Hyderabad Crime News : దారుణం.. చట్నీ మీద పడేశాడని వ్యక్తి దారుణ హత్య!

హైదరాబాద్ నాచారం పరిధిలో టిఫిన్ సెంటర్ వద్ద చట్నీ మీద పడేశాడన్న చిన్న కారణంతో మురళీకృష్ణ అనే వ్యక్తిని నలుగురు యువకులు దారుణంగా హత్య చేశారు.

Hyderabad Crime News : దారుణం.. చట్నీ మీద పడేశాడని వ్యక్తి దారుణ హత్య!

విధాత, హైదరాబాద్ : టిఫిన్ సెంటర్ వద్ద చట్నీ మీద పడేశాడన్న కారణంతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. హైదరాబాద్ నాచారం పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నలుగురి నిందితులలో ఒక మైనర్ కూడా ఉన్నాడు. అర్ధరాత్రి 2 గంటలకు కారులో షికారు చేస్తున్న మహమ్మద్ జునైద్(18), షేక్ సైఫుద్దీన్(18), మణికంఠ (21), మరో బాలుడు(16)లను ఉప్పల్ కు చెందిన మురళీకృష్ణ అనే వ్యక్తి ఎల్బీనగర్ వద్ద లిఫ్ట్ అడిగాడు. కొంత దూరం వెళ్లాక ఎన్జీఆర్ఐ ప్రాంతంలో ఆ యువకులు టిఫిన్ కోసం కారు ఆపారు. అక్కడ టిఫిన్ చేస్తున్న క్రమంలో పొరపాటున లిఫ్ట్ ఇచ్చినవారిపై మురళీకృష్ణ చట్నీ పడేశాడు.

ఈ క్రమంలో మాటామాట పెరిగి వాగ్వాదం ముదిరింది. దీంతో ఆగ్రహానికి లోనై ముగ్గురు యువకులు మురళీ కృష్ణను కారులో బలవంతంగా ఎక్కించుకుని అతడిపై దాడి చేశారు. లిఫ్ట్ ఇచ్చిన మా మీదే చట్నీ పోస్తావా అంటూ పిడి గుద్దులతో దాడి చేశారు. రెండు గంటలు కారులో తిప్పుతూ.. సిగరెట్లతో కాల్చుతూ.. కత్తితో మురళి కృష్ణను పొడిచేశారు. నిందితుల నుంచి తప్పించుకునేందుకు మురళీ కృష్ణ కారు దూకి పారిపోతుండగా.. వెంబడించి మరీ దారుణంగా హత్య చేశారు.

మురళి కృష్ణ చనిపోయాడని నిర్ధారించుకుని మార్గ మధ్యలో కత్తి పడేసి మల్లాపూర్ కేఎల్ రెడ్డి నగర్ ప్రాంతంలో కారు పార్క్ చేసి నలుగురు యువకులు పారిపోయారు. విషయం తెలిసిన పోలీసులు నిందితులను సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పట్టుకుని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.