నగరంలోని పుప్పాలగూడలో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. 200 ఎకరాల ప్రభుత్వ స్థలానికి ఫెన్సింగ్ వేసింది. దీంతో రూ.30వేల కోట్లు విలువ చేసే భూమిని కాపాడినట్లుగా హైడ్రా వెల్లడించింది. హైకోర్టు తీర్పు మేరకు ప్రభుత్వం స్థలం చుట్టూ హైడ్రా రక్షణ చర్యలు తీసుకుంది.
పుప్పాలగూడలోని చారిత్రక రాళ్ల గుట్టలను కాపాడాలని సొసైటీ టూ సేవ్ రాక్స్ ప్రతినిధులు చాలాకాలంగా పోరాటం చేస్తున్నారు. తాజాగా హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో కమిషనర్ రంగనాథ్ విచారించి రక్షణ చర్యలు తీసుకున్నారు.
వారం క్రితమే పుప్పలగూడ – నార్సింగి గ్రామాల పరిధిలో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. హెచ్ఎండీఏ లెక్కల ప్రకారం ముష్కిన్ చెరువులో 52.20 ఎకరాల ఎఫ్ టీఎల్ పరిధి ఉండ,గా మధ్యలోంచి కట్ట నిర్మించి 34.21 ఎకరాలు కొట్టేసే ప్రయత్నం జరిగింది.చెరువు అభివృద్ధి పేరుతో చేస్తున్న కబ్జాలకు హైడ్రా చెక్ పెట్టింది. చెరువులోని రూ.5,500 కోట్లు విలువైన కబ్జాలను తొలగించి భూమిచుట్టూ ఫెన్సింగ్ చేపట్టింది. తమ ఫిర్యాదు మేరకు హైడ్రా స్పందించి విలువైన ప్రభుత్వ భూములు కాపాడటం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
