Ponnam Prabhakar | కొత్త కాల‌నీల‌కు బ‌స్సు రూట్‌లు- ఫోర్త్ సిటీలో ట‌ర్మిన‌ల్‌ : అద్య‌య‌నం చేయాల‌న్న మంత్రి పొన్నం

హైదరాబాద్‌లో కొత్త కాలనీలకు బస్సు రూట్లు, ఫోర్త్ సిటీలో బస్ టెర్మినల్ ఏర్పాటుకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు.

Ponnam Prabhakar | కొత్త కాల‌నీల‌కు బ‌స్సు రూట్‌లు- ఫోర్త్ సిటీలో ట‌ర్మిన‌ల్‌ : అద్య‌య‌నం చేయాల‌న్న మంత్రి పొన్నం

విధాత‌: గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో పెరుగుతున్న కొత్త కాలనీ లకు అనుగుణంగా బస్సు రూట్ లు పెంచేలని ఇందు కోసం అద్య‌య‌నం చేయాల‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ఆర్టీసీ ఎండీని ఆదేశించారు. అలాగే కారుణ్య నియామకాల కింద నియమించబడిన కండక్టర్ ల ప్రొవిజన్ పిరియడ్ ను 3 సంవత్సరాల నుండి 2 సంవత్సరాలకు తగ్గించేల‌ని, ఈ మేర‌కు ఉన్న అవ‌కాశాల‌ను ప‌రిశీలించాల‌ని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి మంత్రి స్ప‌ష్టం చేశారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ డిపో లపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాల‌న్నారు. ఈ క‌మిటీ ద్వారా లాభాల్లోకి వచ్చేలా ఆయా డిపోలకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాల‌న్నారు.అరాంఘార్ లో అధునాతన బస్సు టెర్మినల్ నిర్మాణం కోసం ఆర్టీసీ , పోలీస్ శాఖల భూ బదలాయింపు పై చర్చించాలని తెలిపారు. నగరంలో కొత్త బస్సు డిపో లకు స్థల పరిశీలన చేసి జిల్లా కలెక్టర్ తో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని చెప్పారు.బస్సు ప్రమాదాలు తగ్గించడానికి డ్రైవర్ మానిటరింగ్ సిస్టం అమలు చేయాల‌న్నారు.
ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఫోర్త్ సిటీ లో బస్ టెర్మినల్ ఏర్పాటు ,బస్సు సౌకర్యాల పై అధ్యయనం చేయాలని నాగిరెడ్డిని ఆదేశించారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కండక్టర్ లు ,డ్రైవర్లు ఇతర ఉద్యోగులతో జూమ్ సమావేశం నిర్వహిస్తాన‌న్నారు. ఈమేర‌కు గురువారం స‌చివాల‌యంలో ఆర్టీసీ ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం నిర్వ‌హించిన‌ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ మేర‌కు అధికారుల‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చారు.

మహా లక్ష్మీ పథకం వచ్చిన తర్వాత సంక్షోభంలో ఉన్న ఆర్టీసీ క్రమక్రమంగా లాభాల బాటలోకి వస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి నెల వారిగా వస్తున్న మహాలక్ష్మి టికెట్ ఆదాయమే కాకుండా అదనపు ఆదాయంపై దృష్టి సాధించాలన్నారు. ఆర్టీసీ లో ఇప్పటి వరకు మహిళలు 237 కోట్ల జీరో టికెట్ ఉపయోగించుకున్నారని, ఈ మేర‌కు 7980 కోట్ల రూపాయలను ఆర్టీసీ కి ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. ఆర్టీసీ బస్సులు ,బస్ స్టేషన్ లలో టీమ్ మిషన్ ల ద్వారా వచ్చే టికెట్ పై అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ఆదాయాన్ని మరింత పెంచాలని సూచించారు.

ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతున్న తాండూరు ,వికారాబాద్ , బీహెచ్ఈఎల్ , మియాపూర్ , కుషాయిగూడ , దిల్ సుఖ్ నగర్ , హకీంపేట్ , రాణిగంజ్ , మిథాని తో పలు పలు డిపో లు నష్టాల బారిన ఉండడానికి గల కారణాలు , స్థానిక పరిస్థితులు ఆయా డిపోలు లాభాల బాట పట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీ వేయాలన్నారు.

నగరంలో ఇప్పటికే 500 వరకు ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయ‌ని, పీఎం ఈ -డ్రైవ్ కింద హైదరాబాద్ కి కేటాయించిన 2 వేల బస్సులు విడతల వారిగా రానుండడంతో అందుకు సంబంధించిన చార్జింగ్ స్టేషన్లు మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.

ఆర్టీసీలో నియామ‌కాలు

ఇప్పటికే ఆర్టీసీ లో 1000 ఆర్టీసీ డ్రైవర్లు ,743 శ్రామిక్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి పోలీస్ రిక్రూట్ మెంట్‌ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతున్న నియామ‌కాలు ఇంటర్వ్యూ దశలో ఉన్నాయ‌ని మంత్రి అన్నారు. ఈ నియామ‌కాలు పారదర్శకంగా జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. వచ్చే డిసెంబర్ చివరిలోపు 84 ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ ,114 సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుందని తెలిపారు.

మేడారం జాతర సమీపిస్తుండటంతో ములుగు బస్ స్టేషన్ నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని మంత్రి అధికారుల‌ను ఆదేశించారు. డిసెంబర్ లోపు స్లాబ్ పనులు పూర్తి చేయాలని జాతర సమీపిస్తుండటంతో భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. త ఏడాది మేడారం జాతర కోసం 3490 బస్సులు నడపగా 16.83 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ లో ప్రయాణించారు. ఈసారి జాతర కు 20 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ లో ప్రయాణిస్తారని అంచనా వేస్తూ 3800 బస్సులు నడపడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం , పెద్దపల్లి జిల్లా బస్సు డిపో పనుల పురోగతి పై అడిగి తెలుసుకున్నారు. పుష్కరాలు వచ్చే లోపు మంథని బస్ స్టేషన్ ఆధునీకరణ పూర్తి కావాలని ఆదేశించారు. మధిర బస్ స్టేషన్ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. హుజూర్ నగర్ ,కోదాడ బస్ స్టేషన్ ల శంకుస్థాపన వారం రోజుల్లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. మిర్యాలగూడ అప్ గ్రేడేషన్ పనులు ప్రారంభించాలని తెలిపారు.

ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్ లకు నిరంతరం శిక్షణ, ప్రతి బస్సు కి ఇద్దరు డ్రైవర్లు తప్పనిసరి నిర్ణయాన్ని కఠినతరం చేయాలని మంత్రి అధికారుల‌కు స్ప‌ష్టం చేశారు. డ్రైవర్లకు నిరంతరం మెడికల్ టెస్ట్ నిర్వహించాలని సూచించారు. ఆర్టీసీ మహిళా సంఘాలు ద్వారా 600 బస్సులు అద్దె ప్రాతిపదికన నడిపించాలని సెర్ఫ్ తో ఒప్పందం చేసుకుందన్నారు. ఇప్పటి వరకు 150 బస్సులు మహిళా సంఘాలు ఆర్టీసీ తో సంయుక్తంగా నడుస్తున్నాయి. మిగిలిన 450 బస్సులు కూడా మహిళా సంఘాల ద్వారా తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ,ఇతర ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.