Jupally Krishna Rao : రూ.4వేల పింఛన్ ఏమైంది: మంత్రి జూపల్లిని నిలదీసిన బామ్మ

బామ్మ ఒక్క ప్రశ్నతో మంత్రి జూపల్లికి షాక్! రేవంత్ ఇచ్చిన రూ.4వేల పింఛన్ హామీ ఎక్కడో తెలుసా? అసలు ఏమైందో చదవండి…

Jupally Krishna Rao : రూ.4వేల పింఛన్ ఏమైంది: మంత్రి జూపల్లిని నిలదీసిన బామ్మ

విధాత, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలో రూ.4వేల పింఛన్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్ధానం ఏమైందని ఓ బామ్మ మంత్రి జూపల్లి కృష్ణరావును నిలదీసిన ఘటన వైరల్ గా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి జూపల్లి, అభ్యర్థి నవీన్ యాదవ్ తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటింటి ప్రచారంలో తన వద్దకు ఓట్ల కోసం వచ్చిన మంత్రి జూపల్లిని రూ.4వేల పింఛన్ హామీ ఏమైందంటూ బామ్మ ప్రశ్నించింది. దీనికి జూపల్లి.. మీకు వినే ఓపిక ఉంది కదా అంటూ సమాధానమిస్తుండగానే..నాకు మీరు చెప్పేదంతా వినే ఓపిక లేదని..నేను చచ్చే ముసలిదాన్ని అని నాకు పింఛన్ కావాలి.. రోడ్లు, కరెంటు కావాలని నిష్కర్షగా చెప్పింది. మీరు ప్రశ్న అడిగినప్పుడు నేను చెప్పే సమాధానం వినాలి కదా అని మంత్రి జూపల్లి ఆమె ప్రశ్నలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే బామ్మ మాత్రం మీరు సమాధానం ఇవ్వొచ్చుగాని..ఇవ్వాళ ఓట్ల ముందు చెప్పిన మాట..ఓట్లు ముగిశాక ఉండదని..అందుకే వాగ్ధానం చేయవద్దని బామ్మ నిష్టూరం వ్యక్తం చేశారు.

బామ్మ మాటలతో ఖంగుతిన్న మంత్రి జూపల్లి.. గ్యాస్ కు రూ.500ఇస్తున్నామని, 200యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తున్నామని, ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నామని ఆమెను సమాధాన పరిచే ప్రయత్నం చేశారు. అయితే గ్యాస్ రూ.500రాలేదని, కరెంటు ఉచితమని చెప్పి మళ్లీ బిల్లులు ఎందుకు వేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ కరెంటు కోతలు ఎందుకొచ్చాయని బామ్మ ప్రశ్నించింది. దీంతో అసహనానికి గురైన మంత్రి జూపల్లి మీకు ఏది నిజం ఏది అబద్దమో తెల్వకుండా మాట్లాడితే ఏం చెప్పాలంటూ అక్కడి నుంచి ముందుకెళ్లిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బామ్మ వద్దకు వచ్చి నాకు ఓ అవకాశం ఇచ్చి గెలిపించాలని అభ్యర్థించారు. బతుకు బిడ్డ బతుకుర్రి..ఓట్లు వేయ్యగానే గెలువండి.. మీరే బతుకండి అంటూ బామ్మ వ్యాఖ్యానించింది. ఉప ఎన్నికల ప్రచారంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా ఉన్న బామ్మ..మంత్రి జూపల్లిల వాదోపవాదాల వీడియోను ప్రతిపక్ష బీఆర్ఎస్ సోషల్ మీడియా వైరల్ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.