Regional Ring Road Alignment  | ట్రిపుల్‌ ఆర్‌.. దారి ‘మళ్లిందా’?  ఎవరికోసం?

తెలంగాణ రీజినల్‌ రింగ్‌ రోడ్డు (Regional Ring Road) అలైన్‌మెంట్‌ మారిందన్న (alignment change) అనుమానాలు రైతుల్లో ఆగ్రహాన్ని (Farmers protest) కలిగిస్తున్నాయి. తొలుత 180 ఎకరాలు సేకరించేందుకు ప్రతిపాదనలు చేయగా.. అది ఏకంగా 230 ఎకరాలకు పెరగడం అనుమానాలకు దారి తీస్తున్నది. అధికారులు మాత్రం అలైన్‌మెంట్‌ మార్పు ఏమీ లేదని కొట్టిపారేస్తున్నారు.

Regional Ring Road Alignment  | ట్రిపుల్‌ ఆర్‌.. దారి ‘మళ్లిందా’?  ఎవరికోసం?

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 18 (విధాత):

Regional Ring Road Alignment  | రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం అలైన్ మెంట్ మార్చారనే విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. మరో వైపు ఆర్ఆర్ఆర్ కు తమ భూములను ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు ఆందోళనబాట పట్టారు. తప్పనిసరి పరిస్థితుల్లో తమ భూములు ఇవ్వాల్సివస్తే మార్కెట్ రేటు ప్రకారం పరిహారం చెల్లించాలనేది రైతుల డిమాండ్ చేస్తున్నారు. ట్రిపుల్‌ఆర్‌ అలైన్‌మెంట్ మారిందన్న ఆరోపణలను అధికారులు కొట్టిపారేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ కోసం తొలుత చౌటుప్పల్ మండలంలో 180 ఎకరాల భూమిని సేకరించాలని ప్రతిపాదించారు. అయితే ఇప్పుడు అది 230 ఎకరాలకు చేరడం వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్నది. ఇందులో పలు రాజకీయ కారణాలు ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాణిజ్యపరంగా డెవలప్ చేయడం, డంబుల్ ఆకారంలో రోడ్డును నిర్మించాల్సి రావడంతో ఎక్కువ భూమిని సేకరించాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు. ఔటర్‌ రింగురోడ్డు నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ట్రిపుల్‌ ఆర్‌ ఉండాలన్న విధాన నిర్ణయాన్ని రైతులు గుర్తు చేస్తున్నారు. అలాంటప్పుడు చౌటుప్పల్‌ మండలంలో ఉన్న ఓ ప్రముఖ ఫార్మా కంపెనీకి అవతలి వైపు నుంచి ఆర్ఆర్ఆర్ వెళ్లాలనేది రైతుల డిమాండ్. ఒక ప్రతిపాదనలో ఒక ఫార్మా కంపెనీ మీదుగానే రోడ్డు వెళ్లేది. అయితే కారణాలు ఏవో కానీ ఆ ఫార్మా కంపెనీ బయట నుంచి అలైన్‌మెంట్‌ ప్రతిపాదించారు. దీనికి రాజకీయ కారణాలున్నాయనేది స్థానిక రైతుల ఆరోపణ. మరో వైపు సంస్థాన్ నారాయణపురం మండలంలో కూడా ఇలానే ప్రతిపాదనలు వచ్చాయంటున్నారు. ఇదే మండంలోని సర్వేల్ గ్రామానికి తొలుత నాలుగు కి.మీ. దూరంలో రోడ్డు ప్రతిపాదించారు. అది చివరికి రెండు కి.మీ. దూరానికి పరిమితమైంది. అయితే సర్వే సంస్థలు ఇచ్చిన రిపోర్టులో చెరువులు, నీటి పారుదల వసతులు, ఫారెస్ట్ ల్యాండ్ వంటి అంశాలను రెవెన్యూ అధికారులు పరిశీలించి సర్వే సంస్థకు సమాచారం ఇస్తారు. సర్వేలో మార్పులు చేర్పులు సూచిస్తారు. దాని ఆధారంగా అలైన్‌మెంట్‌ ఫైనల్ చేస్తారు. ఈ అలైన్‌మెంట్‌ను కేంద్రం ఆమోదించాలి. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్‌మెంట్‌లో మార్పులు చేశారని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం మీడియాతో చిట్‌చాట్‌ చేస్తూ.. కొందరికి ప్రయోజనం చేకూర్చేందుకు అలైన్‌మెంట్‌ మార్చారని ఆరోపించారు. త్వరలోనే అన్ని విషయాలను బయటపెడతానని కేటీఆర్‌ చెప్పారు.

రైతుల ఆందోళనలు

ఆర్ఆర్ఆర్‌లో అంతర్భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 59.33 కి.మీ. రోడ్డు నిర్మిస్తున్నారు. తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్ మండలాల్లోని 34 గ్రామాల గుండా ఈ రోడ్డు వెళ్తోంది. రాయగిరి, చౌటుప్పల్ వద్ద ఇంటర్ చేంజ్‌ జంక్షన్లు నిర్మించనున్నారు. దీని కోసం 1927 ఎకరాల భూమి అవసరం. భువనగిరి మండలంలోని రాయగిరి గ్రామానికి చెందిన రైతులు వరంగల్‌ హైవే విస్తరణలో భూములు కోల్పోయారు. తాజాగా ఆర్ఆర్ఆర్‌లో కూడా భూములు కోల్పోవాల్సి వస్తోంది. దీంతో రైతులు భూములు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు. చౌటుప్పల్, గట్టుప్పల్, మర్రిగూడ మండలాలకు చెందిన రైతుల సర్వే నంబర్లను అధికారులు ప్రకటించడంతో బాధితులు తాము ఆర్ఆర్ఆర్‌కు భూములు ఇవ్వలేమని ఆందోళన బాట పట్టారు. చౌటుప్పల్ లో ఇంటర్ ఛేంజ్ జంక్షన్ లో మార్పులు చేశారు. దీంతో చౌటుప్పల్ మున్సిపాలిటీ రెండుగా చీలనుంది. ఓ ఫార్మా కంపెనీ కోసం మార్చారనేది స్థానికులు ఆరోపిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, చౌటుప్పల్ మధ్య 28 కి.మీ. ఉంది. వాస్తవానికి ఔటర్ నుంచి 40 కి.మీ. దూరంలో ఆర్ఆర్ఆర్ ఉండాలి. ఇది మార్చని పక్షంలో ఇప్పటికే ఖరారైన నార్త్‌ అలైన్‌మెంట్‌ మార్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 13న చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయంవద్ద రైతులు నిర్వహించిన ధర్నాకు మునుగోడు మాజీ ఎమ్మెల్యేలు పల్లా వెంకట్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, మునుగోడు అసెంబ్లీ బీజేపీ ఇంచార్జీ జీ మనోహర్ రెడ్డి తమ మద్దతు పలికారు. ఆర్ఆర్ఆర్‌ను ఔటర్ రింగ్ రోడ్డు నుంచి 40 కి.మీ. దూరంలో నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రతిపాదించిన అలైన్‌మెంట్‌లో నిర్మించాల్సి వస్తే తమకు మార్కెట్ రేటు ధర ప్రకారం పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. ఈ డిమాండ్ తో రైతులు హైదరాబాద్ హెచ్ఎండీఏ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.

ఆర్ఆర్ఆర్ ఎందుకు?

  • హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాలకు కనెక్టివిటీని పెంచడంతోపాటు హైదరాబాద్‌పై ట్రాఫిక్‌ రద్దీ భారాన్ని తగ్గించడం కోసం ట్రిపుల్‌ ఆర్‌ను ప్రభుత్వం చేపట్టింది.
  • హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లో కూడా రియల్ ఏస్టేట్ అభిృద్దికి ఈ రోడ్డు కీలకంగా మారనుంది.
  • ఢిల్లీ ఎన్‌సీఆర్, బెంగుళూరు శాటిలైట్ టౌన్ షిప్ తరహాలో హైదరాబాద్ రూపురేఖలను ఆర్ఆర్ఆర్ మార్చనుంది.
  • ఆర్ఆర్ఆర్ ఉత్తర , దక్షిణ భాగాలుగా ఉంటుంది. ఉత్తర , దక్షిణ భాగాలు కలిపితే 340 కి.మీ.గా తొలుత ప్రతిపాదించారు.
  • ఉత్తర భాగం 161 కి.మీ. దక్షిణ భాగం 182 కి.మీ. భూసేకరణతో కలిపితే ప్రాజెక్టుకు రూ. 21,480 కోట్లు ఖర్చు అవుతోందని అంచనా.
  • నాలుగు రోడ్ల రహదారిగా దీన్ని చేపట్టి.. భవిష్యత్తులో ఆరు లేన్లకు విస్తరించాలనేది ప్లాన్.

ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగంలో భౌగోళికంగా ఇబ్బందులు?

ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం కంటే దక్షిణ భాగంలో మార్గం ఎక్కువగా ఉంది. అంతేకాదు భౌగోళికంగా దక్షిణ భాగంలో రోడ్డు నిర్మాణ పనులకు ఇబ్బందులున్నాయి. అంటే కొండలు, గుట్టలతో పాటు చెరువులు, కుంటల వంటివి ఎక్కువగా ఉన్నాయి. ట్రాఫిక్ తక్కువగా ఉండే ఈ మార్గంలో ఫోర్ వే అవసరమా అనే చర్చ కూడా అధికారుల్లో వచ్చింది. అయితే చివరకు కేంద్రం అనుమతిని ఇచ్చింది. అలైన్ మెంట్ కోసం సర్వే చేసే సమయంలో కొండలు, గుట్టలను సర్వే సంస్థలు గుర్తించాయి. అయితే ఇలాంటి అడ్డంకులను దాటుకుని దక్షిణ భాగం అలైన్ మెంట్ కు 2025 జూన్ లో తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. దక్షిణ భాగం 201 కి.మీ. ఉంటుంది. ఉత్తర భాగం 161 కి.మీ పరిమితమైంది. భౌగోళికంగా ఇబ్బందులను తప్పించేందుకు మార్పులు చేయడంతో 182 కి.మీ నుంచి 201 కి.మీ. పెరిగినట్టుగా చెబుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేగా దీన్ని డెవలప్ చేస్తారు. యాదాద్రి భువనగిరి, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్,వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల గుండా ఈ రోడ్డు వెళ్తోంది. జాతీయ రహదారి 65, జాతీయ రహదారి 163, స్టేట్ హైవే19, జాతీయ రహదారి 76ను ఈ రోడ్డు అనుసంధానం చేస్తోంది. ఈ ప్రతిపాదిత మార్గంలో ఎక్కడా కూడా కొండలు, గుట్టలు తవ్వాల్సిన అవసరం లేదు. గంటకు 120 కి.మీ. వేగంతో వాహనాలు ప్రయాణించేలా రోడ్లను నిర్మించనున్నారు.