Selling Bat Meat As Chicken | చిల్లీచికెన్ పేరుతో గబ్బిలాల మాంసం అమ్మకాలు! సేలంలో ఘోరం!
తమిళనాడు సేలంలో గబ్బిలాల మాంసాన్ని టేస్టీ చికెన్ పేరుతో విక్రయిస్తున్న సంఘటన కలకలం రేపింది. స్ట్రీట్ ఫుడ్ బండిలో పకోడి, చిల్లీ చికెన్ పేర్లతో గబ్బిలాల మాంసం విక్రయిస్తున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన అధికారులు విచారణ జరుపుతున్నారు.

Selling Bat Meat As Chicken | విధాత : చాల మంది స్ట్రీట్ ఫుడ్ రుచిని అస్వాదిస్తుంటారు. అలాంటి వారిని భయపెట్టే వార్త ఇది. చికెన్ బిర్యానీ , చికెన్ పకోడి, చిల్లీ చికెన్ అంటూ గబ్బిలాల మాంసాన్ని టేస్టీ చికెన్ అంటూ కస్టమర్లతో తినిపిస్తున్న ఘటన తమిళనాడు సేలం జిల్లాలో సంచలనం రేపింది.
తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఒమలూర్ సమీపంలోని డానిష్‌పేట్టై వద్ద గబ్బిలాలను వేటాడి, వాటిని వండుతున్నట్లుగా అధికారులకు సమాచారం అందింది. తోప్పూర్ రామసామి అటవీ ప్రాంతంలో తుపాకీ కాల్పుల శబ్దాలు విన్న సమీప ప్రాంతంలోని జనాలు.. అటవీ శాఖకు ఈ మేరకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అటవీ రేంజర్ విమల్ కుమార్ నేతృత్వంలోని పెట్రోలింగ్ బృందం ఆ ప్రాంతాన్ని తనిఖీ చేయడానికి వెళ్ళగా షాకింగ్ విషయాలు వారి కంటపడ్డాయి. వేటాడిన గబ్బిలాల మాంసంతో సువాసనలు వెదజల్లేలా వంటకాలు చేసి, ఆ మాంసాన్ని చికెన్ పేరిట అక్రమంగా విక్రయిస్తున్నారు. జనాలు అది నిజంగా చికెన్‌గానే భావించి తింటున్నారు. ఇద్దరు వ్యక్తులు అటవీ ప్రాంతంలో ఫ్రూట్ బ్యాట్‌ల (పండ్లు తినే గబ్బిలాలు) ను వేటాడి, వాటిని వండి, చికెన్‌లా విక్రయిస్తున్నట్లు విచారణలో వెలుగుచూసింది.
దీంతో అధికారులు ఆ ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు ఇద్దరిలో ఒకరి పేరు కమల్, మరొకరి పేరు సెల్వం అని గుర్తించారు. కేసు తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు చెప్పారు. కాగా ఫ్రూట్ బ్యాట్‌లు భారతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద షెడ్యూల్-2 జాతిగా రక్షణ పొందుతున్నాయి. వీటిని వేటాడటం లేదా అమ్మడం పూర్తిగా చట్టవిరుద్ధం. ఈ నేరానికి గరిష్టంగా ఏడేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించవచ్చు. 2021లో తుమకూరు జిల్లాలో 25 ఫ్రూట్ బ్యాట్‌ల కళేబరాలను రవాణా చేస్తుండగా అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు కూడా వాటిని మాంసం కోసం బెంగళూరు, తుమకూరులో అమ్మేందుకు రవాణా చేస్తున్నారని తెలిసింది. నిందితులు ఇద్దరు గతంలో స్ట్రీట్ ఫుడ్ బండి వ్యాపారం చేశారు.చికెన్ ధరలు పెరగడంతో గబ్బిలాల బాట పట్టారని పోలీసుల విచారణలో తెలిసింది.
ఫ్రూట్ బ్యాట్‌ల వేటవల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిందితులు కమల్, సెల్వంపై వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972, సెక్షన్ 9, 39 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నేరాలకు గరిష్టంగా రూ.3 లక్షల జరిమానా లేదా ఆరు నెలల జైలుశిక్ష పడే అవకాశం ఉంది. అలాగే నిందితుల నుంచి గబ్బిలాల మాంసం కొనుగోలు చేసి చికెన్ పేరుతో విక్రయిస్తున్న హోటల్ నిర్వాహకులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.