పవన్ కల్యాణ్ సభకు హైకోర్టు అనుమతి నిరాకరణ

హైదరాబాద్‌లో జనసేన నిర్వహించాలనుకున్న తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు హైకోర్టు అనుమతి నిరాకరించింది. దీంతో పవన్ కళ్యాణ్ ప్రెస్‌మీట్‌కూ అనుమతి లభిస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది.

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభకు తెలంగాణ హైకోర్టు అనుమతి నిరాకరించింది. సభకు అనుమతినివ్వాలంటూ జనసేన నాయకులు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. హైదరాబాద్ లో మంగళవారం తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ నిర్వహించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. శాంతి భద్రతల నేపథ్యంలో ఈ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో జనసేన నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఇటు తెలంగాణ వాదులు సైతం మా వాదనలు వినాలని కేవీటీ దాఖలు చేశారు. హైకోర్టు జనసేన సభకు అనుమతి నిరాకరించడంతో సభ నిర్వహణకు ఆ పార్టీ నాయకులు చేసిన ఏర్పాట్లు అన్ని వృధా అయ్యాయి.

మీడియా సమావేశంపైనా సందేహాలు

హైదరాబాద్ లో జనసేన సభకు హైకోర్టు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఈ రోజు సాయంత్రం 4:30కి హైద‌రాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన ఇంట్లో ఏర్పాటు చేసి ప్రెస్‌మీట్ ఉంటుందో లేదోనన్న సందేహాలు నెలకొన్నాయి. సభకు అనుమతినివ్వని పోలీసులు..కనీసం ప్రెస్‌మీట్ పెట్టేందుకైనా అనుమ‌తిస్తారా చూద్దాం అంటూ ఇప్పటికే పవన్ కల్యాణ్ ట్వీట్‌ చేశారు. సభకు హైకోర్టు అనుమతి నిరాకరణ నేపథ్యంలో సాయంత్రం పవన్ ప్రెస్ మీట్ కు కూడా పోలీసులు అనుమతి ఇవ్వకపోవచ్చని అంచనా వేస్తున్నారు.

మరోవైపు పీసీసీ చీఫ్ బీ.మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరామ్, మంత్రి పొన్నం ప్రభాకర్, టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సైతం పవన్ సభ నిర్వహణను ప్రశ్నిస్తూ తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగెట్టేందుకే బీజేపీ డైరక్షన్ లో పవన్ పనిచేస్తున్నారంటూ వారు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సాయంత్రం పవన్ ప్రెస్ మీట్ కు అనుమతించకపోవచ్చన్న సందేహాలు వినిపిస్తున్నాయి.

Latest News