నగరంలో కొండ చిలువ..కేబీ పార్కులో ఘటన

హైదరాబాద్ కేబీఆర్ నేషనల్ పార్కులో 20 అడుగుల భారీ కొండచిలువ కనిపించి వాకర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. వాకింగ్ ట్రాక్ దాటిన పైథాన్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హైదరాబాద్ నగరం నడిబొడ్డున బంజారాహిల్స్ ప్రాంతంలో ఉన్న కాసు బ్రహ్మానంద రెడ్డి(KBR) నేషనల్ పార్క్‌లో 20 అడుగుల భారీ కొండచిలువ కనిపించడం కలకలం రేపింది. మార్నింగ్ వాక్ నిర్వహిస్తున్న వాకర్స కు వాకింగ్ ట్రాక్ దాటుతున్న కొండ చిలువ ఎదురుపడింది. దీంతో వాకర్స్ ఆ భారీ కొండ చిలువకు దూరంగా ఆగిపోయి..ఆసక్తిగా వీడియోలు, ఫోటోలు తీసుకుంటుండగా..నెమ్మదిగా ఆ భారీ సరీసృపం ట్రాక్ దాటేసింది.

కొండ చిలువ ఏదో ఒక జంతువును వేటాడి మింగేసి ఉండటంతో అది ట్రాక్ దాటడానికి చాల సమయం తీసుకుంది. దీనిని చూసిన సందర్శకులు, వాకర్స్ ఆశ్చర్యచకితులయ్యారు. ఈ ఘటన పట్టణంలోని అటవీ ప్రాంతంలో విలసిల్లుతున్న వన్యప్రాణి సంపదకు నిదర్శనంగా నిలిచింది. 390 ఎకరాలలో దట్టమైన అటవీ ప్రాంతంగా కనిపించే కేబీఆర్ పార్కు ప్రాంతంలో అరుదైన వన్యప్రాణులు, భారీ కొండచిలువలు (పైథాన్‌లు), రకరకాల విషసర్పాలు ,నెమళ్లు స్వేచ్ఛగా సంచరిస్తుండటం ఇక్కడి జీవ వైవిద్యానికి నిదర్శనంగా కనిపిస్తుంది. 70కి పైగా పక్షి జాతులు, పలు రకాల వన్యప్రాణులు పార్కు ప్రాంతంలో సంచరిస్తుండటం సందర్శకులను, వాకర్స్ ను ఆహ్లాద పరుస్తుంటుంది.

Latest News