Harish Rao : ప్రలోభాలు..ఫేక్ ఓట్లతో గెలుపుకు కాంగ్రెస్ కుట్ర

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఫేక్ ఓట్లు, డబ్బు పంపిణీతో గెలవాలన్న కుట్ర చేస్తోందని హరీష్ రావు ఆరోపించారు.

Harish Rao : ప్రలోభాలు..ఫేక్ ఓట్లతో గెలుపుకు కాంగ్రెస్ కుట్ర

విధాత, హైదరాబాద్ : అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో గెలుపు కోసం అధికార దుర్వినియోగంతో విచ్చలవిడిగా డబ్బులు, నజరానాలు పంపిణీ చేస్తుందని..అలాగే ఫేక్ ఓటర్ ఐడీ కార్డులతో పెద్ద ఎత్తున నకిలీ ఓట్లకు కుట్ర చేస్తుందని మాజీ మంత్రి టి.హరీష్ రావు ఆరోపించారు. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందంతో కలిసి ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యాన్ని ప్రవహింపజేస్తూ, విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ లక్షకు పైగా చీరలు, మిక్సీ గ్రైండర్లు పంపిణీ చేస్తోందన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని వీడియో, ఫోటో ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్ కి సమర్పించడం జరిగిందని తెలిపారు. దీనిపై పోలీసు అధికారులకు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవడం లేదు అన్నారు.

ముఖ్యంగా ఫేక్ ఓటర్ ఐడీలు భారీగా తయారు చేశారని, ఫేక్ ఐడి కార్డుల వీడియోను ప్రధాన ఎన్నికల అధికారికి సమర్పించడం జరిగిందని తెలిపారు. ఎన్నికలలో అధికార పార్టీ అక్రమాలపై సీ విజిల్ యాప్ లో కంప్లైంట్ కూడా ఇచ్చామన్నారు. పోలింగ్ లో మహిళా పోలీస్ అధికారులను, ఆశా, అంగన్వాడి వర్కర్లను నియమించి లోపలికి వెళ్లే ఓటర్ల ఐడెంటిటీ గుర్తించిన తర్వాతనే పోలింగ్ బూత్ లోకి అనుమతించాలని ఎన్నికల సంఘాన్ని కోరడం జరిగిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని డ్రామాలు ఆడినా జూబ్లీహిల్స్ ఓటర్లు బీఆర్ఎస్ ను గెలిపించాలని ముందే నిర్ణయించుకున్నారని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు.