బీఆర్ఎస్ మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అధికార కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వరుస స్కామ్ లు జరుగుతున్నాయంటూ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందుకు ఆయన శంషాబాద్‌లో రూ.1,000 కోట్ల భూ కుంభకోణం జరిగిందంటూ వివరాలు బహిర్గతం చేశారు. మంగళవారం తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో భూస్కామ్ వివరాలను వెల్లడించారు.
శంషాబాద్ పరిధిలోని పెద్దషాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 172 నుండి 180 లో ఉన్న 94.73 ఎకరాల ప్రభుత్వ భూమి వివాదంలో తగిన నిర్ణయం తీసుకోవాలని 30–01–2026 నాడు హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, ఈ భూమిని నిషేధిత జాబితాలో పెట్టాలని, అక్రమార్కుల నుండి కాపాడాలని 24–2–2026 నాడు ఆర్డీవో తహశీల్ధార్ కు ఆర్డర్ జారీ చేశాడని, అదే విధంగా హైకోర్టులో కూడా అఫిడవిట్ వేశాడని హరీశ్ రావు తెలిపారు.
కానీ 28–02–2026 నాడు తహశీల్ధార్ ఆ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు చెందినదిగా ఆర్డర్ పాస్ చేసి, హైకోర్టుకు కూడా ప్రైవేట్ వ్యక్తుల భూమి అని తెలిపాడని వెల్లడించారు. ఒకే భూమిని ఆర్డీవో ప్రభుత్వ భూమి అంటాడు, తహశీల్ధార్ ప్రైవేట్ భూమి అంటాడని, అసలు కలెక్టర్ అప్రూవల్ లేకుండా ఆర్డీవో, తహశీల్ధార్ భూమి గురించి హైకోర్టులో పిటిషన్ ఎలా వేసారు? అని హరీశ్ రావు నిలదీశారు. ఈ భూ స్కామ్ వెనుక రేవంత్ రెడ్డి, అతని ముఖ్య అనుచరుడైన ఓ కార్పొరేషన్ చైర్మన్ , ఒక మంత్రి ఉన్నారని ఆరోపించారు.
ఈ సర్వే నెంబర్ లోని 94.73 ఎకరాలతో పాటు మరో 176 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ఫైల్ సిద్ధమైనట్లు సమాచారం ఉందని, మొత్తం 270 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి దాదాపు రూ.1,000 కోట్ల కుంభకోణానికి సొసైటీ వైస్ చైర్మన్ తెరలేపారని, ఈ అంశం వివాదాస్పదం అవ్వడంతో తహశీల్దార్‌ను పిలిపించి తను ఇచ్చిన ఉత్తర్వులు గురించి ఏసీబీ విచారణ సైతం చేపట్టిందని తెలిపారు. రాత్రికి రాత్రే ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమిగా భూభారతిలో ఎలా మారింది? అని హరీశ్ రావు ప్రశ్నించారు. తహశీల్ధార్ ఆదేశాల మేరకు ఆ భూమిని భూ భారతిలో ప్రైవేట్ వ్యక్తుల పేరు మీద బదిలీ కూడా చేశారు అని, 24–05–2026 తేదీన ప్రైవేట్ వ్యక్తుల పేరిట మొత్తం 170 ఎకరాలను భూ భారతిలో ఎక్కించారు అని తెలిపారు. చట్ట ప్రకారం ఆర్డీవో దరఖాస్తు చేసుకుని, నిర్ణీత సమయంలో ఆర్డీవో నిర్ణయం తీసుకోవాలని, కానీ ఇక్కడ ఆర్డీవో ప్రమేయం లేకుండా తహశీల్ధార్ నిర్ణయం తీసుకున్నాడన్నారు. ఇదంతా బయటపడగానే గుట్టుచప్పుడు కాకుండా తహశీల్ధార్ ను సస్పెండ్ చేశారన్నారు. ఈ ప్రైవేట్ వ్యక్తుల జాబితాలో మంత్రుల కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉన్నాయని హరీశ్ రావు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి :
రైతుల కోసం హమాలీలకు రూ.10లక్షల 20వేల ఆర్థిక సహాయం: రాజగోపాల్ రెడ్డి
ఏసీబీకి చిక్కిన శామీర్ పేట్ తహశీల్ధార్
