Trisha | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న సమయంలో ప్రముఖ సినీ నటి త్రిష కృష్ణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తన 43వ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఆదివారం రాత్రి తిరుపతికి బయలుదేరిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకోగా, సోమవారం ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.
ఎటువంటి ఆర్భాటం లేకుండా సాధారణ భక్తురాలిగా ఆలయాన్ని సందర్శించిన త్రిష, ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అయితే ఈ పర్యటన కేవలం వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించినదేనా? లేక రాజకీయ పరమైన సంకేతమా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
విజయ్ కోసం వెళ్లారా..
ఇటీవల తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ ప్రాధాన్యం పెరగడంతో, త్రిష దర్శనానికి రాజకీయ రంగు పులుముకుంది. ఎగ్జిట్ పోల్స్‌లో టీవీకేకు అనుకూల ఫలితాలు రావచ్చని అంచనాలు వ్యక్తమవుతున్న తరుణంలో, విజయ్ విజయాన్ని కోరుకుంటూ త్రిష తిరుమలకు వెళ్లారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
విజయ్‌తో త్రిషకు ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో, ఈ పర్యటన వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పుట్టినరోజు కంటే విజయ్ రాజకీయ భవిష్యత్తే ఆమెకు ముఖ్యమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టీవీకే పరిస్థితి ఏంటి?
ఇదిలా ఉండగా, రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ మరింత పెరిగింది. టీవీకే పార్టీ అనూహ్యంగా మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్న అంచనాల మధ్య, ఇతర రాజకీయ పార్టీలు కూడా అప్రమత్తంగా మారాయి. ఫలితాల అనంతరం రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉండటంతో ‘రిసార్ట్ పాలిటిక్స్’ చర్చలు మళ్లీ తెరపైకి వచ్చాయి.
ఈ ఉత్కంఠభరిత రాజకీయ పరిస్థితుల్లో త్రిష తిరుమల సందర్శన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది కేవలం పుట్టినరోజు మొక్కా? లేక విజయ్ రాజకీయ ప్రయాణానికి మద్దతుగా చేసిన ఆధ్యాత్మిక ప్రయత్నమా? అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
Actress #Trisha visited #Tirumala today to seek the blessings of Lord #VenkateshwaraSwami .#TrishaKrishnan pic.twitter.com/bGcmELhAJq
— Milagro Movies (@MilagroMovies) May 4, 2026
