మెప్పించిన ‘రామాయణ’ ట్రైలర్

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ 'రామాయణ' ఎట్టకేలకు అభిమానుల ముందుకు తన మొదటి ట్రైలర్‌ను తీసుకొచ్చింది. విజువల్ వండర్ గా సాగిన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ===========

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ ‘రామాయణ’ ఎట్టకేలకు అభిమానుల ముందుకు తన మొదటి ట్రైలర్‌ను తీసుకొచ్చింది. గత రెండేళ్లుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ విజువల్ ఎపిక్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు మేకర్స్ జూలై 30 తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో అన్ని ప్రధాన భారతీయ భాషల్లో ట్రైలర్‌ను విడుదల చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు.

నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామాయణం’ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌, సీతగా సాయిపల్లవి, రావణుడి పాత్రలో యశ్‌ నటించారు. మొదటి భాగాన్ని ఈ ఏడాది దీపావళికి, రెండో భాగాన్ని వచ్చే సంవత్సరం దీపావళికి విడుదల చేయనున్నారు. సుమారు రూ.4000 కోట్లతో రెండు భాగాలను రూపొందిస్తున్నారు.

4 నిమిషాల 9 సెకన్ల నిడివి గల ‘రామాయణం’ ట్రైలర్‌లో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దూబే, రావణుడిగా యష్, దశరధుడిగా అరుణ్ గోవిల్, కౌసల్యగా ఇందిరా కృష్ణన్‌, కైకేయిగా లారాదత్త, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సన్నీడియోల్ పోషించిన హనుమంతుడి పాత్ర ట్రైలర్ లో కనిపించలేదు. చిత్ర బృందం మొత్తం తమ నటన, రూపంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సీతగా సాయి పల్లవి పాత్ర సరళతను, సౌమ్యతను చాలా ప్రభావవంతంగా ప్రదర్శించడానికి ప్రయత్నించింది.

యష్ పోషించిన రావణుడి పాత్రతో మొదలైన ట్రైలర్ లో ఫకీరు వేషంలో రావణుడు రాజభవనంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తాడు. సైనికులు “మీరు ఎవరు?” అని ప్రశ్నించగా.. రావణుడు “మీ కొత్త రాజును” అని సమాధానమిస్తాడు. ఆ తర్వాత అతను భారీ రాజభవనం తలుపును తన్నుకుంటూ తెరిచి లోపలికి ప్రవేశిస్తాడు. “దేవలోకం, పృథ్వీలోకం, పాతాళలోకం… ఈ మూడు లోకాలలో ఒకే ఒక్క రాజు ఉంటాడు.. అదే రావణుడి రాజ్యం అంటూ రావణుడు భారీ స్వరంతో చెబుతాడు. లోకంలో అధర్మం పెరిగిపోతున్నప్పుడు, విష్ణువు రాముడి అవతారంలో భూమిపైకి వస్తాడన్న డైలాగ్ లు వినిపిస్తాయి. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ సీతాపహరణం వరకు కొనసాగనుందన్న అంచనాల నేపథ్యంలో ట్రైలర్ ను కూడా ఎక్కువగా ఫస్ట్ పార్ట్ సీన్లకే  పరిమితం చేశారు.

రాముడి బాల్యం ఘట్టాలు, సీతా స్వయం వరం, తండ్రి మాట మేరకు రాముడి వనవాస నిర్ణయం, వనవాసంలో రాక్షసులతో రాముడి పోరాట దృశ్యాలు, శూర్పణఖ రాముడిని మోహించి భంగపడటం, రావణుడి సీతాపహారణం, జటాయువుతో యుద్దం వంటి దృశ్యాలతో ట్రైలర్ ఆసక్తికరంగా విజువల్ వండర్ గా సాగి సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

Latest News