హైదరాబాద్ పోలీసులకు సవాల్…ఘాట్‌కేసర్‌లో అర్ధరాత్రి పోకిరీల హల్‌చల్

ఘట్‌కేసర్ సమీపంలో జాతీయ రహదారిపై ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారును బైక్‌లపై వచ్చిన ఆకతాయిలు అడ్డగించి దాడికి యత్నించారు. ఘటన డాష్‌క్యామ్‌లో రికార్డై వైరల్ కావడంతో పోలీసుల చర్యలపై డిమాండ్ పెరిగింది.

హైదరాబాద్ లో శాంతిభద్రతల పరిస్థితులకు అద్దం పడుతూ..నగర పోలీసులకు సవాల్ విసురుతున్న నేరపూరిత ఘటనలు ఇటీవల పెరిగిపోతున్న తీరు ఆందోళన కల్గిస్తుంది. తాజాగా వరంగల్ జాతీయ రహదారిపై ఆకతాయిలు ఓ కారును వెంబడించిన ఘటన ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఘట్ కేసర్ వద్ద ఓ పెళ్లి నుంచి వస్తున్న కుటుంబాన్ని జాతీయ రహదారిపై బైక్‌లతో అడ్డగించిన ఆకతాయిలు కారును ఆపి వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు.

కారులో మహిళలు, చిన్నారులు ఉండటంతో వారంతా భయాందోళనకు గురయ్యారు. దుండగుల వద్ద మరణాయుధాలు కూడా ఉండటం బాధితులను మరింత భయపెట్టింది. అదృష్టవశాత్తు దుండగులకు చిక్కకుండా ఆ కుటుంబం కారులో క్షేమంగా బయటపడింది. ఈ ఘటన మొత్తం డాష్‌క్యామ్‌లో రికార్డు కాగా..ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఈ వీడియో ఆధారంగా పోకిరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

దీనిపై నగర పోలీస్ కమిషనర్ వెంటనే స్పందించి నిందితులను గుర్తించి పట్టుకోవాలని కోరుతున్నారు. నగరంలో శివారు ప్రాంతాల రోడ్లు, కాలనీ రోడ్లలోనే కాకుండా ఏకంగా జాతీయ రహదారులపైన, ఔటర్ రింగ్ రోడ్డు వంటి వాటిపైన, రద్ధీ దారుల్లో సైతం అకతాయిలు దుశ్చర్యలు పెరిగిపోతున్నాయన్న ఆరోపణలు ఇటీవల అధికంగా వినిపిస్తున్నాయి. సీసీ కెమెరాలు..పెట్రోలింగ్ వ్యవస్థ ఉన్నప్పటికి ఈ తరహా ఘటనలకు అడ్డుకట్ట వేయలేకపోతుండటంతో ప్రజల, ముఖ్యంగా మహిళలు, చిన్నారుల భద్రత ప్రశ్నార్థకంగా మారిపోతుంది.

Latest News