Vasavi | సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు.. క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూసిన వాసవి
Vasavi | తెలుగు బుల్లితెరతో పాటు సినీ ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ నటి వాసవి అలియాస్ పద్మ కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఆమె బుధవారం తన స్వస్థలమైన విజయనగరంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తను నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.
Vasavi | తెలుగు బుల్లితెరతో పాటు సినీ ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ నటి వాసవి అలియాస్ పద్మ కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఆమె బుధవారం తన స్వస్థలమైన విజయనగరంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తను నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె మరణవార్తతో సినీ, టెలివిజన్ వర్గాల్లో దుఃఖ వాతావరణం నెలకొంది.
కరాటే కళ్యాణి తన ఫేస్‌బుక్ పోస్టులో వాసవితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. “వాహిని అక్కా నిన్ను కాపాడాలని ఎంతో ప్రయత్నించాను. కానీ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయావు. మొన్నే వైద్యులు ఇక కష్టం అని చెప్పడంతో ఊరికి తీసుకెళ్లిపోయారు. నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి. మేమంతా నిన్ను ఎంతో మిస్ అవుతున్నాం. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి” అంటూ ఆమె రాసుకొచ్చారు. ఈ పోస్టు అనంతరం పలువురు సినీ ప్రముఖులు, టీవీ ఆర్టిస్టులు, అభిమానులు సోషల్ మీడియాలో సంతాపం తెలియజేస్తున్నారు.
కొన్ని రోజుల క్రితమే వాసవి క్యాన్సర్‌తో పోరాడుతున్న విషయాన్ని కరాటే కళ్యాణి సోషల్ మీడియాలో వెల్లడించారు. ఆమె వైద్య ఖర్చులకు సహాయం చేయాలని కూడా కోరారు. ఈ నేపథ్యంలో పలువురు సీనియర్ నటీనటులు స్పందించి తమ వంతు సహాయం అందించారు. అయినప్పటికీ ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వైద్యులు ఇంటికి తీసుకెళ్లాలని సూచించినట్లు సమాచారం.
1978లో విజయనగరంలో జన్మించిన వాసవి, టీవీ మరియు సినీరంగాల్లో “జయ వాహిని” పేరుతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించిన ఆమె తెలుగు, తమిళ భాషల్లో అనేక సీరియల్స్, సినిమాల్లో నటించారు. ముఖ్యంగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు. బుల్లితెరపై ఆమె నటనకు మంచి అభిమాన వర్గం ఉండేది. చివరిసారిగా ‘బహిర్భూమి’ సినిమాలో కనిపించిన వాసవి, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ రీల్స్ ద్వారా అభిమానులతో టచ్‌లో ఉండేవారు.
తెరపై ఎన్నో పాత్రలతో ప్రేక్షకులను అలరించిన వాసవి ఇక లేరనే వార్త అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఆమె మరణం తెలుగు బుల్లితెర రంగానికి తీరని లోటుగా భావిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram