Failure of Two Vital Organs | రెండు అవయవాల వైఫల్యం ‌‌– కానీ ఆయన బతికాడు!

బెంగళూరులో 68 ఏళ్ల వ్యక్తి గుండె, కిడ్నీలు ఒకేసారి పనిచేయకపోయినా అరుదైన ఎక్మో చికిత్సతో మళ్లీ ప్రాణం పొందాడు. డాక్టర్ల అంకితభావం, కుటుంబం సహకారం అతనికి పునర్జన్మ ఇచ్చాయి.

Failure of Two Vital Organs | రెండు అవయవాల వైఫల్యం ‌‌– కానీ ఆయన బతికాడు!

బెంగళూరు:
“ఇక అంతే…” అని కుటుంబసభ్యులు కళ్లలో నీరు పెట్టుకున్న ఆ వృద్ధుడు, ఈరోజు మళ్లీ తన మనవళ్లతో ఆడుకుంటున్నారు. గుండె, కిడ్నీలు ఒకేసారి పనిచేయకపోయినా ఆయనను మళ్లీ ప్రాణాలతో బయటికి తెచ్చిన వైద్యుల కథ ఇది.

68 ఏళ్ల జీవనమూర్తి  గుండె సమస్యలతో ఏళ్లుగా బాధపడుతున్నారు. కొద్దికాలంగా కాళ్ల వాపు, శ్వాస ఇబ్బంది, నిద్రలో సడెన్​గా లేవడం వంటి సమస్యలు కనిపించాయి. “చిన్న చిన్న సమస్యలే” అని తేలిగ్గా తీసిపారేసిన చేసిన కుటుంబం ఒకరోజు షాక్‌కు గురైంది. శ్వాసకోశ సమస్యలు తీవ్రమై ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు పరిస్థితి ఆందోళనకరమని చెప్పారు.

పరీక్షల్లో బయటపడింది ఏమిటంటే—ఆయన గుండెకు రక్తం సరఫరా చేసే మూడు ప్రధాన ధమనులు పూర్తిగా మూసుకుపోయాయి. మూత్రపిండాలు కూడా పనిచేయడం ఆగిపోయాయి. వైద్యపరంగా దీనిని కార్డియో-రీనల్ సిండ్రోమ్ అంటారు. ఇలా జరగడం అంటే ప్రాణం పోయినట్లే. సాధారణంగా ఇలాంటి సందర్భంలో హృదయానికి బైపాస్ శస్త్రచికిత్స చేస్తారు. కానీ రోగి వయస్సు, కిడ్నీలు దెబ్బతినడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వలన అది సాధ్యం కాకుండా పోయింది.

“ఇక మార్గమే లేదు” అన్న స్థితిలో వైద్యులు ఒక అరుదైన నిర్ణయం తీసుకున్నారు. అదే ఎక్మో (ECMO) చికిత్స. ఇది ఒక లైఫ్ సపోర్ట్ పద్ధతి. రక్తాన్ని బయటకు తీసి యంత్రంతో ఆక్సిజన్ నింపి తిరిగి శరీరంలోకి పంపుతుంది. గుండె, ఊపిరితిత్తులు తాత్కాలికంగా పనిచేయనప్పుడు ఇది వాటి స్థానంలో పనిచేస్తుంది. సాధారణంగా ఈ పద్ధతిని ఎంచుకోవడం చాలా అరుదు, ఖరీదు ఎక్కువ, నైపుణ్యం కూడా అత్యంత అవసరం. అయినా “ఆయన ప్రాణం కాపాడాలి” అన్నదే డాక్టర్ల ధ్యేయమైంది.

ఎక్మో సహాయంతో ఆయన గుండెలో బ్లాక్ అయిన ధమనులను శుభ్రం చేసి, కొత్త స్టెంట్లను వేశారు. రక్తప్రసరణ మెల్లగా  మెరుగుపడింది. కొన్నిరోజుల్లోనే ఆయన గుండె మళ్లీ సక్రమంగా పనిచేయడం ప్రారంభించింది. కిడ్నీలు కూడా క్రమంగా బలపడ్డాయి. ఐసియు నుంచి బయటకొచ్చే రోజు, కుటుంబసభ్యుల కళ్లలో ఆనందభాష్పాలు కనిపించాయి.

“ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు ఆయన కళ్లలో కాంతి మసకబారిపోయింది. ఇప్పుడు మళ్లీ ఆయన చేతిని పట్టుకుంటే రక్తం సరిగ్గా ప్రసరిస్తున్నట్లు అనిపిస్తోంది” అని కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ డాక్టర్లే మా పాలిటి దేవుళ్లని కొనియాడారు. డాక్టర్లు మాత్రం “ఇది మా బృందానికి కూడా ఒక సవాలు. సమయానికి తీసుకున్న నిర్ణయం, రోగి మనోధైర్యం, కుటుంబం సహకారం వల్లే ఇది సాధ్యమైంది” అని చెప్పారు.

ఇప్పుడు ఆయన సాధారణంగా నడుస్తున్నారు, ఊపిరి పీలుస్తున్నారు. నమ్మశక్యం కాని రీతిలో ఆయన మళ్లీ  ‘బతికాడు’.  కానీ, 60 ఏళ్లు దాటిన తర్వాత ఆరోగ్యాన్ని చిన్నచూపు చూడొద్దు. గుండె, కిడ్నీ సంబంధిత పరీక్షలు తరచూ చేయించుకోవాలి. ఎందుకంటే అందరికీ జీవితంలో రెండో అవకాశం దొరకకపోవచ్చు.