Criminal Case Against Naveen Yadav | కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ మీద క్రిమినల్ కేసు
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ ఆశావహుడు నవీన్ యాదవ్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. ఓటర్ ఐడీ కార్డులను పంపిణీ చేసి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఈసీ అధికారులు ఫిర్యాదు చేశారు.

విధాత : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలలో కాంగ్రెస్ టికెట్ రేసులో ఉన్న నవీన్ యాదవ్ పై క్రిమినల్ కేసు నమోదైంది. నవీన్ యాదవ్ పై బీఎన్ఎస్ 170, 171, 174తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌లో ఓటర్ కార్డులను పంపిణీ చేసి.. ఎన్నికల సంఘం నిబంధనల ఉల్లంఘించడంపై ఎన్నికల సంఘం అధికారులు స్పందించారు. ఆయన చర్య ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేదిగా ఉందంటూ..జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి రజినీకాంత్ రెడ్డి మధుర నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు నవీన్ యాదవ్ పై కేసు నమోదు చేశారు.
అనుమతి లేకుండా ఎలాంటి సంస్థలు, ఇతర రాజకీయ పార్టీలు ఓటర్ ఐడీ కార్డులను ముద్రించి పంపిణీ చేస్తే తగిన చర్యలు ఉంటాయని ఇప్పటికే ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది. నవీన్ యాదవ్ యూసుఫ్ గూడలోని తన కార్యాలయం వద్ద జూబ్లీహిల్స్ కు చెందిన ఓటర్ ఐడీ కార్డులను స్థానిక ఓటర్లకు మీటింగ్ పెట్టి పంపిణీ చేశారు. ఎన్నికల కమిషన్ చేయాల్సిన పనులను కాంగ్రెస్ పార్టీ నేతలు చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో స్పందించిన ఎన్నికల సంఘం అధికారులు ఆయనపై చట్టపర చర్యలకు ఉపక్రమించారు.