CP Sajjanar Warns Transgenders : ట్రాన్స్‌జెండర్లకు హైదరాబాద్ సీపీ సజ్జనర్ హెచ్చరిక
హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ట్రాన్స్‌జెండర్లను బలవంతపు వసూళ్లకు దూరంగా ఉండాలని హెచ్చరించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
విధాత, హైదరాబాద్ : ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ.. బలవంతపు వసూళ్లకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ట్రాన్స్‌జెండర్లను హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలను మానుకుని ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని వారికి ఆయన హితవు పలికారు.
హైదరాబాద్ అమీర్ పేటలోని సెంటర్ పర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్(సెస్) ఆడిటోరియంలో 250 మంది ట్రాన్స్ జెండర్లతో హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. సీఐడీ, మహిళా భద్రతా విభాగ అదనపు డీజీపీ చారు సిన్హా హాజరయ్యారు. వారు నేరుగా ట్రాన్స్ జెండర్లతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ట్రాన్స్ జెండర్లు తమ సమస్యలను వివరించారు.
ఈ సందర్బంగా నగర సీపీ సజ్జనర్ మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్ల మధ్య గ్రూపు తగాదాలు, ఆధిపత్య పోరు తరచూ శాంతిభద్రతల సమస్యలకు, ప్రాణ నష్టానికి కారణమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మధ్య ట్రాన్స్ జెండర్లపై ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని..ముఖ్యంగా శుభకార్యాల సందర్బంగా ఇళ్లపై పడి యజమానులను వేధించడం సరికాదు అన్నారు. ఇలాంటి బలవంతపు వసూళ్లను సహించబోమని..చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఎంతటి వారినైనా కటకటాల వెనక్కి పంపిస్తాం అని హెచ్చరించారు. మీపై నమోదయ్యే కేసులు మీ భవిష్యత్తును నాశనం చేస్తాయి. అమాయక ప్రజలను ఇబ్బంది పెడితే జైలు శిక్షలు తప్పవుఅని ఆయన హెచ్చరించారు.
ట్రాన్స్ జెండర్ల సంక్షేమానికి త్వరలో ప్రభుత్వ పాలసీ
ట్రాన్స్ జెండర్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సజ్జనార్ గుర్తు చేశారు. ట్రాన్స్ జెండర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని త్వరలోనే ఒక సమగ్రమైన పాలసీని ప్రభుత్వం తీసుకువస్తున్నట్లు తెలిపారు. పోలీసు శాఖ ఎల్లప్పుడూ ట్రాన్స్ జెండర్లకు అండగా ఉంటుందని చెప్పారు.
‘ప్రైడ్ ప్లేస్’తో సమస్యల పరిష్కారం: ఏడీజీ చారు సిన్హా
ట్రాన్స్‌జెండర్ల సమస్యలను పరిష్కరించడానికే మహిళా భద్రత విభాగంలో ‘ప్రైడ్ ప్లేస్’ అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని సీఐడీ, మహిళా భద్రతా విభాగ అదనపు డీజీపీ చారు సిన్హా తెలిపారు. ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎవరైనా వేధించినా నిరభ్యంతరంగా ఈ వింగ్‌ను ఆశ్రయించవచ్చని ఆమె సూచించారు. ట్రాన్స్ జెండర్ల సమస్యలను వినడానికి, పరిష్కరించడానికి మహిళా భద్రతా విభాగం సిద్ధంగా ఉందని చెప్పారు. చట్టవ్యతిరేక పనులకు దూరంగా ఉంటూ, సమాజంలో హుందాగా జీవించాలని సూచించారు.
హైదరాబాద్ జిల్లా ట్రాన్స్‌జెండర్ సంక్షేమ అడిషనల్ డైరెక్టర్ రాజేందర్ గారు మాట్లాడుతూ..తెలంగాణలో దాదాపు 50 వేల మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు పొందాలంటే, ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసే గుర్తింపు కార్డులు తప్పక తీసుకోవాలని సూచించారు . ట్రాన్స్‌జెండర్లకు కార్పొరేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి :
KC Tyagi : అధిక ప్లైట్ ఛార్జీలు వెనక్కి ఇవ్వాల్సిందే : రాజ్యసభ ఎంపీ కేసీ త్యాగి డిమాండ్
Harish Rao| విద్యార్థులు ఆసుపత్రిలో..సీఎం ఫుట్ బాల్ ఆటలో: హరీష్ రావు ఫైర్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram