Hyderabad Book Fair : నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ షురూ
హైదరాబాద్‌లో 38వ జాతీయ పుస్తక ప్రదర్శన నేటి నుంచి ప్రారంభం. డిసెంబర్ 29 వరకు ఎన్టీఆర్ మైదానంలో మధ్యాహ్నం 1 నుండి రాత్రి 9 వరకు కొనసాగుతుంది. విద్యార్థులకు ఉచిత ప్రవేశం.
విధాత, హైదరాబాద్ : పుస్తక ప్రియులు, సాహిత్య అభిమానులు ఎదురుచూసే పుస్తకాల పండుగ..బుక్ ఫెయిర్(పుస్తక ప్రదర్శన) హైదరాబాద్ లో శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. దోమలగూడ ఎన్టీఆర్ మైదానంలో హైదరాబాద్ 38వ జాతీయ పుస్తక మహోత్సవాన్ని సాయంత్రం 5గంటలకు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించనున్నారు. డిసెంబర్ 29వ తేదీ వరకు ప్రతి రోజు మధ్యాహ్నం 1గంట నుంచి రాత్రి 9గంటల వరకు 11 రోజుల పాటు ఈ పుస్తక మహోత్సవం కొనసాగనుంది. బుక్ ఫెయిర్ లో భాగంగా పుస్తక స్ఫూర్తి పైలాన్ ను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి ఆవిష్కరిస్తారు. జాతీయ, అంతర్జాతీయ పుస్తక ప్రచురణ సంస్థలు పెద్ద సంఖ్యలో ఈ ప్రదర్శనలో పాల్గొననున్నాయి. ప్రతీ ఏటా ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే ఈ బుక్ ఫెయిర్ లక్షలాది మంది పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. గత ఏడాది సుమారు 12 లక్షల మంది సందర్శకులు పుస్తక ప్రదర్శనకు హాజరయ్యారు. ఈ ఏడాది సుమారు 15 లక్షల మందికి పైగా సందర్శించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
బుక్ ఫెయిర్ ప్రాంగణానికి అందేశ్రీ పేరు
ఈ పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి ఇటీవల కన్నుమూసిన ప్రముఖ కవి అందెశ్రీ ప్రాంగణంగా నామకరణం చేశారు. సాంస్కృతిక వేదికకు అనిశెట్టి రజిత పేరును పెట్టారు. ఈ ఏడాది మరణించిన జర్నలిస్ట్ స్వేచ్ఛ పేరిట మీడియా స్టాల్‌ను కూడా ఏర్పాటు చేశారు. మరో వేదికకు రచయిత కొంపల్లి వెంకట్‌గౌడ్ పేరు పెట్టనున్నారు. పుస్తక ప్రదర్శనలో గత ఏడాది 350 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ప్రచురణ సంస్థల నుంచి విశేష స్పందన రావడంతో ఈసారి స్టాళ్ల సంఖ్యను 365కు పెంచారు. ఇందులో మీడియాకు 22 స్టాళ్లు, రచయితలకు 9 స్టాళ్లు ప్రత్యేకంగా కేటాయించారు.
విద్యార్థులకు ఉచిత ప్రవేశం
బుక్ ఫెయిర్ కు వచ్చేవారికి రూ.10 ఎంట్రీ ఫీజు చెల్లించాని, కవులు, రచయితలకు, పాత్రికేయులకు ఉచిత ప్రవేశం ఉంటుందని బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు కవి యాకుబ్ తెలిపారు. అలాగే కేజీ టూ పీజీ విద్యార్ధులకు కూడా ఉచిత ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల్లో పఠనాశక్తి పెంపొందించడం..తద్వారా కలిగే ప్రయోజనాలను వివరించడమే బుక్ ఫెయిర్ లక్ష్యం అని తెలిపారు. బుక్ ఫెయిర్ లో కొనసాగే పుస్తక స్ఫూర్తి కార్యక్రమాలలో కవులు, రచయితలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమను ప్రభావితం చేసిన పుస్తకాల గురించి పంచుకుంటారని తెలిపారు. బుక్ ఫెయిర్ లో పుస్తకావిష్కరణలు, సంస్కృతిక కార్యక్రమాలతో పాటు బాలోత్సవం, అందే శ్రీపై ప్రత్యేకంగా రూపొందించిన నృత్యరూపకం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి ఆర్. వాసు తెలిపారు హైదరాబాద్ పై జాతీయస్థాయిలో వచ్చిన పుస్తకాలపై ప్రత్యేక సమావేశం, బాలల వికాసం కోసం కృషి చేసిన నిపుణులతో సదస్సు ఈ ఏడాది ప్రత్యేకమని తెలిపారు.
తెలంగాణ పబ్లికేషన్స్ స్టాల్స్ రద్దు
బుక్ ఫెయిర్ లో తెలంగాణ పబ్లికేషన్స్ స్టాల్ ను రద్దు చేసినట్లుగా నిర్వాహకులు ప్రకటించారు. పదేళ్లపాటు బుక్ ఫెయిర్ సొసైటీ కార్యదర్శిగా వ్యవహరించిన కోయ చంద్రమోహన్ ఆర్థిక లావాదేవీలు, రశీదులు, మినిట్స్ బుక్, ఇతర పత్రాలు అందజేయకపోవడంతో ఆయన స్టాల్ ను రద్దు చేసినట్లు తెలిపారు. అయితే బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు, ప్రతినిధులు తన పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని కోయ చంద్రమోహన్ ఆరోపించారు. మరోవైపు తెలంగాణ పబ్లికేషన్స్ స్టాల్ ఏర్పాటును నిరాకరించడం తప్పుడు నిర్ణయం అని బుక్ ఫెయిర్ సొసైటీ వ్యవస్థాపక ఆర్గనైజర్ సోము గోపాలరావు, రచయిత సంగిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :
Bangladesh violence| బంగ్లాదేశ్ లో మరోసారి భారత వ్యతిరేక ఆందోళనలు
Pawan Kalyan | సుజిత్‌కు పవన్ కళ్యాణ్ లగ్జరీ కార్ గిఫ్ట్‌గా ఇవ్వడం వెనుక అసలు కథ ఇదే!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram