Paper Thatha | 94 ఏండ్ల ‘పేపర్ తాత’.. షణ్ముగ సుందరం కథ ఇదీ..
Paper Thatha | ఈ కాలం పిల్లలకు బద్దకం ఎక్కువ. నడుము వంచి పని చేసేందుకు అసలు ఇష్టపడరు. అసలు కష్టం అంటే ఏంటో కూడా తెలియదు నేటి యువతకు. స్మార్ట్ ఫోన్( Smart Phone ) వచ్చాక అరచేతిలో ప్రపంచాన్ని చూస్తూ.. కాలం గడిపేస్తున్నారు. కానీ ఓ 94 ఏండ్ల పండు ముసలి తాత( 94 year Old Man ) మాత్రం.. ఇప్పటికీ శ్రమిస్తూనే ఉన్నాడు. అది కూడా ఇంటింటికి తిరుగుతూ పేపర్ వేస్తూ.. పేపర్ తాత( Paper Thatha )గా ప్రసిద్ధి చెందాడు.
Paper Thatha | వర్షం వచ్చినా.. వరదొచ్చినా.. చలి పెట్టినా.. వెన్నులో వణుకు పుట్టినా.. నేటికి చిత్తశుద్ధితో ప్రతి రోజు తెల్లవారుజామున 3.30 గంటల నుంచి తన దినచర్యను కొనసాగిస్తూనే ఉన్నాడు పేపర్ తాత( Paper Thatha ). మరి ఆ పేపర్ తాత గురించి తెలుసుకోవాలంటే తమిళనాడు( Tamil Nadu )లో అడుగు పెట్టాల్సిందే.
పేపర్ తాత కష్టం.. ఆయన మాటల్లోనే..
నా పేరు షణ్ముగ సుందరం( Shanmuga Sundaram ).. నా వయసు 94 ఏండ్లు. చెన్నై( Chennai )లోని తేయనంపేట( Teynampet )లో పేపర్ వేస్తుంటాను. అదేదో ఇప్పుడు పేపర్ వేయడం లేదు.. 2000 సంవత్సరం నుంచి. అంటే దాదాపు 25 ఏండ్లు అవుతుంది పేపర్ వేయబట్టి. నేను పేపర్ వేసిన ఇండ్లలో కరుణానిధి( Karunanidhi ), దయానిధి మారన్( Dayanidhi Maran ) ఇండ్లు కూడా ఉన్నాయి.

ఐదుగురి ఆడపిల్లల పెళ్లిళ్లు చేశాను..
నేను 1931లో జన్మించాను. 1963లో పెళ్లి చేసుకున్నాను. 1950లలో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో పని చేశాను. నష్టాలు రావడంతో.. ఆ తర్వాత వేర్వేరు ఉద్యోగాలు చేశాను. నాకు ఐదుగురు అమ్మాయిలు. వారందరికీ పెళ్లిళ్లు చేశాను. 2000 సంవత్సరంలో పూర్తిగా ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఇక అప్పట్నుంచి పేపర్ బాయ్‌గా మారాను. ఇప్పుడు పేపర్ తాతగా ప్రసిద్ధి చెందాను.
పొద్దున 3.30 గంటలకు మేల్కొని..
పొద్దున 3.30 గంటలకు మేల్కొంటాను. 4 గంటల వరకు ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాను. మొదట పాల ప్యాకెట్లు డెలివరీ చేస్తాను. ఆ తర్వాత ఇంటింటికీ తిరుగుతూ న్యూస్ పేపర్ వేస్తాను. తొలి రోజుల్లో రోజుకు 500 పేపర్లు వేసేవాన్ని. ఇప్పుడు కాస్త వయసు మీద పడడంతో కేవలం 50 పేపర్లు మాత్రమే వేయగలుగుతున్నాను.

వృద్ధాప్య పెన్షన్ అంటే ఏంటో తెలియదు..
ఇక నేను మాజీ సీఎం కరుణానిధి ఇంటికి దినమణి పేపర్( Dinamani newspaper ) వేసేవాడిని. వర్షాకాలంలో తడుచుకుంటూ పేపర్ వేసేందుకు కరుణానిధి ఇంటికి వెళ్తే.. ఆయన పిలిచి టవల్ ఇచ్చేవారు. ఇక వృద్ధాప్య పెన్షన్ ఇచ్చినప్పుడు నాకు కూడా ఇవ్వమని కరుణానిధి అధికారులను ఆదేశించారు. కానీ నేను తిరస్కరించాను. ఎందుకంటే.. శారీరకంగా నేను ఫిట్. కష్టపడి సంపాదించే సత్తా ఉందని చెప్పి.. నేను, మా ఆవిడ వృద్ధాప్య పెన్షన్ తీసుకోలేదు. ఇప్పటికీ కూడా వృద్ధాప్య పెన్షన్ అంటే ఏంటో మాకు తెల్వదు.
నవంబర్ 4న పేపర్ తాతకు రాజీనామా చేస్తా..
ఇప్పుడు ప్రతి రోజు రూ. 500 సంపాదిస్తున్నాను. ఆ డబ్బులను తన మనువలు, మనువరాండ్లకు ఖర్చు పెడుతున్నాను. ఇక ఈ ఏడాది నవంబర్ 4వ తేదీన పేపర్ తాత నుంచి విరామం తీసుకుంటాను. ఎందుకంటే ఆ రోజున నేను 95వ జన్మదినం జరుపుకోబోతున్నాను. అప్పట్నుంచి పేపర్ వేయడం మానేస్తాను. అప్పుడు వృద్ధాప్య పెన్షన్‌ను దరఖాస్తు చేసుకుంటాను అని షణ్ముగ సుందరం చిరునవ్వు చిందిస్తూ చెప్పుకొచ్చాడు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram