Sai Dhansika | నా వాళ్లపై చేయి వేసినా ఊరుకోను .. ఆకతాయిలకి ఝలక్ ఇచ్చిన కబాలి నటి
Sai Dhansika | సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కబాలి’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి సాయి ధన్సిక మరోసారి వార్తల్లో నిలిచారు. ఆ సినిమాలో రజనీకాంత్ కుమార్తె పాత్రలో ఆమె చూపిన నటనకు ప్రేక్షకుల నుంచి విశేష ప్రశంసలు లభించాయి.
Sai Dhansika | సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కబాలి’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి సాయి ధన్సిక మరోసారి వార్తల్లో నిలిచారు. ఆ సినిమాలో రజనీకాంత్ కుమార్తె పాత్రలో ఆమె చూపిన నటనకు ప్రేక్షకుల నుంచి విశేష ప్రశంసలు లభించాయి. గ్లామర్ కంటే నటనకు ప్రాధాన్యం ఇచ్చే పాత్రలను ఎంచుకుంటూ సినీ పరిశ్రమలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న సాయి ధన్సిక తమిళంతో పాటు మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లోనూ నటించి తనదైన గుర్తింపును ఏర్పరుచుకున్నారు.
తెలుగులో ‘షికారు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఆ తర్వాత ‘అంతిమ తీర్పు’, ‘దక్షిణ’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తాజాగా ఆమె లీడ్ రోల్‌లో నటించిన ‘యోగి డా’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందన అందుకుంటోంది. ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించిన సాయి ధన్సిక మరోసారి తన నటనా సామర్థ్యాన్ని చాటుకున్నారు. గౌతమ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి వీ సెంథిల్ కుమార్ నిర్మాతగా వ్యవహరించారు. ఫిబ్రవరి 6న విడుదలైన ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన ఓ షాకింగ్ ఘటనను వెల్లడించారు.
కేరళలో ఒక సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తన అంకుల్ వద్దకు ఓ వ్యక్తి వచ్చి ఫోటో దిగాలని కోరాడని, అయితే అతడు మద్యం మత్తులో ఉండటంతో అంకుల్ నిరాకరించారని సాయి ధన్సిక తెలిపారు. దీంతో ఆ వ్యక్తి కోపంతో అంకుల్‌పై చేయి చేసుకుని అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడని చెప్పారు. “ఆ దృశ్యం చూసిన క్షణంలో నాకు చాలా కోపం వచ్చింది. నా వాళ్లను ఎవరైనా తాకినా నేను సహించను. ఆలోచించకుండా అతడిని వెంబడించి పట్టుకుని కొట్టాను” అని ఆమె స్పష్టంగా చెప్పారు.
మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఉండటంతో తన నియంత్రణ కోల్పోయి సుమారు 10 నిమిషాల పాటు అతడిపై దాడి చేశానని, దర్శకుడు, హీరో వచ్చి ఆపే వరకు తాను శాంతించలేదని ఆమె పేర్కొన్నారు. ఆ సమయంలో సెట్లో ఉన్న వారంతా తన ప్రవర్తన చూసి షాక్ అయ్యారని కూడా చెప్పారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఆమె ధైర్య స్వభావాన్ని అభిమానులు ప్రశంసించేలా చేశాయి.
ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే, సాయి ధన్సిక పేరు నటుడు విశాల్‌తో గతంలో ప్రేమాయణ వార్తల్లో వినిపించింది. ఇద్దరూ నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి సిద్ధమయ్యారనే ప్రచారం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే కొన్ని కారణాల వల్ల వివాహం వాయిదా పడినట్టు వార్తలు వచ్చాయి. ఈ ఏడాది వీరి పెళ్లి జరుగుతుందనే ఊహాగానాలు మళ్లీ వినిపిస్తున్నప్పటికీ దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram