KTR : ఎవరిది అహంకారమో ప్రజలు గమనిస్తున్నారు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ దుర్వినియోగం, రౌడీయిజంతో గెలిచిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎవరిది అహంకారమో ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు.

KTR : ఎవరిది అహంకారమో ప్రజలు గమనిస్తున్నారు

విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఓటమితో కేటీఆర్ అహంకారం, హరీష్ రావు అసూయ తగ్గించుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఎవరిది అహంకారమో ప్రజలు గమనిస్తున్నారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ రౌడియిజం, అధికార దుర్వినియోగం, దొంగ ఓట్లు, నోట్ల పంపిణీతో గెలిచిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు, అక్రమాలు చేసినా.. వాటిని ఎదుర్కొని నిలబడి గట్టి పోటీ ఇచ్చిన సునీత గోపీనాథ్‌ను, వారి పిల్లలు చూపిన స్ఫూర్తిని, పోరాటాన్ని కేటీఆర్ అభినందించారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని కేటీఆర్ ధైర్యం చెప్పారు. అనంతరం రహమత్ నగర్ డివిజన్‌లో కాంగ్రెస్ శ్రేణుల దాడిలో గాయపడిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రాకేష్ క్రిస్టోఫర్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు కాకముందే కాంగ్రెస్ పార్టీ రౌడీయిజం, గుండాయిజం మొదలుపెట్టిందన్నారు. మా పదేండ్ల హయాంలో ఎన్నో ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందినా ఎప్పుడు ప్రతిపక్షాలపై దాడులు చేయలేదు అన్నారు. కార్యకర్తలు ఎవ్వరూ దిగులు చెందొద్దు.. బీఆర్ఎస్ పార్టీలోని ప్రతి కార్యకర్తను కంటికిరెప్పలా కాపాడుకుంటాం. ఆపదొస్తే… అన్ని వేళల్లో అండగా ఉంటాం అన్నారు. ఎవరిది అహంకారమో ప్రజలు గమనిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ ఇట్లనే విర్రవీగితే
ప్రజలే బుద్ది చెబుతారు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకు ఏం జరిగినా
కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది అని, అర్ధగంటలో వస్తా అని చెప్పినట్లుగానే ఇవ్వాళ వచ్చినం.. ఇకముందు కూడా ఇట్లనే వస్తాం అన్నారు. మా కార్యకర్తపై జరిగిన దాడికి
కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై మంగళవారం పార్టీ పరంగా సమీక్ష సమావేశం ఉంటుందని తెలిపారు.