కేపీహెచ్‌బీలో ప్రైవేట్ బస్సుకు అగ్ని ప్రమాదం – ప్రయాణికులు సురక్షితం : వీడియో

కుకట్‌పల్లిలో అర్థరాత్రి ప్రైవేట్ ఏసీ స్లీపర్ బస్సులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ కేబిన్ వద్ద మొదలైన మంటలు క్షణాల్లో వ్యాపించగా, 20 మంది ప్రయాణికులను సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

Private AC sleeper bus engulfed in flames at KPHB Kukatpally Hyderabad at night

కేపీహెచ్‌బీ కుకట్‌పల్లిలో రాత్రి సమయంలో మంటల్లో చిక్కుకున్న ప్రైవేట్ ఏసీ స్లీపర్ బస్సు

Hyderabad KPHB Bus Fire: Private Sleeper Coach Gutted, 20 Passengers Escape Safely

సిటీ బ్యూరో | హైదరాబాద్: 

KPHB Bus Fire | నగరంలోని కుకట్‌పల్లి కేపీహెచ్‌బీ ప్రాంతంలో శుక్రవారం అర్థరాత్రి సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు క్షణాల్లో వ్యాపించినా, బస్సు సిబ్బంది అప్రమత్తతతో 20 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనతో అక్కడి ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

మియాపూర్ నుంచి ఎస్‌ఆర్ నగర్ మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని పాలకొల్లుకు వెళ్తున్న శ్రీ దుర్గా మహేశ్వరి ట్రావెల్స్ ఏసీ స్లీపర్ బస్సులో ఈ ప్రమాదం జరిగింది.

 డ్రైవర్ కేబిన్ వద్ద మంటలు ప్రారంభం

 

రాత్రి సుమారు 11 గంటల సమయంలో కేపీహెచ్‌బీలోని పద్మావతి ప్లాజా బస్ స్టాప్ సమీపానికి చేరుకున్నప్పుడు డ్రైవర్ కేబిన్ వద్ద ఒక్కసారిగా మంటలు మొదలయ్యాయి. వెంటనే స్పందించిన బస్సు సిబ్బంది ప్రయాణికులను ఒక్కొక్కరుగా బయటకు దించారు. కొద్ది నిమిషాల్లోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించి వాహనం పూర్తిగా దగ్ధమైంది.

అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి

సమాచారం అందుకున్న కూకట్‌పల్లి ట్రాఫిక్ సీఐ జానయ్యతో పాటు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగకపోవడం ఊరట కలిగించింది. అయితే కొంతసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్​కు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. అగ్ని ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.

Latest News