Benefits of Calcium | గోళ్లు చిట్లుతున్నాయా? కాల్షియం లెవెల్స్ చెక్ చేయించుకోండి

Benefits of Calcium | నలభయ్యేళ్లు దాటిన మహిళల్లో క్రమక్రమంగా మజిల్ లాస్, ఎముకల సాంద్రత తగ్గడం లాంటివి కనిపిస్తుంటాయి. మెనోపాజ్ కి చేరుకునే సరికి ఈ సమస్య మరింత పెరుగుతుంది. శరీరంలో కాల్షియం నిల్వలు తగ్గిపోతూ ఉండటమే ఇందుకు కారణం. మన దంతాలు, ఎముకలు బలంగా ఉండటానికి కాల్షియం ముఖ్యమైందని మనకు తెలిసిందే. అయితే గుండె ఆరోగ్యంగా ఉండటానికి, హార్మోన్లు సమతుల్యంగా ఉండటానికి, బీపీ, బరువు నియంత్రణలో ఉండటానికి కూడా కాల్షియం అవసరం అవుతుంది. ఇంకా చాలా రకాల మెటబాలిక్ యాక్టివిటీస్ కి కూడా కాల్షియం అవసరం అవుతుంది. ఇది తక్కువైనప్పుడు అది రకరకాల లక్షణాలుగా బయటపడుతుంది.
కాలి పిక్కల్లో ఒక్కోసారి పట్టేసినట్టు అవుతుంటుంది. తరచుగా ఇలా జరుగుతూ ఉంటే గనుక శరీరంలో కాల్షియం తక్కువ ఉందేమో అని అనుమానించాలి. పిక్కల్లో స్పాస్మ్ రావడానికి ఇతర కారణాలు కూడా ఉన్నప్పటికీ కాల్షియం లోపం ఉందో లేదో తేల్చుకోవడం మాత్రం అవసరం.
చిన్న దెబ్బ తగిలినా ఎముక ఫ్రాక్చర్ అయినట్టు గమనిస్తే కాల్షియం తక్కువ ఉన్నట్టే. కాల్షియం తక్కువ అయినప్పుడు చేతి వేళ్లలో పిన్నులతో గుచ్చినట్టు నొప్పి కూడా వస్తుంది. లోపం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు వేళ్లు మొద్దుబారిపోయి, స్పర్శ లేనట్టు అనిపిస్తాయి.
టాబ్లెట్లు సక్రమంగా వేసుకున్నా, లైఫ్ స్టయిల్ బాగున్నా తరచూ బీపీ పెరుగుతూ కంట్రోల్ లో లేకపోతే కాల్షియం లోపించిందేమో అనుమానించాలి.
కాల్షియం లోపం ఉన్నప్పుడు బరువు తగ్గిపోతారని కూడా అధ్యయనాలు ఉన్నాయి. అంతేగాక గుండె కొట్టుకునే వేగం అసాధారణంగా ఉంటుంది.
చేతుల్లో గానీ, కాళ్లలో గానీ వేళ్ల గోర్లు చిట్లుతుంటే కాల్షియం లోపం ఉన్నట్టుగా భావించాలి. రాత్రిపూట నిద్ర సరిగా పట్టక, అలా దొర్లుతూనే ఉండాల్సి వస్తుందా.. ఇలా నిద్రలో సమస్యలు ఉన్నా కాల్షియం తగ్గి ఉండవచ్చు.