Blind Spot : వైద్యరంగంలో దోపిడీని కళ్లకు కట్టిన పుస్తకం ‘బ్లైండ్ స్పాట్’
యాభై శాతం సర్జరీలు అవసరం లేకుండా నిర్వహిస్తున్నారట! క్యాన్సర్‌ను గుర్తించే పరీక్షల్లోనూ అవకతవకలేనట! గుండెపోట్లు, క్యాన్సర్ తర్వాత అత్యధిక మరణాలకు కారణమవుతున్నది వైద్య చికిత్సలో లోపాలతోనేనట!

Blind Spot : కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీ గురించి అనేక సినిమాల్లో విమర్శనాత్మక ప్రస్తావనలు ఉన్నాయి. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ చాలా మందికి వైద్యం ముసుగులో దోపిడీ అనుభవంలోకి వచ్చే ఉంటుంది. చిన్న తల నొప్పి వచ్చినా వేల ఖరీదైన పరీక్షలు చేయించుకోవాల్సి రావడం కూడా విన్నదే. వీటికి సంబంధించిన అనేక వార్తలు సైతం నిత్యం పత్రికల్లో, టీవీల్లో కనిపిస్తూనే ఉంటాయి. అనవసర శస్త్రచికిత్సలు, పరీక్షల పేరుతో డబ్బులు గుంజుతున్న తీరుపై ప్రఖ్యాత అమెరికన్ వైద్యుడు డాక్టర్ మార్టీ మాకరే ‘బ్లైండ్ స్పాట్ : ది గ్లోబల్ రైజ్ ఆఫ్ అన్నెససరీ హెల్త్ కేర్ అండ్ వాట్ వియ్ కెన్ డూ ఎబౌట్ ఇట్’ పేరిట అద్భుతమైన పుస్తకాన్ని తీసుకొచ్చారు. వైద్య రంగంలో కొనసాగుతున్న దోపిడీని ఆయన కళ్లకు కట్టారు. డాక్టర్ మార్టీ మాకరే జాన్ హాప్కిన్స్ హాస్పిటల్‌లో సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ లాప్రోస్కోపిక్ సర్జరీ విభాగాలో ప్రాక్టీస్ చేస్తున్నారు. అమెరికన్ వైద్య ప్రపంచం సాధారణ ప్రజలకు దూరంగా ఉంచుతున్న వాస్తవాలతో ఆయన రాసిన పుస్తకం వైద్య రంగంలో ఒక భూకంపాన్నే సృష్టించింది. ఈ పుస్తకం హాట్‌కేకుల్లా అమ్ముడవుతూనే ఉన్నది. ఆ పుస్తకంలో కొన్ని అంశాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఇది అమెరికా వైద్య రంగాన్ని ఉద్దేశించి రాసినా.. భారతదేశ వైద్యరంగంలో పరిస్థితులకు సైతం చాలా దగ్గరగా ఉండటం విశేషం.
ఇవే ఆ ముఖ్యాంశాలు
1. 50 శాతానికి పైగా సర్జరీలు అనవసరంగా చేస్తున్నారు : అమెరికాలో సగానికిపైగా శస్త్రచికిత్సలు అవసరం లేకపోయినా నిర్వహిస్తున్నారని అధ్యయనాల్లో తేలింది.
2. వైద్యలోపాలతో మరణాలు : గుండెపోట్లు, క్యాన్సర్ తర్వాత మరణాలకు అవసరం లేని చికిత్సలు, సర్జరీలు సహా చికిత్సలో తప్పిదాలు కారణమవుతున్నాయి.
3. లక్ష కోట్ల డాలర్లు వృథా : అనవసరమైన చికిత్సలు, పరీక్షలు, పాలనాపరమైన అసమర్థత కారణంగా అమెరికా ఆరోగ్య వ్యవస్థ ఏటా లక్ష కోట్ల డాలర్లు వృథా చేస్తున్నది.
4. అవసరం లేకున్నా చికిత్సలు, సర్జరీలు : చాలా మంది డాక్టర్లు అవసరం లేకపోయినా చికిత్సకు, సర్జరీలకు రికమెండ్ చేయడం తమకు మామూలు అయిపోయిందని అంగీకరిస్తున్నారు.
5. తప్పుదోవ పట్టించే హాస్పిటళ్ల ర్యాంకింగ్స్ : చాలా హాస్పిటళ్లు వారి వద్ద నిర్వహిస్తున్న చికిత్సల సంఖ్య ఆధారంగా వాటి ర్యాంకింగ్స్ ఉంటున్నాయే కానీ.. ఎంత ఉత్తమమైన చికిత్స అందిస్తున్నారన్నది ఆధారంగా కాదు. క్వాలిటీ కంటే క్వాంటిటీకే ప్రాధాన్యం ఉంటున్నది.
6. మోకీలు మార్పిడి శస్త్రచికిత్సల్లో 40 శాతం అవసరం లేనివే : మోకీలు మార్పిడి శస్త్రచికిత్సల్లో గణనీయమైన భాగం అవసరం లేనివే. తక్కువ కోత చికిత్సతో మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలను నివారించవచ్చు.
7. మితిమీరిన సిజేరియన్లు : అమెరికాలో ప్రతి ముగ్గురు శిశువుల్లో ఒకరు సిజేరియన్ ద్వారానే పుడుతున్నారు. వైద్యపరంగా అవసరం లేకపోయినా చేస్తున్న ఈ సీ సెక్షన్‌లతో తల్లీబిడ్డలకు ఆరోగ్యపరమైన రిస్కులు పెరుగుతాయి.
8. యాంటిబయాటిక్స్ మితిమీరి ఉపయోగించడం : వైరల్ ఇన్ఫెక్షన్లకు తరచూ యాంటిబయాటిక్స్‌ను వాడాలని రాస్తున్నారు. అవి చికిత్స చేయకపోగా.. శరీరంలో యాంటిబయాటిక్ రెసిస్టెన్స్‌ను తగ్గిస్తాయి, రోగులలోని సూక్షజీవులకు హాని కలిగిస్తాయి.
9. చికిత్స ధరలపై కొరవడిన పారదర్శకత : చాలా మంది రోగులకు తాము చేయించుకునే చికిత్స ఖరీదు ఎంతో దానికి చేయించుకున్నాక గానీ తెలియడం లేదు. ఫలితంగా ఆరోగ్య సంరక్షణ ఖర్చులు ఆకాశాన్నంటుతున్నాయి.
10. జీవిత చరమాంకంలో అతిగా చికిత్స : హెల్త్‌కేర్‌పై పెట్టే ఖర్చులో గణనీయమైన భాగాన్ని పేషెంట్ జీవిత చరమాంకంలో చేసే చికిత్సకు పెట్టాల్సి వస్తున్నది. వాటి వల్ల పేషెంట్లకు ఎలాంటి ఉపయోగం లేదు.. ఉన్నా చాలా కొద్ది పరిమితిలోనే.
11. తప్పుదోవ పట్టించే స్క్రీనింగ్ పరీక్షలు : ప్రోస్టేట్ క్యాన్సర్ లేదా మామోగ్రామ్‌లకు పీఎస్‌ఏ వంటి అనేక సాధారణ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు అధిక రోగ నిర్ధారణకు దారితీయవచ్చు. దానివల్ల అవసరం లేని చికిత్సలు, ఆందోళనకు దారి తీస్తుంది.
12. 90శాతం మంది పేషెంట్లు రెండో అభిప్రాయం తీసుకోవడం లేదు : అవసరం లేని ట్రీట్‌మెంట్లను నివారించేందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి. కానీ.. చాలా మంది మరో డాక్టర్‌ను సంప్రదించాలనే ఆలోచన చేయడం లేదు.
13. మితిమీరిన వైద్యానికి ప్రోత్సాహకాలు : సర్వీను బట్టి పేమెంట్ అనే పద్ధతి డాక్టర్లు మరిన్ని శస్త్రచికిత్సలు చేసేందుకు కారణమవుతున్నది. వారు ఫలితానికి కాకుండా.. చికిత్సకు చెల్లింపులు పొందుతున్నారు.
14. లో రిస్క్ ప్రెగ్నెన్సీలకూ రోటీన్ కేర్ : చాలా తక్కువ రిస్క్ ఉండే ప్రెగ్నెన్సీలకు సైతం అధిక రిస్క్ ఉన్నట్టు ట్రీట్ చేస్తున్నారు. దీని వల్ల అనవసర జోక్యాలు, పరీక్షలు, చికిత్సలు పెరుగుతున్నాయి.
15. శస్త్రచికిత్సలకు భారీ పేమెంట్లు : సర్జరీలు చేసేలా వైద్యులకు ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. వ్యాధిని నిరోధించే లేదా, సంప్రదాయ పద్ధతిలో చికిత్స చేసే బదులు శస్త్రచికిత్సలు చేస్తే వారికి ఎక్కువ ప్రోత్సాహకాలు అందుతున్నాయి.
16. ఇమేజింగ్‌ను అతిగా వాడటం : డయాగ్నస్టిక్ ఇమేజింగ్ టెస్టులైన ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వీటిలో యాధృచ్ఛికంగా కనిపించే సమస్యలకు అవసరం లేని చికిత్సలు, శస్త్ర చికిత్సలు చేస్తున్నారు.
17. 30 శాతం వరకూ హెల్త్‌కేర్ అవసరం లేనిదే : అమెరికాలో అందిస్తున్న హెల్త్‌కేర్‌లో 30 శాతం అవసరం లేనిది లేదా ప్రమాదకరమైనదిగా పరిశోధనలు తేల్చాయి.
18. థైరాయిడ్ క్యాన్సర్ ఓవర్‌డయాగ్నసిస్ : చిన్నవి, ప్రమాదకారి కానివి అయిన ట్యూమర్స్‌ను అతిగా డయాగ్నసస్ చేయడం ద్వారా థైరాయిడ్ క్యాన్సర్ డయాగ్నోస్‌లలో పెరుగుదల కనిపిస్తున్నది. వీటితో మళ్లీ అవసరం లేని సర్జరీలు, ట్రీట్‌మెంట్లు చేస్తున్నారు.
19. డిఫెన్సివ్ మెడిసిన్ : చాలా మంది ఫిజిషియన్లు తరచూ అవసరం లేని టెస్టులు, ట్రీట్‌మెంట్లు చేస్తుంటారు. ఇది అవసరమైకాదు.. ఏమన్నా జరిగితే తమపై ఎక్కడ కేసులు వస్తాయోనన్న భయంతోనే.
20 : అతి చికిత్సకు బాధ్యులెవరు? : అవసరం లేని చికిత్సలు, శస్త్రచికిత్సలు చేసే వైద్యుల విషయంలో వైద్య వ్యవస్థలో జవాబుదారీ అనేదే లేదు.
21: వైద్య ఖర్చులపై మెడికల్ కాలేజీల్లో బోధన లేకపోవడం : హెల్త్‌కేర్ సర్వీసుల ఖర్చు ఎంత అవుతుందనే విషయంలో వైద్య కళాశాలల్లో బోధించే డాక్టర్లు విద్యార్థులకు చెప్పరు. ఫలితంగా వైద్య విద్యార్థులు డాక్టర్లు అయిన తర్వాత రోగులకు వారు ఇచ్చే సలహాల ఖర్చు పర్యవసానాలపై అవగాహన ఉండటం లేదు.
22. ప్రోస్టేట్ క్యాన్సర్ అతి నిర్ధారణ : ప్రోస్టేట్ క్యాన్సర్ టెస్ట్ అయిన పీఎస్‌ఏ.. చాలా సందర్భాల్లో అతి నిర్ధారణలకు, అవసరం లేని చికిత్సలకు దారి తీస్తున్నది. సర్జరీ లేదా రేడియేషన్ థెరపీ వంటివి చేయడం వల్ల మంచి కంటే చెడు జరిగేదే ఎక్కువ.
23. ఉన్న అన్ని అవకాశాలపై రోగులకు వివరించకపోవడం : తక్కువ కోతతో సరిపెట్టగలిగినవి, సంప్రదాయ పద్ధతుల్లో చేసే వైద్యం సహా అన్ని రకాల ఆప్షన్ల గురించి రోగులకు వైద్యులు చెప్పడం చాలా అరుదుగా ఉంటున్నది.
24: శస్త్రచికిత్స కాంప్లికేషన్ శాతాలపై దాపరికం : అనేక హాస్పిటళ్లు వారి శస్త్రచికిత్స సంక్లిష్టత రేటును తక్కువగా నివేదిస్తున్నాయి. కొన్ని శస్త్రచికిత్సల వాస్తవ నష్టాలను ప్రజలకు తెలియనీయడం లేదు.
25: హెల్త్‌కేర్ నిపుణుల్లో అలసట : ఎక్కువ శస్త్రచికిత్సలు, చికిత్సలు చేయాలనే ఒత్తిడి, దానికి తోడు అడ్మినిస్ట్రేటివ్ ఒత్తిడి కారణంగా వైద్యులు తీవ్ర అలసటకు గురవుతున్నారు.
బ్లైండ్ స్పాట్ పుస్తకంలో చర్చించిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఇవి. ఇది వైద్యుల అవగాహన కోసమే. వైద్యులు, హాస్పిటళ్లు తీరు మార్చుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ రాసిన పుస్తకం ఇది. రోగులకు సైతం ఇది అవగాహనే కానీ.. ఇవే అంశాలు ప్రామాణికంగా తీసుకోకూడదని గుర్తించాలి.