ప్రాంతాలు, జంక్షన్లు, టౌన్ షిప్‌లు రానున్నాయి. చేవెళ్ళ, తూఫ్రాన్, షాద్‌నగర్‌లలో శాటిలైట్ టౌన్‌షిప్‌లు, సంగారెడ్డి, భువనగిరి, చౌటుప్పల్ ప్రాంతాల్లో లాజిస్టిక్‌లు, వేర్ హౌసింగ్ హబ్‌లు, దక్షిణ ప్రాంతంలో ఫార్మా సిటీ, ఈ సీటీ వంటి ఇండస్ట్రియల్ పార్కులు రానున్నాయి. జంక్షన్లకు సమీపంలో ప్రైవేటు యూనివర్సిటీలు, ప్రముఖ విద్యా సంస్థలు ఏర్పాటు చేసే అవకాశాలూ ఉన్నాయి.
రియల్ ఎస్టేట్‌కు బూమ్!
రీజినల్ రింగ్ రోడ్డును ఉత్తర భాగంలో 164 కిలో మీటర్లు, దక్షిణ భాగంలో 182 కిలో మీటర్లుగా విభజించారు. షాద్‌నగర్, చేవెళ్ల, భువనగరి ప్రాంతాలు రియల్ ఎస్టేట్‌కు కేంద్రాలుగా మారుతాయన్న అంచనాలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం, బెంగళూరు జాతీయ రహదారికి పక్కనే ఉండటం షాద్‌నగర్‌కు కలిసొచ్చే అంశం. ఇక్కడి నుంచి కర్ణాటకలోని రాయచూర్‌కు వెళ్ళడానికి రోడ్డు ఉంది. దీంతో ఇక్కడ ఇప్పటికే రెసిడెన్షియల్ లే అవుట్లు వేశారు. చేవెళ్లలో పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి. హైదరాబాద్ – బీజాపూర్ జాతీయ రహదారి పనులు ప్రారంభించడంతో చేవెళ్లలో మున్ముందు శాటిలైట్ టౌన్‌షిప్‌లు వెలిసే అవకాశాలు పెరిగాయి. యాదగిరిగుట్ట ఆలయం, వరంగల్‌కు వెళ్లే జాతీయ రహదారి పక్కనే భువనగిరి ఉంది. యాదగిరి గుట్ట వరకు దక్షిణ మధ్య రైల్వే మూడో రైల్వే లైను నిర్మాణం చేస్తున్నది. దీంతో ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందనున్నది. యాదగిరి గుట్టకు ప్రతినిత్యం వేల మంది భక్తులు వెళ్లి దర్శనం చేసుకుంటుండటంతో ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్నది.
8 లేన్లతో ఓఆర్ఆర్
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 8 లేన్లతో 158 కిలోమీటర్ల పొడవున ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేశారు. హైదరాబాద్ మహా నగరంలో ట్రాఫిక్ ఒత్తిడి తగ్గించేందుకు దీన్ని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు కోసం తార్నాకలో స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ) ఏర్పాటు చేసి, ఒక ఐఏఎస్ అధికారికి అప్పగించారు. భూ సేకరణ కోసం ప్రత్యేకంగా డిప్యూటీ కలెక్టర్లను భూ సేకరణ అధికారులుగా, రోడ్డు పనుల కోసం ఇంజినీర్లను పెద్ద ఎత్తున నియమించారు. అప్పటి ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పనులు చాలా వేగంగా పూర్తయ్యాయి. ఇప్పుడది హైదరాబాద్ మహా నగర ముఖచిత్రాన్నే మార్చివేసింది. ఓఆర్ఆర్ వరకు ప్రస్తుతం ఖాళీ స్థలాల లభ్యత లేదు. ఓఆర్ఆర్ కు ఇరువైపులా రెసిడెన్షియల్, కమర్షియల్ లే అవుట్‌లు రావడంతో రద్దీ పెరిగిపోయింది. నగరంలో ట్రాఫిక్ రద్దీ, వాయు కాలుష్యం బారి నుంచి బయటపడేందుకు ఓఆర్ఆర్ చుట్టు పక్కల ప్రాంతాలకు ప్రజలు తరలివెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ నగరంలో ప్రముఖ ప్రాంతాలలో భూముల కొనుగోలు కొంత మందగించిందనే చెప్పాలి.
ఫ్యూచర్ సిటీకి ఐఏఎస్, ట్రిపుల్ ఆర్‌కు టాస్క్ ఫోర్స్!
రంగారెడ్డి జిల్లాలో ఫ్యూచర్ సిటీ కోసం ముఖ్యమంత్రి చైర్మన్‌గా, మునిసిపల్ శాఖ మంత్రి వైస్ చైర్మన్‌గా ఫ్యూచర్ సిటీ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేశారు. ఏడు మండలాలలోని 56 రెవెన్యూ గ్రామాలు దీని పరిధిలోకి రానున్నాయి. సెప్టెంబర్ నెలలో కందుకూరు మండలం మీర్‌ఖాన్ పేటలో ఫ్యూచర్ సిటీ కార్యాలయాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. అంతకు ముందు నానక్‌రామ్‌గూడలో తాత్కాలిక కార్యాలయాన్ని మార్చి నెలలో ఏర్పాటు చేశారు. ఏప్రిల్ నెలలో రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ కే శశాంకను కమిషనర్‌గా నియమించి, ప్రభుత్వ ఉద్యోగులను కూడా కేటాయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టు కావడంతో చకచకా ఉత్తర్వులు, నియామకాలు చేస్తున్నారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అదే ట్రిపుల్ ఆర్ విషయంలో అంత వేగంగా నిర్ణయాలు జరగడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. హెచ్ఎండీఏ పరిధిలో పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను ఇప్పటి వరకు ఏర్పాటు చేయకపోవడం కూడా పెద్ద లోటుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రజలు, ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు.
Read Also |
Two WhatsApps for iPhone | ఐఫోన్ యూజర్లకు శుభవార్త : ఎట్టకేలకు ఐఫోన్లో రెండు వాట్సప్‌లు
Telangana Tourism : 22 నుండి సాగర్ – శ్రీశైలం లాంచీ ప్రయాణం ప్రారంభం
Bad Memories | కలచివేసే చెడు జ్ఞాపకాలను ఇలా తుడిచివేయచ్చు!
Nepal Gen-Z Protest : నేపాల్‌లో మళ్లీ జన్-జడ్ ఆందోళనలు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram