హైదరాబాద్‌ ప్రజలకు మరో రిలీఫ్‌.. కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి ఆరు లేన్ల ఫ్లైవోవర్‌

ఇప్పటి దాకా మియాపూర్‌, నిజాంపేట, బాచుపల్లి మార్గంలో ప్రయాణం 20 నిమిషాల వరకూ ఉండగా.. ఈ ఫ్లైవోవర్‌ నిర్మాణంతో ఆ సమయం కాస్తా.. ఐదు నిమిషాలు.. గరిష్ఠంగా పది నిమిషాలకు తగ్గిపోనున్నది.

హైదరాబాద్‌ పశ్చిమాన ఉన్న బాచుపల్లి, నిజాంపేట, మియాపూర్‌ ప్రాంత వాసుల ట్రాఫిక్‌ కష్టాలకు ఇక చెక్‌ పడనున్నది. ఇక్కడి ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు నిర్మించిన బాచుపల్లి ఫ్లైవోవర్‌ జూన్‌ నెల రెండోవారంలో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సైబరాబాద్‌ వెపు వెళ్లే ప్రయాణికులకు ఈ ఫ్లైవోవర్‌తో ట్రాఫిక్‌ కష్టాలు భారీగా తగ్గనున్నాయి. సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పడిన తర్వాత దాని పరిధిలో అందుబాటులోకి రానున్న తొలి ఫ్లైవోవర్‌ ఇదే కావడం విశేషం. ఫ్లైవోవర్‌ ప్రారంభానికి జూన్‌ 8వ తేదీ తేదీని ఖరారు చేసినట్టు తెలుస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దీనిని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

ఈ ఫ్లైవోవర్‌కు 2022లో అప్పటి మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. వాస్తవానికి 2024 నాటికే ఇది సిద్ధం కావాల్సి ఉన్నా.. అనేక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి నాలుగేళ్ల తర్వాత ఈ ఫ్లైవోవర్‌ ప్రజలకు అందుబాటులోకి రానున్నది. పశ్చిమ ప్రాంతంలో నిర్మించిన ఈ ఫ్లైవోవర్‌తో సమీప ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ మరింత అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు.

గండి మైసమ్మ, గాజులరామారాం, బాచుపల్లి, నిజాంపేట, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక మంది ఐటీ ఉద్యోగులు, ఇతరులు నిత్యం మియాపూర్‌, కేపీహెచ్‌బీ, హైటెక్‌సిటీ, మదీనాగూడ, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రయాణిస్తూ ఉంటారు. ఈ మార్గంలో రద్దీ కారణంగా ఇప్పటి దాకా అనుభవించిన ట్రాఫిక్‌ కష్టాలకు ఈ ఫ్లైవోవర్‌తో తెరపడనుంది. ఈ ప్రాంతాల్లో కొంతకాలంగా పెరిగిన రద్దీతో ఈ మార్గంలో నిత్యం ట్రాఫిక్‌ జామ్‌ అవుతూ ఉన్నది. తాజాగా రెండువైపులా ప్రయాణించేలా ఆరు లేన్లతో ఫ్లైవోవర్‌ సిద్ధమైంది. దీని మొత్తం పొడవు 1.3 కిలోమీటర్లు. 141 కోట్ల వ్యయంతో దీన్ని చేపట్టారు. ఇప్పటి దాకా మియాపూర్‌, నిజాంపేట, బాచుపల్లి మార్గంలో ప్రయాణం 20 నిమిషాల వరకూ ఉండగా.. ఈ ఫ్లైవోవర్‌ నిర్మాణంతో ఆ సమయం కాస్తా.. ఐదు నిమిషాలు.. గరిష్ఠంగా పది నిమిషాలకు తగ్గిపోనున్నది.

Latest News