జూబ్లీహిల్ ఎన్నికల వేళ తెరపైకి మాగంటి మాలినీ దేవి..విచారణకు హాజరు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ మాగంటి గోపీనాథ్ వారసత్వంపై మాలినీ దేవి, సునీత మధ్య వివాదం తీవ్రతరం, రెవెన్యూ అధికారుల విచారణ హాట్ టాపిక్‌గా మారింది.
విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ చట్టబద్ద వారసత్వ నిర్ధారణ అంశం ఆసక్తికరంగా మారింది. మాగంటి గోపినాథ్ చట్టబద్ధమైన వారసులను నిర్ధారించే ఫ్యామిలీ సర్టిఫికెట్ పత్రాన్ని మాగంటి సునీత ఇటీవల రెవెన్యూ అధికారుల నుంచి పొందారు. అయితే, ఈ సర్టిఫికెట్‌పై గోపినాథ్ మొదటి భార్యగా పేర్కొంటున్న మాగంటి మాలినీ దేవి, ఆమె కుమారుడు ప్రద్యుమ్న తారక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
తమ పేర్లను చేర్చకుండా, తప్పుడు సమాచారంతో సునీత ఈ ధృవీకరణ పత్రాన్ని పొందారని ఆరోపిస్తూ మాలినీ దేవి, తారక్ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన అధికారులు, ఈ వివాదంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా, ఇరుపక్షాల వాదనలు వినేందుకు శేర్లింగంపల్లి తహశీల్థార్ కార్యాలయానికి హాజరు కావాలని అందరికీ నోటీసులు జారీ చేశారు.
విచారణకు హాజరైన ఇరుపక్షాలు
మాగంటి గోపినాథ్ వారసత్వ నిర్ధారణ విచారణతో శేర్లింగంపల్లి తహశీల్ధార్ ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విచారణకు ఫిర్యాదుదారులు మాగంటి మాలినీ దేవి, ఆమె కుమారుడు ప్రద్యుమ్న తారక్‌తో పాటు, మాగంటి గోపినాథ్ తల్లి మహానందకుమారి కూడా హాజరయ్యారు. మరోవైపు మాగంటి సునీత తరపున ఆమె చిన్న కూతురు దీశిరా, వారి తరపు అడ్వకేట్ విచారణకు హాజరయ్యారు. ఇరుపక్షాల నుంచి తహశీల్ధార్ స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్నారు.
తామే అసలైన వారసులం : మాలినీ దేవి
విచారణకు హాజరైన అనంతరం మాలినీదేవి మాట్లాడుతూ తాను, ప్రద్యుమ్న తారక్ మాత్రమే మాగంటి గోపినాథ్ చట్టబద్ద వారసులమని చెప్పారు. తమ ఉనికిని దాచిపెట్టి, తమ పేర్లు లేకుండా మాగంటి సునీత ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తీసుకున్నారని, ఇది పూర్తిగా అన్యాయం, చట్టవిరుద్ధం అని ఆమె అన్నారు. ఈ విషయంపై తాము ఆధారాలతో సహా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశామని, తమ ఫిర్యాదును పరిశీలించిన అధికారులు, అందులో వాస్తవం ఉందని గ్రహించి, గతంలో సునీతకి జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్‌ను రద్దు చేశారని మాలని దేవి వివరించారు. ఆ సర్టిఫికెట్ రద్దు కావడం వల్లే ఈ రోజు తమను విచారణకు పిలిచారని పేర్కొన్నారు.
గోపీనాథ్ కి, తనకు చట్టప్రకారం ఎప్పుడూ విడాకులు కాలేదని ఆమె స్పష్టం చేశారు. తాను ఆయన మొదటి భార్యగా, తన కుమారుడు చట్టబద్ధమైన వారసుడిగా ఉన్నప్పుడు, తమను కాదని సర్టిఫికెట్ సునీతకు ఎలా ఇస్తారని తాము ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. ఇది ఆస్తి వాటాల గురించి కాదని, తమ హక్కుల గురించి, తమ గుర్తింపు గురించి అని స్పష్టం చేశారు. గత విచారణలో, తహశీల్ధార్ ఇరుపక్షాల వాదనలు విన్నారని, తమ దగ్గర ఉన్న ఆధారాలు, డాక్యుమెంట్లు ఏమిటనిప్రశ్నించారని.. తమ వివాహానికి సంబంధించిన అన్ని ఆధారాలు, తమకు విడాకులు కాలేదన్న దానికి సంబంధించిన పత్రాలు తమ వద్ద ఉన్నాయని, అవన్నీ సమర్పించడానికి తాము సమయం కోరినట్లు చెప్పారు. సునీత పక్షం కూడా వారి వద్ద ఏమైనా పత్రాలు ఉంటే సమర్పించాలని తహశీల్ధార్ చెప్పారని వివరించారు. అందుకే, ఇరుపక్షాలు తమ పూర్తి డాక్యుమెంట్లు, సర్టిఫైడ్ కాపీలు దాఖలు చేయడానికి విచారణను నవంబర్ 25వ తేదీకి వాయిదా వేశారని మాలని దేవి పేర్కొన్నారు. తమ దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయని, తమకు న్యాయం జరుగుతుందన్న పూర్తి నమ్మకం ఉందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
నా కుమారుడి మరణంపై అనుమానాలు
మాగంటి గోపీనాథ్ తల్లి మహానందకుమారి మాట్లాడుతూ నా కుమారుడి మరణం పై అనేక అనుమానాలు ఉన్నాయని, ఆస్పత్రిలో ఎప్పుడు చేరాడు, ఎందుకు చేరాడో కూడా తనకు తెలియదని అన్నారు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు పరామర్శ కోసం వెళితే తనను చూడనివ్వలేదన్నారు. కేటీఆర్ కూడా తన కుమారుడిని పరామర్శించేందుకు వచ్చాడని ఆయనను తాను అడిగినా కనీసం తనను పట్టించుకోలేదని, ఆస్పత్రిలో ఏం జరిగిందో కేటీఆర్ చెప్పాలని గోపీనాథ్ తల్లి డిమాండ్ చేశారు. ఇదే విషయంపై మాగంటి మొదటి భార్య కుమారుడు తారక్ ప్రద్యుమ్న మాట్లాడుతూ మా నాన్న చనిపోయిన సమయంలో అంత్యక్రియలకు రాకుండా ఓ పార్టీ నాయకులు అడ్డుకున్నారని, మమ్మల్ని బెదిరింపులకు గురి చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. మాగంటి ఇంటి పేరు లేకపోవడంపై ప్రశ్నించగా కొసరాజు అనేది మా అమ్మ నుండి వచ్చిందని అదే కంటిన్యూ అవుతుందని అన్నారు.
మాలినీ, తారక్ ల ఇంటిపేరులో గోపినాథ్ లేదు : సునీత న్యాయవాది
విచారణ అనంతరం మాగంటి సునీత న్యాయవాది, బీఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ లలితా రెడ్డి మాట్లాడుతూ మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యుల సర్టిఫికేట్ విషయంపై గత కొద్దిరోజులుగా వివాదం నడుస్తుందని, సునీత, పిల్లల ఆధార్, ఓటర్ ఐడీ, పిల్లల ఓటర్ ఐడీ, ఆధార్ కార్డులలో అన్నింటిలో ఇంటిపేరు మాగంటి , తండ్రిగా గోపీనాథ్ పేరునే ఉందన్నారు. మాగంటి గోపీనాథ్, సునీతకు పుట్టిన పిల్లలే అక్షర, రిశిర, వాత్సల్య అని తెలిపారు. అసెంబ్లీ సెక్రటరీ జారీచేసిన స్పౌస్ కార్డులో కూడా మాగంటి సునీత పేరు మాత్రమే ఉందన్నారు. తారక్ ప్రద్యుమ్న రికార్డులో ఎక్కడా మాగంటి అనే పేరులేదని.. తారక్, మాలినిదేవి ఇంటిపేర్ల విషయంలోనూ కోసరాజు అని మాత్రమే ఉందని, డాటర్ ఆఫ్ వెంకటేశ్వర రావు అనే ఉంది కానీ వైఫ్ ఆఫ్ అని గోపీనాథ్ పేరు లేదని లలితా రెడ్డి వివరించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందనే ఉద్దేశ్యంతో ఇదంతా కావాలనే జరుగుతున్న కుట్రగా అభివర్ణించారు. ఈ ఇష్యూ వల్ల ఎన్నికలకు ఎలాంటి ఆటంకం లేదన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram