GTA Mega Convention 2025| వైభవంగా “గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మెగా కన్వెన్షన్ 2025”
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాసులను ఒకే వేదికపైకి తీసుకువచ్చే లక్ష్యంతో నిర్వహిస్తున్న GTA మెగా కన్వెన్షన్ 2025 హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. 30 దేశాల నుంచి వేలాది మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
విధాత, హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా నివసిస్తున్న తెలంగాణ వాసులను ఒకే వేదికపైకి తీసుకురావాలనే సంకల్పంతో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) నిర్వహిస్తున్న “GTA మెగా కన్వెన్షన్ 2025” (GTA Mega Convention 2025)హైదరాబాద్( Hyderabad)లో ఘనంగా ప్రారంభమైంది. ఫైనాన్స్ డిస్ట్రిక్ట్‌లోని అక్షయ కన్వెన్షన్ సెంటర్ వేదికగా డిసెంబర్ 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ మహాసభలు కొనసాగుతున్నాయి.
కన్వెన్షన్ తొలి రోజున త్రిదండి చినజీయర్ స్వామి ఆశీస్సులతో కార్యక్రమాలు మొదలయ్యాయి. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకట్ స్వామి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు మల్లారెడ్డి, జి.జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బొల్లం మల్లయ్య యాదవ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. 30కిపైగా దేశాల నుంచి వేలాది మంది ప్రతినిధులు ఈ కన్వెన్షన్‌కు హాజరవడం విశేషం.
ఈ సందర్భంగా GTA ఫౌండర్ & గ్లోబల్ చైర్మన్ అలుమల్ల మల్లారెడ్డి మాట్లాడుతూ… ఇది కేవలం ఒక కన్వెన్షన్ కాదని, తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస తెలంగాణ వాసుల మేధస్సు, వనరులు, అనుభవాన్ని రాష్ట్ర అభివృద్ధితో అనుసంధానం చేసే వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తుందని తెలిపారు.
నిర్వాహక బృందం కీలక పాత్ర
ఈ మెగా ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించడంలో GTA USA ఫౌండర్ చైర్మన్ విశేశ్వర్ రెడ్డి కల్వల, ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి పాడురి, ప్రెసిడెంట్ ఎలక్ట్ కంకణాల అభిషేక్ రెడ్డి, అడ్వైజరీ చైర్ ప్రతాప్ రెడ్డి పెండ్యాల, సహ వ్యవస్థాపకుడు శ్రవణ్ రెడ్డి పాడురు, USA ప్రెసిడెంట్ ప్రవీణ్ రెడ్డి, వాషింగ్టన్ ప్రెసిడెంట్ రాము ముండ్రాతి తదితరులు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
సంస్కృతి, వినోదానికి ప్రత్యేక ఆకర్షణ
కార్యక్రమంలో 100 మందికి పైగా కళాకారులతో తెలంగాణ జానపద, శాస్త్రీయ కళారూపాల ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మంగ్లీ లైవ్ మ్యూజికల్ నైట్, గాయకుడు మోహన భోగరాజు ప్రత్యేక ప్రదర్శన, అహా ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఎంటర్టైన్‌మెంట్ షో కన్వెన్షన్‌కు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. అతిథుల కోసం 35 రకాల సంప్రదాయ తెలంగాణ వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. “GTA ఫ్యాషన్ షో 2025” ద్వారా తెలంగాణ సంప్రదాయ వారసత్వాన్ని వినూత్నంగా ప్రదర్శించారు.
రెండో రోజు చర్చలు – ‘తెలంగాణ రైజింగ్ 2047’
డిసెంబర్ 28న రియల్ ఎస్టేట్, స్టార్టప్‌లు, ఎన్ఆర్ఐల న్యాయ సమస్యలు, ఆరోగ్య రంగ ఆవిష్కరణలపై మాస్టర్‌క్లాసులు, ప్యానల్ చర్చలు జరగనున్నాయి. “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ కింద రాష్ట్ర అభివృద్ధి, గ్లోబల్ భాగస్వామ్యాలు, పెట్టుబడుల అవకాశాలపై విస్తృత చర్చలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
కన్వెన్షన్ చివరి రోజు సాయంత్రం లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుల ప్రదానం, GTA నూతన నాయకత్వ ప్రమాణ స్వీకారం, గ్రాండ్ లైవ్ కన్సర్ట్‌తో ఈ మహాసభలు ముగియనున్నాయి.

X
Google News
Facebook
Instagram
Youtube
Telegram