Rajagopal Reddy | రాజగోపాల్‌పై కాంగ్రెస్‌ వ్యూహమేంటి?

మంత్రి పదవి కోసం పట్టుబడుతున్న కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అసమ్మతి స్వరంపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఆయన వ్యాఖ్యలపై ఎవరూ స్పందించడం లేదని అంటున్నారు.

Rajagopal Reddy | రాజగోపాల్‌పై కాంగ్రెస్‌ వ్యూహమేంటి?

Rajagopal Reddy| ఆయన అసంతృప్తితో చెలరేగి విమర్శలు చేస్తుంటారు! కానీ పార్టీ నాయకత్వం చూసీచూడనట్టే ఉంటుంది! ఆయన ఏకంగా ముఖ్యమంత్రిని టార్గెట్‌ చేసి మాట్లాడినా.. ఎవరూ పట్టించుకోరు! క్రమశిక్షణా సంఘం పరిశీలిస్తున్నదని పీసీసీ అధ్యక్షుడు చెబుతారు! అసలు ఆ ఎమ్మెల్యేపై తమకు ఫిర్యాదేరాలేదని క్రమశిక్షణాసంఘం సెలవిస్తుంది! ఆ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి! మునుగోడు నుంచి గెలిచిన ఈ ఎమ్మెల్యే విషయంలో అధిష్ఠానం సీరియస్‌గా తీసుకోదల్చుకోలేదా? ఆచితూచి వ్యవహరించాలనుకుంటున్నదా? భయపడుతున్నదా? అనే చర్చలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి.

ఎవరు ఫిర్యాదు చేయాలి?

ఎన్నికలకు ముందుకు రాజగోపాల్‌రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. అప్పుడే ఆయనకు మంత్రివర్గంలో స్థానంపై హామీ లభించింది. కానీ.. తొలి విడుతలో కానీ, మలి విడుతలో కానీ ఆయనకు క్యాబినెట్‌లో చోటు దక్కలేదు. తనకు మంత్రి పదవి దక్కలేదన్న విషయంలో అసంతృప్తిని రాజగోపాల్‌రెడ్డి బాహాటంగానే వెళ్లగక్కుతూ వస్తున్నారు. సోషల్ మీడియాలో, ప్రభుత్వ కార్యక్రమాల్లో, మీడియా సమావేశాల్లో అసంతృప్తిని వెల్లడించడమే కాకుండా.. తన మంత్రిపదవి హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తుంటారు. పదేళ్లు తానే సీఎంగా ఉంటానని చేసిన వ్యాఖ్యలకు, తర్వాత పాత్రికేయుల విషయంలో చేసిన కామెంట్లకు గట్టి కౌంటరే ఇచ్చారు. మంత్రుల నియోజకవర్గాలకే నిధులు వెళ్తున్నాయని ఆరోపించారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా నిధులిస్తే చాలని కోరారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్‌ విషయంలో ప్రభుత్వం మారాలేమో అంటూ సెటైర్లు వేశారు. మరో ఎమ్మెల్యే ఇవి చేసి ఉంటే ఎలా ఉండేదోకానీ.. రాజగోపాల్‌ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడటం లేదు. ఇదే విషయంలో ఆగస్ట్‌ 16న మీడియా ప్రశ్నలకు జవాబిచ్చిన పీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌.. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్‌ క్రమశిక్షణా సంఘం పరిశీలిస్తున్నదని చెప్పారు. ఆ మరుసటి రోజే క్రమశిక్షణ సంఘం సమావేశమైంది. రాజగోపాల్ రెడ్డి అంశంపై ఆగస్టు 19న చర్చిస్తామని ప్రకటించింది. కానీ.. తదుపరి సమావేశం సెప్టెంబర్ 14న నిర్వహించారు. అందులో కూడా రాజగోపాల్‌రెడ్డి అంశం చర్చకు రాలేదని సమాచారం. రాజగోపాల్ రెడ్డి అంశం గురించి మీడియా ప్రతినిధులు ఆదివారం ప్రశ్నించినప్పుడు క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవి అసహనం వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డిపై ఎవరో ఇంట్రెస్ట్ చూపిస్తే కమిటీ చర్చించదని అన్నారు. పైగా రాజగోపాల్‌ వ్యాఖ్యలపై తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, ఈ అంశం తమ దృష్టికే రాలేదని క్రమశిక్షణ సంఘం చైర్మన్‌ మల్లు రవి ముక్తాయింపునివ్వడం పరిశీలకుల్లో ఆశ్చర్యాన్ని కలిగించింది. దీంతో రాజగోపాల్‌రెడ్డిపై సీఎం ఫిర్యాదు చేయాలా? లేక పీసీసీ ఫిర్యాదు చేయాలా? అన్న సందేహాలు తెరపైకి వచ్చాయి.

ఆచితూచి వ్యవహరిస్తున్నారా?

రాజగోపాల్ రెడ్డి విషయం ఏఐసీసీ నాయకత్వం పరిశీలనలో ఉందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం చెబుతోంది. దీనిని రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా డీల్‌ చేయాలనే భావనలో నాయకత్వం ఉందనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆచితూచి వ్యవహరిస్తున్నారని అంటున్నారు.