Greenfield Highway Route Map | హైదరాబాద్- అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే 277 కిలోమీటర్ల మార్గం ఇదే?
ఎక్స్‌ప్రెస్ హైవే రూట్ మ్యాప్‌ను ప్రాథమికంగా ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్-అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే మొత్తం పొడవు 277 కిలోమీటర్లు. హైదరాబాద్ బండ్లగూడ నుంచి మొదలై అమరావతిలోని తుళ్లూరు వద్ద ముగుస్తుంది.

Greenfield Highway Route Map | తెలంగాణ- ఆంధ్ర ప్రదేశ్ రాజధాని నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని 6 గంటల నుంచి 3.5 గంటలకు తగ్గించడానికి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే (National Expressway-7) ను నిర్మించనున్నారు. ఈ మేరకు కేంద్రం కూడా విభజన హామీలను నెరవేర్చడంలో భాగంగా దీనికి ఆమోదం తెలిపినట్లు సమాచారం. అలాగే రాష్ట్ర రోడ్లు -భవనాల శాఖ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ నెల 6వ తేదీన ప్రధాన మంత్రిని కలిసి త్వరగా ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం చేపట్టాలని కోరనున్నట్లు చెప్పిన విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికే ఈ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం చేయాల్సిన రూట్ మ్యాప్‌ను ప్రాథమికంగా ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్-అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే మొత్తం పొడవు 277 కిలోమీటర్లు. ఈ హైవే హైదరాబాద్ మహా నగరం ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఉన్న బండ్లగూడ నుంచి మొదలై నల్లగొండ జిల్లాతో పాటు ఏపీలో పల్నాడు, గుంటూరు జిల్లాల మీదుగా రాజధాని అమరావతిలోని తుళ్లూరు వద్ద ముగుస్తుంది. ఇది గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే కావడంతో పూర్తిగా కొత్త అలైన్‌మెంట్ లోనే నిర్మిస్తారు. ఇది ప్రస్తుతం ఉన్న హైదరాబాద్-నాగర్జున సాగర్-మిర్యాలగూడ రోడ్లకు ఏమాత్రం సంబంధం లేకుండా నిర్మిస్తారు. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే పనులు 2025 చివరలో కానీ, 2026 ప్రారంభంలో కాని మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రతిపాదిత రూట్‌లోని ముఖ్యమైన ప్రాంతాలు ఇవే..
బండ్ల గూడ వద్ద ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎక్స్ ప్రెస్ హైవే ప్రారంభం అవుతుంది. హయత్ నగర్, ఇబ్రహీంపట్నం మీదుగా చింతపల్లి, దేవర కొండలతో పాటు అటవీ ప్రాంతంలోని కొండల మీదుగా ఆంధ్ర ప్రదేశ్‌లో ని పల్నాడు జిల్లాలో ఉన్న సర్దార్ గౌతు వెంకన్న పాలెం వెళుతుంది. అక్కడి నుంచి చిలుకలూరి పేట, నర్సారావుపేట, సత్తెనపల్లి నుంచి గుంటూరు రూరల్ మార్గం మీుదుగా అమరావతిలోని తుళ్లూరు వద్ద ముగుస్తుంది.