ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి, దిగుతూ మృతిచెందిన హైదరాబాద్ పర్వతారోహకుడు..

ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తర్వాత దిగుతున్న క్రమంలో హైదరాబాద్‌కు చెందిన పర్వతారోహకుడు సందీప్ ఆరె మృతి చెందారు. మరో భారతీయుడు అరుణ్ తివారీ కూడా హిల్లరీ స్టెప్ సమీపంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ సీజన్‌లో ఎవరెస్ట్‌పై రద్దీ పెరగడం భద్రతపై ఆందోళనలు రేకెత్తిస్తోంది.

ఎవరెస్ట్ యాత్రలో హైదరాబాద్‌కు చెందిన పర్వతారోహకుడు సందీప్ ఆరె

హైదరాబాద్‌కు చెందిన పర్వతారోహకుడు సందీప్ ఆరె ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తర్వాత దిగే క్రమంలో మృతి చెందారు.

Hyderabad Climber Sandeep Are Dies During Everest Descent After Reaching Summit

    ముఖ్యాంశాలు

  • ఎవరెస్ట్‌ దిగే క్రమంలో సందీప్ ఆరె మృతి
  • హిల్లరీ స్టెప్ వద్ద అరుణ్ తివారీ కన్నుమూత
  • ఈ సీజన్‌లో ఎవరెస్ట్‌పై భారీ రద్దీ
  • ఒక్కరోజే 274 మంది శిఖరాగ్రానికి చేరిక

 విధాత సిటీ డెస్క్​ | మే 22, 2026:

Hyderabad Climber Dies | హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలన్న కలను నిజం చేసుకున్న భారతీయ పర్వతారోహకుల్లో ఇద్దరు.. అదే శిఖరం నుంచి దిగే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒకరు హైదరాబాద్‌కు చెందిన సందీప్ ఆరె కావడం తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది. ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా చేరుకున్న తర్వాత తీవ్ర అలసటకు గురైన ఆయనను షెర్పా రెస్క్యూ బృందం కిందికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా.. క్యాంప్-2 వద్ద ఆయన మృతి చెందినట్లు నేపాల్ ఎక్స్‌పెడిషన్ అధికారులు తెలిపారు.

సందీప్ ఆరెను ఎత్తైన శిబిరాల నుంచి కిందికి తరలించేందుకు షెర్పా గైడ్లు రాత్రంతా శ్రమించినట్లు ఎక్స్‌పెడిషన్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ కార్యదర్శి రిషి భండారి వెల్లడించారు. బాల్కనీ నుంచి సౌత్ కోల్ వరకు ఆయనను రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగినా, చివరకు ప్రాణాలు నిలబెట్టలేకపోయామని అధికారులు ఆవేదన వ్యక్తం చేసారు. ఇదే సమయంలో మరో భారతీయ పర్వతారోహకుడు అరుణ్ కుమార్ తివారీ కూడా శిఖరాగ్రాన్ని చేరుకున్న తర్వాత దిగుతున్న సమయంలో హిల్లరీ స్టెప్ సమీపంలో తీవ్ర అలసటకు గురై మృతి చెందారు.

శిఖరాన్ని అందుకున్న ఆనందం.. దిగే దారిలో విషాదం

ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తర్వాత దిగుతున్న సమయంలో భారతీయ పర్వతారోహకులు సందీప్ ఆరె, అరుణ్ తివారీ మృతి చెందారు.

ఎవరెస్ట్ అధిరోహణలో శిఖరాన్ని చేరుకోవడం ఎంత కష్టమో, అక్కడి నుంచి సురక్షితంగా దిగిరావడం అంతకంటే ప్రమాదకరమని పర్వతారోహకులు చెబుతుంటారు. ముఖ్యంగా 8,000 మీటర్లకు పైబడిన ‘డెత్ జోన్’లో ఆక్సిజన్ స్థాయి తీవ్రంగా తగ్గిపోతుంది. శరీరం వేగంగా అలసిపోతుంది. ఒక్కో అడుగు కూడా ప్రాణాంతకంగా మారుతుంది. సందీప్ ఆరె, అరుణ్ తివారీ ఘటనలు అదే ప్రమాదాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాయి.

నేపాల్ అధికారుల సమాచారం ప్రకారం, ఈ వసంత కాలపు ఎవరెస్ట్ సీజన్‌లో భారీ సంఖ్యలో పర్వతారోహకులు శిఖరాన్ని అధిరోహించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కరోజే నేపాల్ వైపు నుంచి 274 మంది ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్నట్లు వార్తలు వెల్లడించాయి. ఈ ఏడాది ఎవరెస్ట్ కోసం దాదాపు 494 క్లైంబింగ్ అనుమతులు జారీ కావడం రద్దీపై ఆందోళనలకు దారితీస్తోంది. ఎవరెస్ట్‌పై రద్దీ పెరిగితే శిఖర సమీప ప్రాంతంలో వేచి ఉండే సమయం పెరిగి, అలసట, చలి, ఆక్సిజన్ లోపం వంటి ప్రమాదాలు మరింత తీవ్రమవుతాయి.

ఈ సీజన్‌లో భారతీయుల విజయాలు.. విషాదాలు

ఈ సీజన్‌లో ఎవరెస్ట్‌పై భారీ రద్దీ కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో పర్వతారోహకులు శిఖరాన్ని చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ సీజన్‌లో భారతీయ పర్వతారోహకులు పలువురు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి దేశానికి గౌరవం తీసుకొచ్చారు. 21 ఏళ్ల సానికా షా, బీఎస్‌ఎఫ్ మహిళా పర్వతారోహకుల బృందం సహా పలువురు విజయవంతంగా శిఖరాన్ని చేరుకున్నారు. అయితే అదే సమయంలో ఇద్దరు భారతీయులు దిగే క్రమంలో ప్రాణాలు కోల్పోవడం ఎవరెస్ట్ యాత్రలోని ప్రాణాంతక ప్రమాదాలను మళ్లీ చర్చనీయాంశంగా మార్చింది.

1953లో టెన్జింగ్ నార్గే, ఎడ్మండ్ హిల్లరీ తొలిసారి ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఈ శిఖరాన్ని అధిరోహించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆధునిక పరికరాలు, అనుభవజ్ఞులైన షెర్పా గైడ్లు, మెరుగైన కమ్యూనికేషన్ సదుపాయాలు అందుబాటులోకి వచ్చినా.. ఎవరెస్ట్ మాత్రం ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర పర్వత యాత్రల్లో ఒకటిగా నిలిచే ఉంది.

ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం ప్రతి పర్వతారోహకుడి జీవిత కల. కానీ శిఖరాన్ని చేరుకోవడం సగం విజయం మాత్రమే. సురక్షితంగా తిరిగి రావడంతోనే విజయం పూర్తవతుందని సందీప్, అరుణ్​ల దుర్మరణాలు మరోసారి గుర్తు చేశాయి.

Latest News