Actor Suman Campaigns For Naveen Yadav : నవీన్ యాదవ్ కు మద్దతుగా నటుడు సుమన్ ప్రచారం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా నటుడు సుమన్ ప్రచారం చేపట్టారు. సినీ కార్మికులు, మైనార్టీలు కీలకం కానున్నారు.
విధాత, హైదరాబాద్: జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా సీనియర్ నటుడు సుమన్ ప్రచార బరిలోకి దిగారు. నియోజకవర్గంలోని కృష్ణా నగర్ లో శనివారం అభ్యర్థి నవీన్ యాదవ్ తో కలిసి నటుడు సుమన్ ఇంటింటికి వెళ్లి నవీన్ ను గెలిపించాలంటూ ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే సుమన్ ఆయనకు మద్దతుగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత మరో సీనియర్ నటుడు భానుచందర్, కాదంబరి కిరణ్ లు కూడా నవీన్ కు మద్దతుగా వీడియో రిలీజ్ చేశారు.
సినీ కార్మికులు..మైనార్టీలు కీలకం
జూబ్లీహిల్స్ నియోజక వర్గంలొ మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,08,561 మంది పురుషులు, 1,92,779 మంది మహిళలు. వారిలో మైనార్టీ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. ఆ తర్వాత సినీ పరిశ్రమలో పనిచేసే 24 వేల మంది సినీ కార్మికులు ఈ నియోజక వర్గ పరిధిలోనే ఉంటూ ఓటు హక్కు కూడా కలిగి ఉన్నారు. ఇప్పుడు వీరిని ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. నియోజక వర్గ పరిధిలోని శ్రీకృష్ణానగర్, వెంకటగిరి, రహ్మత్‌నగర్, యూసుఫ్‌గూడ, శ్రీనగర్ కాలనీ, బోరబండ, ఎర్రగడ్డ, షేక్‌పేట తదితర డివిజన్ల పరిధిలో లైట్‌బాయ్‌లు, జూనియర్ ఆర్టిస్టు టెక్నీషియన్లు, ప్రొడక్షన్ సభ్యులు, డ్రైవర్లు ఇలా సినీ షూటింగ్‌లకు పనిచేసే కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వారి మద్దతు కోసం ఇటీవల స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కొత్త సినిమాల టికెట్ల రేట్ల పెంపుదలకు జీవో ఇవ్వాలంటే 20 శాతం కార్మికులకు ఇవ్వాల్సిందేనంటూ కీలక ప్రకటన చేశారు. ఇది అమలయ్యేదేమోకాని సినీ కార్మికులు ఎంతమేరకు రేవంత్ రెడ్డి మాటలు విశ్వసిస్తారో చూడాల్సి ఉంది. నవంబర్ 11న జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ లో ఓటర్లు ఎవరిని కరుణిస్తారన్నది తేలనుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram