ముగిసిన స‌ర్పంచ్‌ల అధికారం

స‌ర్పంచ్‌ల పదవీకాలం ముగిసింది. రాష్ట్రంలో 12769 గ్రామ పంచాయ‌తీలున్నాయి. ఇప్ప‌టి నుంచి మ‌ళ్లీ ఎన్నిక‌లు జ‌రిగే వ‌ర‌కు గ్రామాల‌లో ప్ర‌జా పాల‌న ఉండ‌దు

ముగిసిన స‌ర్పంచ్‌ల అధికారం
  • పంచాయ‌తీల‌లో ప్ర‌త్యేకాధికారుల పాల‌న‌
  • లోక్‌సభ ఎన్నిక‌ల త‌రువాతే పంచాయతీ ఎన్నిక‌లు
  • హైకోర్టును ఆశ్ర‌యించిన స‌ర్పంచ్‌లు
  • స్టే ఇవ్వ‌డానికి నిరాక‌రించిన న్యాయ‌స్థానం

విధాత‌: స‌ర్పంచ్‌ల పదవీకాలం ముగిసింది. రాష్ట్రంలో 12769 గ్రామ పంచాయ‌తీలున్నాయి. ఇప్ప‌టి నుంచి మ‌ళ్లీ ఎన్నిక‌లు జ‌రిగే వ‌ర‌కు గ్రామాల‌లో ప్ర‌జా పాల‌న ఉండ‌దు. గురువారం నుంచి ప్రజాపాల‌న స్థానంలో గ్రామ పంచాయ‌తీల‌లో ప్ర‌త్యేకాధికారుల పాల‌న మొద‌లు కానున్న‌ది. ఇప్ప‌టికే పంచాయ‌తీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ అన్ని గ్రామాల‌కు ప్ర‌త్యేక అధికారుల‌ను నియ‌మించింది. గురువారం నుంచి స‌ర్పంచ్ లంతా మాజీలు అవుతారు. ప‌ద‌వీకాలం ముగుస్తుండంతో స‌ర్పంచ్‌లు త‌మ ప‌ద‌వీకాలాన్ని పొడిగించాల‌ని హైకోర్టును ఆశ్ర‌యించారు. ప్రత్యేక అధికారులను నియమించకుండా సకాలంలో ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఎన్నికలు నిర్వహించడం కుదరకపోతే తమ పదవీకాలాన్ని పొడిగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.


ప్రత్యేక అధికారుల నియామకంపై స్టే ఇవ్వాలని హైకోర్టుకు విన్న‌వించారు. స‌ర్పంచ్‌లు వేసిన పిటిష‌న్‌ను విచారించిన హైకోర్టు స్టే ఇవ్వ‌డానికి నిరాక‌రించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. దీంతో ప్ర‌త్యేక అధికారుల నియామ‌కానికి అడ్డంకులు తొల‌గిపోయాయి. మళ్లీ పంచాయతీ ఎన్నికలు జరిగే దాకా గ్రామాల్లో అభివృద్ధి, సాధారణ పాలన విధులన్నింటినీ ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 3న ప్రత్యేక అధికారుల పాలన, వేసవిలో తాగునీటి సరఫరా, రోడ్లకు మరమ్మతులు వంటి అంశాలపై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డీ సీతక్క, ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించనున్నారు.