బొల్లారం ఆర్మీ క్యాంపులో ఏం జరుగుతుందన్న చర్చ ఆసక్తి రేపుతుంది. తాజాగా ఆర్మీ క్యాంపులోని మద్రాస్ రెజిమెంట్ క్యాంపు ఆయుధాలు భద్రపరిచే గది తాళాన్ని పగులగొట్టిన గుర్తుతెలియని వ్యక్తులు మొత్తం 12 ఆయుధాలను ఎత్తుకెళ్లారు. ఈ చోరీపై విచారణ కొనసాగున్న క్రమంలో గురువారం ఆర్మీ క్యాంపు సమీపంలో 160 డిటోనేటర్లు పట్టుబడటం సంచలనం రేపింది. మద్రాస్ రెజిమెంట్ క్యాంపు ఫైరింగ్ రేంజ్ గోడ సమీపంలోని గోల్ఫ్ ఎన్‌క్లేవ్ ప్రాంతంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు లభించాయి. ప్లాస్టిక్ బకెట్‌లో 8 బండిల్స్‌లో 33ఏ సైజ్ ఉన్న 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లను గుర్తించడంతో బొల్లారం పోలీసులు అప్రమత్తమయ్యారు. మల్కాజిగిరి బాంబ్ డిస్పోజల్ టీమ్ డాగ్ రుద్రతో కలిసి ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసింది.
డిటోనేటర్లు అక్కడికి ఎలా వచ్చాయి? ఎవరు తీసుకొచ్చారు? అనే కోణంలో పోలీసులు, ఆర్మీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.మల్కాజిగిరి బాంబ్ డిస్పోజల్ టీమ్ సూచనతో అధికారులు డిటోనేటర్లను భద్రపరిచారు. డిటోనేటర్ల విలువ సుమారు రూ.32వేలు ఉంటుందని సమాచారం. గుర్తుతెలియని వ్యక్తులపై ఎక్స్‌ప్లోజివ్ సబ్‌స్టెన్సెస్ యాక్ట్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆయుధాలతో పాటు వాటి తూటాల మాయంతో మరింత కలవరం
బొల్లారం ఆర్మీ క్యాంపు అధీనంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల దొంగతనం కేసు దర్యాప్తు కొనసాగుతుంది. రెండ్రోజుల క్రితం ఆయుధాలు భద్రపరిచే గది తాళాన్ని పగులగొట్టిన గుర్తుతెలియని వ్యక్తులు మొత్తం 12 ఆయుధాలను ఎత్తుకెళ్లారు. గది తాళం పగులగొట్టిన అగంతకులు నాలుగు ఏకే 47లు, ఆరు పిస్టళ్లు, ఒక ఇన్సాస్ రైఫిల్, మందుగుండు సామగ్రి ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఆర్మీ అధికారుల ఫిర్యాదుతో బొల్లారం పోలీస్‌స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది.
రక్షణ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారం కావడంతో పోలీసులు కేసు వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో రక్షణ దళాల శిక్షణ సంస్థకు చెందిన వివిధ రెజిమెంట్‌లు కొనసాగుతున్నాయి. ఇందులో మద్రాస్ రెజిమెంట్ ఒకటి. ఇక్కడ ఆర్మీ సిబ్బంది ఆయుధాలు భద్రపరిచే విభాగం ఉంది. ఈ విభాగంలో ఆదివారం రాత్రి దొంగతనం జరిగినట్లు ఆర్మీ అధికారులు గుర్తించారు. అనుమతి ఉన్న వ్యక్తులు మినహా ఎవరూ లోనికి వెళ్లలేరు. అంతటి కట్టుదిట్టమైన భద్రతను దాటి ఆయుధాల చోరీ ఎలా జరిగిందన్నది ఆసక్తి రేపుతుంది. చోరీ ఘటన సోమవారం వెలుగుచూసినప్పటికి..అంతకుముందే ఆయుధాలను మాయం చేశారా అన్న అనుమానాలు సైతం వినిపిస్తున్నాయి.
పక్క ప్రణాళికతోనే దోపిడీ..
చోరీ ఘటనలో ఏకే 203 రైఫిళ్లు, ఏడు 9 ఎం.ఎం. పిస్తోళ్లు, ఒక ఇన్సాస్ మాయమైంది. ఆయుధాలు నిల్వ ఉండే ‘కోటె’లో ఇంకా అనేక రకాల ఆయుధాలు ఉన్నాయి. ఆయుధాలున్న ప్రాంతానికి దాదాపు 50 అడుగుల దూరంలో మందుగుండును ఉంచారు. ప్రతి ఆయుధానికి సంబంధించిన మందుగుండు కేవలం సంబంధిత ఆయుధానికే సరిపోతాయి. చోరీకి పాల్పడ్డ దుండుగులు తాము ఏయే ఆయుధాలను చోరీ చేశారో సరిగ్గా వాటికి సరిపోయే తూటాలనే ఎత్తుకెళ్లడం మరింత కలవరం రేపుతుంది. ఆయుధాలకు, వాటికి సరిపడే తూటాలను మాత్రమే చోరీ చేసిన తీరుతో పక్కా ప్రణాళికతోనే చోరీకి పాల్పడ్డారని విచారణాధికారులు అంచనా వేస్తున్నారు. ఆయుధాల గురించి, మద్రాస్ రెజిమెంట్ భౌగోళిక పరిస్థితుల గురించి బాగా తెలిసిన వారే చేసి ఉంటారని నిర్ధారణకు వస్తున్నారు. రెజిమెంట్లో విధులు నిర్వహిస్తున్న వారందర్నీ ప్రశ్నిస్తున్నారు. ఈ రెజిమెంట్‌కు వచ్చి వెళ్లే రహదారులలోని వందల సీసీ కెమెరాలను స్థానిక పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఆయుధాల చోరీ ఘటన వెలుగులోకి వచ్చి నాలుగురోజులైన కేసులో పురోగతి కనిపించకపోవడం పోలీస్, ఆర్మీ అధికారులకు సవాల్ గా తయారైంది. ఇది ఇలా ఉండగానే డిటోనేటర్లు పట్టుబడటం మరింత ఆందోళనకరంగా మారింది.
