Dynasty Politics India | వర్ధిల్లుతున్న వారసత్వం! ప్రతి ఐదుగురు ఎంపీల్లో ఒక ‘వారసుడు’ .. దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్‌కు అగ్ర పీఠం
భారతదేశంలో వారసత్వ రాజకీయాలు నానాటికి వృద్ధి చెందుతున్నాయి. ప్రస్తుతం ప్రతి ఐదుగురు ఎంపీల్లో ఒకరు రాజకీయ కుటుంబం నుంచి వచ్చినవారేనని ఏడీఆర్ నివేదిక పేర్కొన్నది.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16 :
Dynasty Politics India | రాజకీయాల్లోకి యవ రక్తం రావాలని, అన్ని వర్గాల నుంచి కొత్త తరం చురుకుగా పాల్గొనాలని చాలా మంది కోరుకుంటారు. కానీ, రాజకీయాల్లోకి వస్తున్న ఆ కొత్తవారిలో కూడా ఎక్కువగా రాజకీయాల్లో ఉన్న కుటుంబాలకు చెందినవారే ఉంటున్నారు. వారసత్వ రాజకీయాల్లో ప్రాంతీయ, జాతీయ పార్టీలు అనే తేడా లేదు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కువమంది రాజకీయ వారసులు ఉన్నట్టు తేలింది. రాజకీయ కుటుంబాల నుంచి వచ్చినవారిలో కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ మంది ఉంటే, సీపీఐఎం నుంచి కేవలం 8 శాతం మంది మాత్రమే వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు. మొత్తంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు ఒకరు రాజకీయ కుటుంబాల నుంచి వచ్చినవారేనని తేలింది.
లోక్‌సభలో 31% వారసులు
లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న ఎంపీల్లో 31 శాతం మంది వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చినవారే. దేశంలోని ఆయా రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీలో ఉన్న ప్రజా ప్రతినిధుల్లో 20 శాతం మంది కూడా రాజకీయ కుటుంబాల నుంచి వచ్చినవారేనని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తెలిపింది. దేశంలోని ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో ఒకరు వంశపారంపర్యంగా వచ్చినవారేనని పేర్కొన్నది. లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండళ్లలో 5,204 మంది ప్రజా ప్రతినిధులున్నారు. వీరిలో 1,107 మంది వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చినవారు. 543 మంది ఎంపీల్లో 167 మంది రాజకీయ కుటుంబాల నుంచి వచ్చినవారేనని తెలిపింది.
ఉత్తరాదిన యూపీ- దక్షిణాదిలో ఏపీ టాప్
ఉత్తర భారతదేశంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ కుటుంబాల నుంచి వచ్చినవారి సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఉన్న ప్రజా ప్రతినిధుల్లో 23 శాతం మంది వారసత్వంగా రాజకీయ కుటుంబాలనుంచి వచ్చినవారే. అంటే మొత్తం 604 ప్రజా ప్రతినిధుల్లో 141 మంది వారసులే. ఆ తర్వాతి స్థానంలో రాజస్థాన్ నిలిచింది. ఇక్కడ 18 శాతం మంది ఉన్నారు. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ప్రజా ప్రతినిధుల్లో 34 శాతం మంది రాజకీయ కుటుంబాలకు చెందినవారే. 18 శాతంతో ఆ తర్వాతి స్థానంలో కర్ణాటక నిలిచింది. బీహార్ లో 27 శాతం, అసోంలో 9 శాతం మంది రాజకీయాల్లో వారసులు ఉన్నారు. మహారాష్ట్రలో 403 మందిలో 129 మంది రాజకీయ కుటుంబాలకు చెందినవారే. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 255 మందిలో 86 మంది రాజకీయ కుటుంబాల వారసులే.
పార్టీల వారీగా చూస్తే
జాతీయపార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా రాజకీయ కుటుంబాల నుంచి వచ్చినవారు ఎక్కువగా ఉన్నారు. సీపీఐ(ఎం) నుంచి 8 శాతం మాత్రమే ఉన్నారు. ఆప్ లో కూడా అతి తక్కువ సంఖ్యలో వారసులున్నారని ఏడీఆర్ రిపోర్టు చెబుతోంది. వారసత్వ రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పుకొనే బీజేపీలో కూడా రాజకీయ కుటుంబాల నుంచి వచ్చినవారు ఉన్నారు. యూపీలో బీజేపీ, సమాజ్ వాదీ పార్టీల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు ఎక్కువగా వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చినవారే. మహారాష్ట్రకు చెందిన బీజేపీ ప్రజా ప్రతినిధుల్లో కూడా ఈ సంఖ్య తక్కువేమీ లేదు. ఇక ప్రాంతీయ పార్టీల్లో 30 నుంచి 40 శాతం వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చినవారున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్, సమాజ్ వాదీ పార్టీలు 42 శాతంతో టాప్ లో నిలిచాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 38 శాతంతో రెండో స్థానంలో ఉంది. ఇక టీడీపీ 36 శాతంతో మూడో స్థానంలో నిలిచింది. 10 శాతం వారసులు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అన్నాడిఎంకెలో 4 శాతం వారసత్వంగా రాజకీయాలను ఎంచుకున్నారు. ఆర్ జే డీ, జనతాదళ్ (యునైటెడ్) సమాజ్ వాదీ పార్టీల్లో రాజకీయాల్లోకి వారసత్వంగా వచ్చేవారి సంఖ్య 30 శాతానికి పైగా ఉంది.
రాజకీయాల్లో వారసులుగా మహిళలు
సాధారణంగా రాజకీయాల్లోకి వచ్చే మహిళల సంఖ్య తక్కువ. ఈ తక్కు0వ సంఖ్యలోనూ ఎక్కువ మంది రాజకీయ వారసులేనని లెక్కలు చెబుతున్నాయి. విశేషం ఏమిటంటే.. ఈ సంఖ్య పురుషులతో పోలిస్తే ఎక్కువ. మహిళా ఎమ్మెల్యేలు, ఎంపీలలో దాదాపు సగం మంది (539లో 251 మంది(47%)) రాజకీయ వారసత్వం కలిగినవారే. అదే సమయంలో పురుషుల్లో ఈ శాతం చాలా తక్కువ (4,665 మందిలో 856 మంది (18%)) ఉంది. మహిళా నేతల్లో వారసత్వ ప్రభావం పురుషుల కంటే రెండింతలకుపైగా ఉన్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. మహారాష్ట్రకు చెందిన మహిళలు ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, బీహార్, తెలంగాణ రాష్ట్రాలు నిలిచాయి. జార్ఖండ్‌లో 73 శాతం మంది మహిళలు వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర నిలిచింది.