Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ఇప్పటికే ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించగా, ఆ తర్వాత భోపాల్, బెంగళూరు నగరాల్లో కూడా భారీ ఈవెంట్లు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో రామ్‌చరణ్ స్వయంగా పాల్గొంటూ అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపుతున్నారు. అయితే ఈ ఈవెంట్లలో రామ్‌చరణ్ లుక్స్‌తో పాటు మరో వ్యక్తి కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఎక్కడ చూసినా చరణ్ పక్కనే కనిపిస్తూ, అభిమానుల మధ్య రక్షణ కవచంలా నిలుస్తున్న భారీ కాయంతో ఉన్న వ్యక్తి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
బీస్ట్ ఎవరంటూ ఆరాలు..
ఆ వ్యక్తి పేరు కెవిన్ కుంట. ప్రస్తుతం ఆయన రామ్‌చరణ్ వ్యక్తిగత భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ‘పెద్ది’ ఈవెంట్లలో కెవిన్ కనిపించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలామంది అభిమానులు “రామ్‌చరణ్ పక్కన కనిపిస్తున్న ఈ బీస్ట్ ఎవరు?” అంటూ ఆరా తీయడం ప్రారంభించారు.
వివరాల్లోకి వెళితే.. కెవిన్ కుంట ఆఫ్రికా ఖండంలోని గాంబియా దేశానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం ఇటలీలో ప్రొఫెషనల్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) ఫైటర్‌గా గుర్తింపు పొందాడు. ఆయన నేషనల్ మిడిల్‌వెయిట్ MMA ఛాంపియన్‌గా కూడా నిలిచినట్లు సమాచారం. కేవలం ఫైటర్ మాత్రమే కాకుండా, అత్యున్నత స్థాయి వ్యక్తిగత భద్రతా సేవలు అందించే ప్రొఫెషనల్ సెక్యూరిటీ స్పెషలిస్టుగా కూడా కెవిన్‌కు మంచి గుర్తింపు ఉంది.
భారీ పారితోషికం..
అంతర్జాతీయ స్థాయి సెలబ్రిటీలు, ప్రముఖ వ్యాపారవేత్తలు, వీఐపీలకు క్లోజ్ ప్రొటెక్షన్ సెక్యూరిటీ అందించడంలో ఆయనకు మంచి అనుభవం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు రామ్‌చరణ్ కోసం కూడా ఆయన సేవలు అందిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ముంబైలో జరిగిన ‘పెద్ది’ ఈవెంట్‌లో భారీ సంఖ్యలో అభిమానులు, మీడియా ప్రతినిధులు ఒకేసారి రామ్‌చరణ్ వైపు దూసుకురాగా, పరిస్థితిని కెవిన్ ఎంతో సమర్థంగా నియంత్రించిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. అతని ఫిజిక్, చురుకుదనం, భద్రతా విధానాలు చూసిన అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక కెవిన్ పారితోషికం కూడా భారీగానే ఉన్నట్లు సమాచారం. ఆయనకు రోజుకు దాదాపు రూ.2 లక్షల వరకు చెల్లిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం మాత్రం బయటకు రాలేదు. ప్రస్తుతం ‘పెద్ది’ ప్రమోషన్స్ ఎంతగా హైలైట్ అవుతున్నాయో, రామ్‌చరణ్‌తో పాటు కెవిన్ కుంట కూడా అంతే స్థాయిలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు.