చెరువులు, నాలాలు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణల నుంచి హైడ్రా ఇప్పటిదాకా రూ.1.10లక్షల కోట్ల విలువైన భూములను స్వాధీనం చేసుకుని రక్షణ కల్పించిందని హైడ్రా అధికారికంగా ప్రకటించింది. హైడ్రా స్వాధీనం చేసుకున్న భూములు 2435.23 ఎకరాలు. బహిరంగ మార్కెట్లో విలువను పరిగణనలోకి తీసుకుంటే.. ఎకరం రూ. 100 కోట్లు చొప్పున లెక్క కట్టినా రూ. 2,43,500ల కోట్లు.అదే జీవకోటికి ప్రాణాదారమైన చెరువుల్లా.. ప్రాణవాయువును అందించే పార్కులుగా పరిగణిస్తే ఆ విలువ అనంతం అని హైడ్రా పేర్కొంది.
చెరువుల ఆక్రమణల నుంచి 449.11ఎకరాల స్వాధీనం
చెరువుల కబ్జాలను తొలగించి 449.11 ఎకరాలు స్వాధీనం చేసుకున్నామని హైడ్రా నివేదించింది. మొదటి విడత చేపట్టిన 6 చెరువుల పునరుద్ధరణలో భాగంగా.. తమ్మిడికుంట వద్ద 15 ఎకరాలు, కూకట్‌పల్లి నల్ల చెరువులో 14 ఎకరాలు, ఉప్పల్ నల్ల చెరువులో 10 ఎకరాలు, సున్నం చెరువులో 15 ఎకరాలు, బమృకున్ ఉద్ దౌలా చెరువులో 11 ఎకరాలు, బతుకమ్మకుంటలో 5 ఎకరాల భూమిని కాపాడి.. ఆ మేరకు చెరువుల విస్తీర్ణాన్ని పెంచినట్లుగా హైడ్రా తెలిపింది. మొదటి విడత చేపట్టిన 6 చెరువుల చెంతనే 70 ఎకరాల వరకూ హైడ్రా కాపాడింది. ఇక రెండో విడత చేపడుతున్న 14 చెరువుల చెంత మరో 300 ఎకరాల వరకూ హైడ్రా కాపాడినట్లుగా తెలిపింది.
ప్రభుత్వ భూములు 1804.23 ఎకరాలు..
హైడ్రా ఏర్పడిన నాటి నుంచి హైడ్రా ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులతో పాటు.. రెవెన్యూ అధికారులు అందించిన వివరాలు ఆధారంగా 1804.23 ఎకరాలను హైడ్రా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపింది. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్లో 300ల ఎకరాలకు పైగా స్వాధీనం చేసుకుంటే.. ఘట్‌కేసర్ మండలం, కాచవాని సింగారం విలేజ్‌లోని నల్లమల్లారెడ్డి ఆక్రమణలున్నాయి. అమీన్‌పూర్‌లో 862 ఎకరాలను హైడ్రా కాపాడింది. అలాగే రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్, కొండాపూర్ ఇలా నగరం నలువైపులా ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంది. నాలాల ఆక్రమణలను తొలగించి 19.26 ఎకరాలు, పార్కులను కబ్జాదారుల నుంచి విడిపించి 90.29 ఎకరాలు, రహదారులు, ఫుట్‌పాత్‌లను తొలగించి 50.06 ఎకరాలు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల ఆక్రమణల నుంచి 21.29 ఎకరాలను రక్షించినట్లుగా తెలిపింది.

ప్రభుత్వ సహకారంతోనై హైడ్రా భారీ ఆపరేషన్లు
ప్రభుత్వ సహకారంతోనే భారీ ఆపరేషన్లు నిర్వహించి ప్రజలకు చెందాల్సిన భూములను కాపాడిందని హైడ్రా పేర్కొంది. ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న భూమి ఎకరం విలువ చూసుకుంటే ఎక్కడా రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్లకు తక్కువ లేదు అని, ఆక్రమణలతో కొట్టేసిన భూముల ద్వారా వచ్చిన ఆదాయంలోంచి రూ. పదుల కోట్లు కుమ్మరించి.. వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ.. వారి వైపు చూడడానికి కూడా అవకాశం ఇవ్వని పరిస్థితుల్లో హైడ్రా భారీ ఆపరేషన్లు నిర్వహించి ప్రజలకు చెందాల్సిన భూములను కాపాడిందని పేర్కొంది. అమీన్‌పూర్‌లో ముఖీం ఆక్రమణలు తొలగించినా.. విద్యా సంస్థల అధినేతగా చెలామణి అవుతూ ప్రభుత్వ భూములు కాజేయాలని ప్రయత్నించిన నల్లమల్లారెడ్డి , హైటెక్‌సిటీ వద్ద తేదేపా ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్‌కు చెందిన 29 ఎకరాలు, గచ్చిబౌలిలో సంధ్యా శ్రీధర్‌రావు ఇలా వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ భూములు కొల్లగొట్టిన ఏ ఒక్కరినీ వదలకుండా ప్రజలకు చెందాల్సిన భూములను హైడ్రా కాపాడినట్లుగా హైడ్రా వెల్లడించింది.
మరో రూ. లక్ష కోట్ల భూములు కాపాడే పనిలో హైడ్రా: కమిషనర్ ఏవీ రంగనాథ్
హైడ్రా 2024వ సంవత్సరం జులై 19న ఏర్పడింది. మరో నెల రోజుల్లో రెండేళ్లు పూర్తి చేసుకోబోతోంది. ఈ రెండేళ్లలో రూ. 1.10 కోట్ల విలువైన భూమిని హైడ్రా కాపాడితే.. వచ్చే ఏడాది మరో రూ. లక్ష కోట్ల విలువైన భూములు కాపాడాలని హైడ్రా లక్ష్యంగా పెట్టుకుందని కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. అంతే కాదు.. చెరువులను పెద్దమొత్తంలో పునరుద్ధరించి పర్యావరణానికి పెద్దపీట వేస్తాం అన్నారు. మొదటి విడత 6 చెరువులు, రెండో విడత 14 చెరువుల పునరుద్ధరణకు తోడు.. మరో 4 పెద్ద చెరువులను మినీ ట్యాంక్ బండ్‌లుగా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అడుగులు వేస్తోందన్నారు. వర్షాకాలం కాలనీలు, రహదారులను వరద ముంచెత్తకుండా.. క్షేత్రస్థాయిలో సైన్యం మాదిరి హైడ్రా డీఆర్ ఎఫ్, మెట్ (మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్)టీమ్‌లు గస్తీ కాస్తాయని తెలిపారు.