Actor Sivaji Controversy | నటుడు శివాజీ వ్యాఖ్యలపై వివాదం… క్షమాపణలతో ముగిసిన రచ్చ

దండోరా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. సినీ ప్రముఖుల విమర్శలు, మహిళా కమిషన్ చర్యలు, చివరకు శివాజీ క్షమాపణతో ముగిసిన పంచాయితీ.

Actor Sivaji Controversy | నటుడు శివాజీ వ్యాఖ్యలపై వివాదం… క్షమాపణలతో ముగిసిన రచ్చ

Actor Sivaji Controversy Over Remarks on Women’s Dressing Ends With Apology

(విధాత సిటీ బ్యూరో)

డిసెంబర్​ 23, హైదరాబాద్:

తెలుగు సినీ పరిశ్రమలో మహిళల వస్త్రధారణపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. నటుడు శివాజీ తన తాజా చిత్రం దండోరా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చలకు దారి తీశాయి. డిసెంబర్ 22న హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో ఆయన చేసిన ప్రసంగంలోని కొన్ని భాగాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది.

ఈవెంట్‌లో మాట్లాడిన శివాజీ, స్టేజిపై ఉన్న మహిళా యాంకర్​ చీర ధరించడాన్ని ప్రశంసిస్తూ హీరోయిన్ల డ్రెస్సింగ్ విషయంపై మాట్లాడారు.  ఈ సందర్భంగా, ‘అందరు హీరోయిన్లకు నా విజ్ఞప్తి… శరీర భాగాలు బయటకు కనిపించే దుస్తులు వేసుకోకండి. చీరలు లేదా శరీరాన్ని పూర్తిగా కప్పే డ్రెస్సులు వేసుకోండి. అందం అనేది శరీరం చూపించడంలో కాదు… గౌరవపూరిత వేషధారణలో ఉంటుంది’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ, మహిళ ప్రకృతి లాంటిది. ప్రకృతి అందంగా ఉంటే గౌరవిస్తాం. ప్రతీ మహిళ నాకు తల్లిలాంటిదని వ్యాఖ్యానించారు. గత తరం నటీమణులు, అలాగే ప్రస్తుతం రష్మిక మందన్నను ఉదాహరణగా చూపిస్తూ, వారు సాధారణ దుస్తులు ధరించడం వల్లే గౌరవం పొందుతున్నారని చెప్పారు. గ్లామర్‌కు హద్దులు ఉండాలి. స్వేచ్ఛ గొప్పదే కానీ ముందుగా వస్త్రధారణ ఆధారంగానే గౌరవం లభిస్తుందంటూ తన మాటలను ముగించారు.

అయితే ఈ వ్యాఖ్యల మధ్యలో శివాజీ కొన్ని ‘అసభ్య పదాలు’ ఉపయోగించడం వివాదాన్ని తీవ్రతరం చేసింది. ఈవెంట్ వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యాఖ్యలను చాలామంది.. వెనుకబడిన ఆలోచనలు, మహిళలపై అభిప్రాయాలు రుద్ధడంగా అభివర్ణించారు.

సినీ ప్రముఖుల స్పందనలు, ఫిర్యాదులు

ఈ అంశంపై పలువురు సినీ ప్రముఖులు బహిరంగంగా స్పందించారు. గాయని చిన్మయి శ్రీపాద, అనవసర సలహాలు ఇవ్వడం, అసభ్య పదాలతో మాట్లాడటం తప్పంటూ విమర్శించారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నీ ఇంటి ఆడవాళ్ల విషయంలో నీ అభిప్రాయాలు పాటించు… ఇతర మహిళలపై రుద్దే హక్కు నీకు లేదంటూ ఘాటుగా స్పందించారు. నటుడు మంచు మనోజ్, సీనియర్ నటుల తరపున క్షమాపణలు చెబుతూ మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని అన్నారు. నటి అనసూయ భరద్వాజ్, “ఇట్స్ మై బాడీ… నాట్ యువర్స్” అంటూ పోస్ట్ చేయగా, లక్ష్మీ మంచు సహా పలువురు మహిళలు ఏం ధరివంచాలనే దానిపై జోక్యం చేసుకోవద్దని అభిప్రాయపడ్డారు.

ఈ వివాదం అధికారికంగా కూడా ముందుకు వెళ్లింది. ‘వాయిస్ ఆఫ్ ఉమెన్’ కలెక్టివ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA)కు ఫిర్యాదు చేసి శివాజీ నుంచి స్పష్టమైన క్షమాపణ కోరింది. తెలంగాణ మహిళా కమిషన్ ఈ అంశంపై సుమోటోగా కేసు నమోదు చేసి, డిసెంబర్ 27న శివాజీని విచారణకు పిలిచింది.

విమర్శల దాడితో దిగివచ్చిన శివాజీ : ఎక్స్​లో క్షమాపణ

విమర్శలు పెరిగిన నేపథ్యంలో డిసెంబర్ 23న శివాజీ ఎక్స్ (X) వేదికగా వీడియో విడుదల చేసి క్షమాపణ చెప్పారు. “దండోరా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నేను మాట్లాడిన మాటలకు చింతిస్తున్నాను. అసభ్య పదాలు వాడటం తప్పు. నా మాటల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించండి. నాలుగు మంచిమాటలు చెప్పడమే నా ఉద్దేశం తప్ప ఎవరినీ కించపరచడం కాదు” అని చెప్పారు. మహిళలను తాను గౌరవిస్తానని, వారి సౌకర్యం, గౌరవం కోసమే మాట్లాడానని వివరణ ఇచ్చారు.

అయితే క్షమాపణలో పదాల వినియోగంపైనే దృష్టి పెట్టి, అసలు ఆలోచనలపై క్షమాపణ చెప్పలేదని కొందరు విమర్శిస్తున్నారు. శివాజీ ప్రధాన పాత్రలో నటిస్తున్న దండోరా చిత్రం డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుండటంతో, ఈ వివాదం సినిమా ప్రచారంపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.