Nightmare Bacteria | పెరుగుతున్న “నైట్‌మేర్ బాక్టీరియా”.. జాగ్రత్తగా ఉండకపోతే ముప్పే!
అమెరికాలో నైట్ మేర్ బాక్టీరియా ఇన్ ఫెక్షన్లు పెరుగుతున్నాయట. ప్రాణాల మీదకు తీసుకొచ్చే ఈ ఇన్ ఫెక్షన్లు మనదేశంలో పెరగడానికి ఎంతో దూరం లేదు. ఎందుకంటే యాంటీబయాటిక్స్ ను దుర్వినియోగం చేయడంలో మనం ఎప్పుడూ ముందుంటాం. ఇంతకీ నైట్ మేర్ బాక్టీరియా అంటే ఏంటి? మనకు కలిగే ముప్పు ఏంటి... పరిష్కారం ఏంటి..?

Nightmare Bacteria | మన జీవితాల్లో యాంటీబయాటిక్స్ ఎంతటి విప్లవాన్ని తెచ్చాయో అందరికీ తెలుసు. ఒకప్పుడు చిన్న ఇన్ఫెక్షన్లు కూడా ప్రాణహాని కలిగించేవి. కానీ ఇప్పుడు యాంటీబయాటిక్స్ పట్ల బాక్టీరియాల “రక్షణ శక్తి” పెరుగుతోంది. అమెరికాలో తాజాగా పెరుగుతున్న “నైట్‌మేర్ బాక్టీరియా” కేసులు దీనికి నిదర్శనం. ఈ బాక్టీరియా సాధారణ మందులు మాత్రమే కాదు, అత్యంత శక్తివంతమైన కార్బాపెనెమ్ యాంటీబయాటిక్స్ కూడా పని చేయనివ్వవు.
“నైట్ మేర్ బాక్టీరియా” అంటే ఏమిటి?
వైద్య పరంగా వీటిని కార్బాపెనమ్ రెసిస్టెంట్ ఎంటిరోబాక్టీరియా (సీఆర్ ఈ) అంటారు. వీటిలో ఈ.కోలి (ఎశ్చరీషియా కోలి), క్లెబ్సియెల్లా న్యూమోనియే వంటి రకాలున్నాయి. అత్యంత శక్తివంతమైన యాంటీబయాటిక్స్ ని కూడా దాటేసి, పేషెంట్లకు ప్రాణాపాయం కలిగిస్తాయి. అందుకే వీటిని నైట్ మేర్ బాక్టీరియా అంటారు. ప్రత్యేకించి న్యూ ఢిల్లీ మెటాలో బీటా లాక్టమేజ్ (NDM) అనే ఎంజైమ్ కి (దీన్ని మొదటిసారిగా ఢిల్లీలో గుర్తించారు. అందుకే ఆ పేరు వచ్చింది) సంబంధించిన జన్యువు ఉన్న ఈ నైట్ మేర్ బాక్టీరియా యాంటీబయాటిక్స్ శక్తిని అడ్డుకుని, మందులు పనిచేయకుండా చేస్తాయి.
నైట్ మేర్ బాక్టీరియా పెరగడానికి కారణం?
• యాంటీబయాటిక్స్ దుర్వినియోగం – అవసరం లేని సమయంలో వాడటం, మధ్యలో కోర్సు ఆపేయడం.
• హాస్పిటల్ పరికరాలు – వెంటిలేటర్లు, క్యాథెటర్లు వంటివి ఈ బాక్టీరియా హాస్పిటల్ లో ఈ బాక్టీరియా పెరగానికి కారణమవుతాయి.
• ఒక దేశం నుంచి మరొక దేశానికి వ్యాప్తి చెందడం.
• కొవిడ్ -19 ప్రభావం – ఎక్కువ మంది ఆసుపత్రుల్లో దీర్ఘకాలం ఉండటం, ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడటం.
నైట్ మేర్ బాక్టరియా ఇన్ ఫెక్షన్ లక్షణాలు
ఈ బాక్టీరియా దాడి చేసినప్పుడు కనిపించే లక్షణాలు సాధారణ ఇన్ఫెక్షన్లలానే ఉంటాయి. అందుకే జాగ్రత్త అవసరం.
• మూత్రనాళ ఇన్ ఫెక్షన్లు (యూటీఐ) : తరచుగా మూత్రం, మండుట, మసక మూత్రం, జ్వరం
• సెప్సిస్ : జ్వరం, చలి, గుండె కొట్టుకునే వేగం పెరగడం, బలహీనత
• న్యుమోనియా : దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి
ఎందుకు ప్రమాదకరం?
• మరణాల రేటు ఎక్కువ – సెప్సిస్ వల్ల ప్రాణాపాయం 40–50% వరకు పెరుగుతుంది.
• చికిత్స అవకాశాలు తక్కువ – పాత లేదా విషపూరిత మందులు తప్ప ఇతర మార్గం ఉండదు.
• నిశ్శబ్ద వ్యాప్తి – కొంతమంది శరీరంలో ఉండి లక్షణాలు చూపించకపోయినా ఇతరులకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
• సబ్బుతో చేతులు కడుక్కుంటూ ఉండాలి.
• యాంటీబయాటిక్స్ ను జాగ్రత్తగా డాక్టర్ చెప్పినట్టుగా వాడాలి. కోర్సు పూర్తి కాకుండా మానేయకూడదు. సొంతంగా యాంటీ బయాటిక్స్ తెచ్చుకుని వాడకూడదు.
• ఆసుపత్రిలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ చర్యలు ఉన్నాయా చూసుకోవాలి.
• చిన్న గాయం అయినా శుభ్రపరిచి డ్రెస్ చేయాలి. గాయం పైన ఇన్ ఫెక్షన్ రాకుండా జాగ్రత్తపడాలి.
• ప్రయాణ సమయంలో పరిశుభ్రత, ఆహారం, నీరు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.